Nalgonda And Bhuvanagiri: లోక్‌సభ టికెట్ల కోసం ప్రధాన పార్టీల్లో ఆశావహుల సందడి..-aspirants in major parties are clamoring for lok sabha tickets ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda And Bhuvanagiri: లోక్‌సభ టికెట్ల కోసం ప్రధాన పార్టీల్లో ఆశావహుల సందడి..

Nalgonda And Bhuvanagiri: లోక్‌సభ టికెట్ల కోసం ప్రధాన పార్టీల్లో ఆశావహుల సందడి..

HT Telugu Desk HT Telugu
Feb 09, 2024 01:21 PM IST

Nalgonda And Bhuvanagiri: పార్లమెంటు ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్ సభ నియోజకవర్గాలకు ఆయా పార్టీల్లోని నేతలకు గిరాకీ పెరుగుతోంది.

ఉమ్మడి నల్గొండలో లోక్‌సభ టిక్కెట్ల కోసం తీవ్రమైన పోటీ
ఉమ్మడి నల్గొండలో లోక్‌సభ టిక్కెట్ల కోసం తీవ్రమైన పోటీ

Nalgonda And Bhuvanagiri: అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్లకు యమ డిమాండ్ కనిపిస్తోంది. గత ఏడాది డిసెంబరులో జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

దీంతో సహజంగానే కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్లకు డిమాండ్ పెరిగింది. ఒక్కో లోక్ సభా నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెంగ్మెంట్లు ఉండగా.. నల్లగొండ ఎంపీ సీటు పరిధిలో.. నల్గొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడెం, హుజూర్ నగర్, కోదాడ స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉండగా, ఒక్క సూర్యాపేట మాత్రమే బీఆర్ఎస్ వద్ద ఉంది.

భువనగిరి ఎంపీ సీటు పరిధిలోని జనగామ అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ చేతిలో ఉండగా, మిగిలిన ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం ఆరు సెగ్మెంట్లు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి.

ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. నల్గొండ ఎంపీ సీటుకు ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి, సూర్యాపేట నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి, కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఇంకా మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు.

భువనగిరి టికెట్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుని తనయుడు డాక్టర్ సూర్యపవన్ రెడ్డి ఆశపెట్టుకున్నారు. మరో వైపు నల్గొండ స్థానానికి కోమటిరెడ్డి కూతురు శ్రీనిధిరెడ్డి కూడా టికెటె రేసులో ఉన్నారన్న ప్రచారం కాంగ్రెస్ లో జరుగుతోంది. మొత్తంగా నల్గొండ, భువనగిరి ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్ లో వారసుల పోటీ ఎక్కువగా కనిపిస్తోంది.

బీఆర్ఎస్‌లో నల్గొండకు డిమాండ్…

నల్గొండ ఎంపీ సీటుకు బీఆర్ఎస్ లో కూడా పోటీ కనిపిస్తోంది.. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి నల్గొండ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ మేరకు ఆయనకు అధిష్టానం నుంచి హామీ కూడా లభించిందని చెబుతున్నా స్పష్టత కొరవడింది. ఈ సీటు నుంచి తాము కూడా పోటీ చేస్తామని కొందరు మాజీ ఎమ్మెల్యేలు చెబుతుండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.

భువనగిరి నుంచి అక్కడి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పేరు వినిపించినా.. ఆయన సుముఖంగా లేరన్న ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డికి దగ్గరి అనుచరుడిగా ఉన్న మరో నాయకుడి టికెట్ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాంగ్రెస్ తో పోలీస్తే.. బీఆర్ఎస్ లో టికెట్ల కోసం పెద్దగా పోటీ లేనట్లే కనిపిస్తోంది.

బీజేపీలో పెరిగిన ఆశావాహులు

మరో వైపు కేంద్రంలో ఈ సారి కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉన్న బీజేపీ నాయకులు ఎంపీ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. నల్గొండ నుంచి గత 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన జితేంద్ర కుమార్, ప్రముఖ న్యాయవాది నూకల నర్సింహారెడ్డి, నల్గొండ మున్సిపాలిటీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ తదితరులు టికెట్ ఆశిస్తున్నారు.

భువనగిరిలో మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తనకు టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఆయన 2014లో బీఆర్ఎస్ నుంచి ఇక్కడ ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఆయన బీఆర్ఎస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇపుడు తనకు టికెట్ వస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఇంకా... బీజేపీ నుంచి గంగిడి మనోహర్ రెడ్డి, శ్యాంసుందర్ రావు తదితరులు టికెట్లు ఆశిస్తున్నారు.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

Whats_app_banner