Janasena : పిఠాపురంలో భారీ మెజార్టీ దిశగా పవన్ కల్యాణ్, మూడు స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం
Janasena : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన దూసుకుపోతుంది. పోటీ చేసిన 21 స్థానాల్లో లీడింగ్ ఉన్న జనసేన ఇప్పటికే మూడు స్థానాల్లో విజయం సాధించింది. పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు.
Janasena : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎన్డీఏ కూటమి...ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతుంది. టీడీపీ, బీజేపీ పొత్తులో కీలక పాత్ర పోషించిన జనసేన... పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఆధిక్యం కనబరుస్తోంది. తాజా ఫలితాల మేరకు జనసేన మూడు స్థానాల్లో విజయం సాధించింది. భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు విజయం సాధించగా, నరసాపురంలో బొమ్మిడి నాయకర్, రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ విజయం సాధించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 14వ రౌండ్ ముగిసే సరికి 61, 152 ఓట్ల మెజార్టీతో పవన్ ముందంజలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంత పవన్ మెజార్టీ సాధించారు.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన తొలి విజయం నమోదు చేసింది. రాజానగరం నుంచి పోటీ చేసిన బత్తుల బలరామకృష్ణ వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాపై జయకేతనం ఎగువవేశారు. భీమవరంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ప్రత్యర్థి గ్రంథి శ్రీనివాస్ పై 66,974 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి బొమ్మిడ నారాయణ నాయకర్ గెలుపొందారు. ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావుపై 26 వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విశాఖ దక్షిణ, పెందుర్తిలో జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాకినాడ గ్రామీణంలో 7 రౌండ్లు ముగిసే సరికి జనసేన అభ్యర్థి పంతం నానాజీ 22 వేల ఆధిక్యంలో ఉన్నారు.
సంబంధిత కథనం