Now NCBN Turn: ఇక చంద్రబాబు వంతు, చంద్రబాబు మొదటి డిమాండ్ అదేనా? ప్రత్యర్థులపై బదులు తీర్చుకుంటారా!-chandrababus turn now is that the first demand of chandrababu ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Now Ncbn Turn: ఇక చంద్రబాబు వంతు, చంద్రబాబు మొదటి డిమాండ్ అదేనా? ప్రత్యర్థులపై బదులు తీర్చుకుంటారా!

Now NCBN Turn: ఇక చంద్రబాబు వంతు, చంద్రబాబు మొదటి డిమాండ్ అదేనా? ప్రత్యర్థులపై బదులు తీర్చుకుంటారా!

Sarath chandra.B HT Telugu
Jun 04, 2024 01:51 PM IST

NCBN Turn: ఏపీలో ఐదేళ్ల తర్వాత చంద్రబాబు హవా మళ్లీ మొదలైంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఐదేళ్ల పాటు పార్టీని బతికించుకుంటూ అటుపోట్లు తట్టుకుని నిలబడిన చంద్రబాబు ఇప్పుడేం చేయబోతున్నారనే ఆలోచనే అందరిలో నెలకొంది.

జగన్‌పై చంద్రబాబు బదులు తీర్చుకుంటారా?
జగన్‌పై చంద్రబాబు బదులు తీర్చుకుంటారా?

NCBN Turn: ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఆ పార్టీకి ఇప్పుడు అదే ప్రజలు కనీవిని ఎరుగని మెజార్టీని కట్టబెట్టారు. తిరుగులేని అధికారాన్ని చేతికి అందించారు. భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న చంద్రబాబు తర్వాత ఏమి చేస్తారనే సందేహమే అందరిలో ఉంది.

ఏపీలో తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయడంతో చంద్రబాబు నాయుడు ఏమి చేయబోతున్నారనే సందేహం అందరిలో ఉంది. ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేసిన టీడీపీ అసెంబ్లీలో భారీ విజయాన్ని నమోదు చేసింది. అటు పార్లమెంటు ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు ఆధిక్యం సాధించారు. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్‌ కంటే భారీ ఆధిక్యాన్ని టీడీపీ దక్కించుకుంది. 

మరోవైపు ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ గణనీయంగా పార్లమెంటు స్థానాలను దక్కించుకోనుంది. ఆ పార్టీ అభ్యర్థులు ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించనుండటంతో చంద్రబాబు రాజకీయంగా ఎలాంటి డిమాండ్లను తెరపైకి తెస్తారనే చర్చ జరుగుతోంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసింది. దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును ఉంచారు. బెయిల్‌ దొరక్కుండా రకరకాల అడ్డంకులు సృష్టించారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలతో జైలుకు పంపి, ఎన్నికలకు ముందు ప్రజల్లో లేకుండా చేయాలని ప్రయత్నాలు చేశారు. బాబు అరెస్ట్‌తో రెండు నెలల పాటు పార్టీ కార్యకలాపాలన్ని నిలిచిపోయాయి.

టీడీపీ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. చంద్రబాబు బెయిల్‌ ప్రయత్నాలతో విలువైన సమయం వృధా అయిపోయిందనే ఆందోళన టీడీపీ శ్రేణుల్ని వేధించింది. ఓ దశలో టీడీపీ నాయకులు బయటకు రావడానికి కూడా భయపడిపోయారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత చంద్రబాబుకు బెయిల్ లభించింది.

చంద్రబాబు జైల్లో, బెయిల్‌ కోసం లోకేష్ ఢిల్లీకి పరిమితమైన సమయంలో పార్టీ కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయి. ఆ సమయంలో టీడీపీకి జనసేన బలంగా మద్దతు ఇచ్చింది. చంద్రబాబు విషయంలో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పవన్ కళ్యాణ్‌ ఎఫెక్ట్ కూడా బాగా పనిచేసింది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే వాదనకు కట్టుబడి పవన్ కళ్యాణ్‌ టీడీపీతో ముందుకు సాగారు. ఆ తర్వాత బీజేపీని కూడా తమతో కలుపుకోగలిగారు. నిజానికి బీజేపీకి ఓట్ల రూపంలో ఏపీలో పెద్దగా బలంగా లేకపోయినా, రాజకీయంగా బలమైన అండ దొరికేలా చేసింది. వైసీపీని ఢీకొట్టాలంటే టీడీపీ, జనసేన పార్టీలు మాత్రమే సరిపోవనే స్పష్టతతోనే చంద్రబాబు బీజేపీ కోరినన్ని సీట్లను కేటాయించేందుకు సిద్ధమైంది.

ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి భారీగా లోక్‌సభ సీట్లు రావడంతో కేంద్రంలో ఆ పార్టీ కీలక పాత్ర పోషించనుంది.  16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో  చంద్రబాబు డిమాండ్లకు ఎన్డీఏ కూటమి నేతలు అనివార్యంగా అమోదించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

చంద్రబాబు డిమాండ్ అదేనా…

ఏపీలో చంద్రబాబు అధికారాన్ని చేపట్టి, ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగేందుకు కొన్ని షరతులు విధించే అవకాశాలు లేకపోలేదు. చంద్రబాబును రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డితో అదే బాట అనుసరించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పలు సిబిఐ, ఈడీ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. దాదాపు పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారు. దీంతో ఇప్పటికే జగన్‌పై ఉన్న అభియోగాల సంగతి తేల్చాలని ఒత్తిడి చేసే అవకాశాలు లేకపోలేదు.

మరోవైపు ఐదేళ్ల పాలనలో పలు అక్రమాలు జరిగాయని టీడీపీ ఎప్పట్నుంచో ఆరోపిస్తోంది. ఇసుక, లిక్కర్‌ అమ్మకాల్లో కోట్ల రుపాయల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. వీటిపై కూడా విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. తనను ఇబ్బందులకు గురి చేసిన వారి విషయంలో అదే తరహా వైఖరిని చంద్రబాబు కూడా ప్రదర్శించే అవకాశాలు లేకపోలేదు. 

WhatsApp channel