Yuvraj on World Cup 2023 Final: అలా చేస్తేనే టీమిండియా ఓడిపోతుంది: ఫైనల్ మ్యాచ్‌పై యువరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Yuvraj on World Cup 2023 Final: వరల్డ్ కప్ 2023లో ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌పై యువరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియా ఓడిపోయే అవకాశాలపై అతడు స్పందించాడు.
Yuvraj on World Cup 2023 Final: వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియాతో టీమిండియా ఫైనల్ ఆడే ముందు 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. చివరిసారి ఆస్ట్రేలియాను వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో ఇండియా ఓడించడంలో కీలకపాత్ర పోషించిన యువీ.. ఇప్పుడు ఫైనల్లో టీమిండియా అవకాశాలపై స్పందించాడు.
ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాపై టీమిండియా తన సొంత పొరపాట్లతోనే ఓడిపోయే అవకాశాలు ఉంటాయని యువరాజ్ అన్నాడు. అదృష్టవశాత్తూ ఈ టోర్నీలో ఇండియన్ టీమ్ అలాంటి తప్పులు చేయడం లేదని చెప్పాడు. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు యువీ ఆజ్‌తక్ ఛానెల్ తో మాట్లాడాడు.
"ఇండియా ఈ ఫైనల్ ఓడుతుంది అంటే అది కేవలం వాళ్ల సొంత తప్పుల వల్లే. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకూ టీమ్ నుంచి అలాంటి పొరపాట్లేమీ జరగలేదు. దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఆ తప్పులు జరగకూడదని నేను ఆశిస్తున్నాను. కానీ ఇండియా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. అందరూ బాగా ఆడుతున్నారు. కానీ వాళ్లు ఆస్ట్రేలియాతో ఆడనుండటమే అసలు సమస్య. వరల్డ్ కప్ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలిసిన టీమ్ అది" అని యువీ అన్నాడు.
ఇక ఆస్ట్రేలియాను సెమీస్ లో గెలిపించిన స్టార్క్, కమిన్స్ పై కూడా అతడు స్పందించాడు. "సౌతాఫ్రికాతో మ్యాచ్ లో వాళ్ల బ్యాటర్లందరూ ఔటయ్యారు. కానీ కమిన్స్, స్టార్క్ బ్యాట్స్‌మెన్ లాగా ఒత్తిడిని అధిగమించారు. వాళ్లు భారీ షాట్లు ఆడలేదు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వెళ్లారు. చివరి వరకూ వేచి చూసి మ్యాచ్ గెలిచారు" అని యువరాజ్ అన్నాడు.
2003 వరల్డ్ కప్ లో ఇండియా ప్రదర్శన గురించి కూడా యువీ చెప్పాడు. "2003లో మనం కూడా బాగానే ఆడాం కానీ ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఫైనల్లో ఇదే ఆస్ట్రేలియాతో ఓడిపోయాం. కానీ ఈసారి ఇండియా వరల్డ్ కప్ ను డామినేట్ చేస్తోంది. ఆస్ట్రేలియా విజయంతో ప్రారంభించకపోయినా.. తర్వాత బాగా ఆడి ఫైనల్ చేరింది" అని యువరాజ్ అన్నాడు.