Tenneti Krishna Prasad: వరంగల్ ఆశించి.. బాపట్ల దక్కించుకున్న మాజీ ఐపీఎస్.. బాపట్ల లోక్‌సభకు తెన్నేటి కృష్ణప్రసాద్
Tenneti Krishna Prasad: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో అనూహ్యంగా తెలంగాణ క్యాడర్ మాజీ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్ చోటు దక్కించుకున్నారు. బాపట్ల నుంచి ఎంపీగా కృష్ణ ప్రసాద్ పోటీ చేయనున్నారు. కృష్ణ ప్రసాద్ గతంలో విజయవాడ సీపీగా పనిచేశారు.
Tenneti Krishna Prasad:టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో అనూహ్యంగా తెలంగాణ క్యాడర్ మాజీ డీజీ స్థాయి అధికారి తెన్నేటి కృష్ణ ప్రసాద్‌ను ఖరారు చేశారు. కృష్ణ ప్రసాద్ వాస్తవానికి కొద్ది రోజుల క్రితం వరకు బీజేపీ తరపున వరంగల్ టిక్కెట్ ఆశించారు.
కొంత కాలంగా వరంగల్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెన్నేటి కృష్ణప్రసాద్ వరంగల్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ప్రధాని మోదీ పర్యటనల్లో కూడా ఆయనకు స్వాగతం పలికారు. బీజేపీలో ఆయన అభ్యర్ధిత్వం ఖాయమని భావించిన వేళ అనూహ్యంగా ఏపీలో టీడీపీ టిక్కెట్ దక్కింది.ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి తరపున ఆయన పోటీ చేయనున్నారు.
మరోవైపు బాపట్ల నియోజక వర్గంలో వైఎస్సార్సీపీ తరపున సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ పేరునును ఖరారు చేశారు. ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గమైన బాపట్లలో 2014లో టీడీపీ అభ్యర్ధి మాల్యాద్రి శ్రీరామ్ గెలిచారు.
2019లో వైసీపీ అభ్యర్ధి సురేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న బాపట్లలో 2014లో వైసీపీ అభ్యర్ధి అమృతపాణిని మాల్యాద్రి శ్రీరామ్ 32వేల ఓట్లతో ఓడించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి 16వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
ముక్కు సూటి అధికారిగా గుర్తింపు..
1960లో హైదరాబాద్ జన్మించిన తెన్నేటి కృష్ణప్రసాద్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులుగా పనిచేశారు. తండ్రి సుబ్బయ్య ఐటీఐ ప్రిన్సిపల్‌గా తల్లి విజయలక్ష్మీ స్కూల్ టీచర్‌గా పనిచేశారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన కృష్ణ ప్రసాద్ పోలీస్ శాఖలో 34ఏళ్లు పనిచేశారు.
ఎన్‌ఐటి వరంగల్ నుంచి బిటెక్ పూర్తి చేసిన కృష్ణప్రసాద్ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబిఏ పూర్తి చేశారు. మావోయిస్టుల్ని జనజీవన స్రవంతిలో కలకపడంలో కీలక పాత్ర పోషించారు.
సంజీవని ఆపరేషన్‌తో మావోయిస్టులను ప్రజా జీవితంలో తీసుకురావడానికి ప్రయత్నించారు. సరెండర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా మావోయిస్టులను ప్రజాజీవితంలో కలిసేలా ప్రోత్సహించే వారు. 450మందికి పైగా మావోయిస్టుల్ని తిరిగి జనజీవితంలోకి తీసుకొచ్చిన రికార్డు ఉంది.
డిసెంబర్ 2009లో ఐజీ పోలీస్ సర్వీసెస్ హోదాలో ఉమ్మడి ఏపీలో 1865 పోలీస్ స్టేషన్లను కంప్యూటర్లతో అనుసంధానించారు. నాలుగు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. రెండు రేంజ్లలో డిఐజిగా విధులు నిర్వర్తించారు.
సీఐడి చీఫ్‌గా, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈడీగా, ఏపీ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా అడిషినల్ డీజీ బడ్జెట్‌గా, పోలీస్ అకాడమీలో డైరెక్టర్‌గా పనిచేశారు.
విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, వరంగల్, విశాఖ రేంజ్‌లలో డిఐజిగా పనిచేశారు. నెల్లూరు, విశాఖపట్నం, మెదక్, గుంటూరు ఎస్పీలుగా గతంలో పనిచేశారు. ఉమ్మడి గుంటూరులో భాగమైన బాపట్లలో లోక్‌సభ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి గతంలో ఎస్పీగా పనిచేసిన అనుభవం పనికొస్తుందనే ఉద్దేశంతో కృష్ణ ప్రసాద్ అభ్యర్ధిత్వానికి టీడీపీ మొగ్గు చూపింది.
కృష్ణ పుష్కరాల్లో బదిలీ….
తెన్నేటి కృష్ణప్రసాద్ 2004లో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. కృష్ణ పుష్కరాల నిర్వహణలో ఏర్పాట్లలో లోపాలకు బాధ్యుడిని చేస్తూ అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది.
కృష్ణా పుష్కరాలకు కొద్ది నెలల ముందు విజయవాడ సీపీగా కృష్ణ ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. పుష్కరాల ప్రారంభమైన తొలిరోజే ప్రకాశం బ్యారేజీ దిగువున జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. నదీ స్నానాలకు అనుమతించేందుకు కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ దిగువున రివర్ స్లూయిజ్ వంతెనకు సరైన బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంతో జనం తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
సరైన బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడమే కారణమని భావించిన ప్రభుత్వం కృష్ణప్రసాద్‌తో పాటు అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని బదిలీ చేసింది. ప్రభాకర్ రెడ్డి తర్వాతి కాలంలో వైఎస్సార్ కార్యదర్శిగా సిఎంఓలో బాధ్యతలు చేపట్టారు. కృష్ణప్రసాద్ చాలా కాలం లూప్‌లైన్‌లో ఉండిపోవాల్సి వచ్చింది.
వరంగల్ టిక్కెట్ కోసం ప్రయత్నించి….
కృష్ణ ప్రసాద్ కొద్ది రోజులుగా బీజేపీ తరపున వరంగల్ టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. వరంగల్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో ఏపీలో బాపట్ల టిక్కెట్ కోసం ప్రయత్నించి విజయం సాధించారు. ఆయన అత్త శమంతక మణి గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ పరిచయాలతోనే ఆయనకు బాపట్ల టిక్కెట్ ఖరారైనట్టు తెలుస్తోంది.
SarathCB
సంబంధిత కథనం