Nalgonda BJP MP Tickets: ప్రధాని మోదీ చరిష్మాతో గెలవొచ్చని.. బీజేపీలో ఎంపీ టిక్కెట్ల కోసం పోటీ…
Nalgonda BJP MP Tickets: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ Modi చరిష్మాతో ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో తేలిగ్గా గెలవచ్చని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు భావిస్తుండటంతో ఎంపీ టిక్కెట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.
Nalgonda BJP MP Tickets: లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవాలో గెలివొచ్చని భావిస్తున్న వారంతా బీజేపీ టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. శాసన సభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కని ఆ పార్టీ నుంచి పార్లమెంటు నియోజవకర్గాల్లో గెలుస్తామన్న ధీమాతో టికెట్లు కోరుతున్నారు.. ఈ కారణంగానే ఆ పార్టీలో ఎంపీ సీట్ల టికెట్లకు గిరాకీ పెరిగిందని ప్రచారం జరుగుతోంది. పార్టీ పదవుల్లో, అనుబంధ విభాగాల్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న నాయకులు వాల్ రైటింగ్స్ తో హోరెత్తిస్తున్నారు.
వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పార్టీ నాయకత్వం అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టినా.. నామమాత్రంగానే పోటీ ఇవ్వగలిగారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన చోట్ల డిపాజిట్ దక్కలేదు.
గతంలో కంటే గణనీయంగానే ఓట్ల శాతం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉంటుందని పార్లమెంటు టికెట్లు అడుగుతున్న నాయకులు చెబుతున్నారు.
నల్గొండ నుంచి మూడు పేర్ల పరిశీలన
నల్గొండ ఎంపీ స్థానంపై బీజేపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. ఈ నియోజకవర్గం పరిధిలో పట్టణాల సంఖ్య ఎక్కువగా ఉండడం, అర్బన్ ఓట్ బీజేపీకి అనుకూలంగా ఉంటుందన్న అంచనాతో పార్టీ ఉంది.
ఇక్కడి నుంచి గత 2019 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన గార్లపాటి జితేందర్ టికెట్ ఆశిస్తున్నారు. కిసాన్ మోర్చాకు సుదీర్ఘ కాలం సేవలు అందించిన గోలి మధుసూదన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన నూకల నర్సింహారెడ్డి ఈ సారి టికెట్ రేసులో ఉన్నారు వీరే కాకుండా బీసీ కోటాలో టికెట్ వస్తుందని భావిస్తున్న మన్నెం రంజిత్ యాదవ్ కూడా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు.
నియోజకవర్గం పరిధిలో నల్గొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడెం, సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటు బ్యాంకు ఉందని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్వే ప్రకారం ప్రజల్లో పేరున్న వారిని అభ్యర్థులుగా ఎంచుకునే దిశలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, రెండు మూడు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
భువనగిరి కోసం మాజీ ఎంపీ ప్రయత్నాలు
భువనగిరి లోక్ సభ నియోజవర్గం నుంచి టికెట్లు ఆశిస్తున్న వారిలో ప్రధానంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలుగా కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. 2021 చివరలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గులాబీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ప్రసుతం ఆయన భువనగిరి ఎంపీ టికెట్ కు ప్రధాన పోటీ దారుగా ఉన్నారు.
పార్టీ రాష్ట్ర నాయకుడు గతంలో మునుగోడు అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసిన గంగిడి మనోహర్ రెడ్డి కూడా ఈ సారి టికెట్ ఆశిస్తున్నారు. ప్రధానంగా ఈ ఇద్దరు నాయకుల మధ్యే టికెట్ కు పోటీ కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్ల శాతం, ఎక్కడెక్కడ ఆదరణ లభించింది అన్నఅంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విజయాలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోఢీ చరిష్మా తమకు కలిసి వస్తాయని, ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని భావిస్తున్న బీజేపీ నాయకులు ఎంపీ టికెట్ల కోసం సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి మూడేసి పేర్ల చొప్పున పరిశీలిస్తున్న నాయకత్వం త్వరలోనే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే వీలుందని చెబుతున్నారు.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )