Police Mock Drill : ఒంగోలులో భారీగా పోలీసుల మోహరింపు, అల్లర్లు కాదు మాక్ డ్రిల్!
Police Mock Drill : ఏపీలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. కౌంటింగ్ నాడు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Police Mock Drill : ఒంగోలులో జనం రద్దీ ప్రాంతం అది. పదుల సంఖ్యలో పోలీసులు, పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులు టైర్లకు నిప్పుపెట్టి పోలీసులపైకి దూసుకొచ్చారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఏపీలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బుధవారం ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఇవి నిజమైన అల్లర్లు కాదు. పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ లో భాగం. ఒంగోలులో పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. వాస్తవంగా అల్లర్లలో చోటుచేసుకుని ఘటనలను అనుకరిస్తూ పోలీసులు మాక్ డ్రిల్ చేశారు. ఏపీలో మరికొన్ని రోజుల్లో కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజున, ఆ తర్వాత ఏవైనా అవాంతరాలు ఎదురైతో సమర్థవంతంగా అడ్డుకునేందుకు అధికారులను సిద్ధం చేయడమే లక్ష్యంగా పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.
పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు
ఏపీలో జూన్ 4న ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్ధమవుతున్న తరుణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసులు మాక్ డ్రిల్‌లు నిర్వహిస్తున్నారు. ఈ కసరత్తులు, వాస్తవ సంఘర్షణలను పోలి ఉండేలా వాస్తవికంగా నిర్వహించారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలకు పోలీసుల నిర్లక్ష్యం ఒక కారణమని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కౌంటింగ్ కు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ రోజున, ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసకు సంబంధించి 33 కేసులు నమోదు అయ్యాయి. 1,370 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ ఘటనలపై స్పందించిన ఈసీ నిర్లక్ష్యం వహించిన స్థానిక అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ ప్రారంభించింది. కౌంటింగ్ కు పటిష్ట భద్రత ఏర్పాటుచేసేందుకు 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా రంగంలోకి దింపింది ఈసీ.
కౌంటింగ్ కు పటిష్ట భద్రత
కౌంటింగ్ రోజున పలు ప్రాంతాల్లో హింస చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు రిపోర్టు ఇచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎప్పుడూ లేని విధంగా జిల్లాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో అడుగడుగు జల్లెడ పడుతున్నారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ కార్డెన్ సెర్చ్ చేపడుతున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. స్వయంగా ఎస్పీలు, ఉన్నతాధికారులు రంగంలోకి దిగి బృందాలతో సమస్యాత్మక ప్రదేశాలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. కౌంటింగ్ ముగిసే వరకూ పోలీసు సిబ్బందికి ఎలాంటి సెలవులు లేవని ఉన్నతాధికారులు చెబుతున్నారు. పోలింగ్ రోజున హింస జరిగిన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఇల్లు పోలీసులు తనిఖీ చేస్తున్నారు. హిస్టరీ షీట్స్ ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని బైండోవర్ చేస్తున్నారు. సంఘ విద్రోహశక్తుల కదలికలపై నిఘాపెట్టామని, ఏ చిన్న అనుమానం వచ్చినా అరెస్టు చేస్తున్నారమన్నారు పోలీసులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అల్లర్లపై అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు.
సంబంధిత కథనం