World Cup 2023 Prize Money: వరల్డ్ కప్ 2023 ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిన ఐసీసీ.. విజేతకు ఎంత దక్కుతుందో తెలుసా?
World Cup 2023 Prize Money: వరల్డ్ కప్ 2023 ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది ఐసీసీ.. ఈ మెగా టోర్నీ విజేతకు 40 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ దక్కనుండటం విశేషం.
World Cup 2023 Prize Money: వరల్డ్ కప్ 2023 ప్రైజ్ మనీ రివీల్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). శుక్రవారం (సెప్టెంబర్ 22) సోషల్ మీడియా ద్వారా ఐసీసీ ప్రైజ్ మనీ వివరాలను వెల్లడించింది. ఈసారి టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ కోటి డాలర్లు (సుమారు రూ.82 కోట్లు) కావడం విశేషం. ఇక విజేతకు 40 లక్షల డాలర్లు (సుమారు రూ.33 కోట్లు) దక్కుతాయి.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్లో ఓడిపోయిన రన్నరప్ టీమ్ కు 20 లక్షల డాలర్లు (సుమారు రూ.16.5 కోట్లు) దక్కనున్నాయి. ఈసారి వరల్డ్ కప్ లో మొత్తం పది టీమ్స్ తలపడుతున్నాయి.
లీగ్ స్టేజ్ ప్రైజ్ మనీ ఇలా..
వరల్డ్ కప్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనుంది. అంటే మొత్తం 10 జట్లలో ప్రతి టీమ్ మిగతా 9 టీమ్స్ తో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. లీగ్ స్టేజ్ లో సాధించిన విజయాలకు కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. ఒక్కో విజయానికి 40 వేల డాలర్లు (సుమారు రూ.33 లక్షలు) ఇస్తారు. గ్రూప్ స్టేజ్ ముగిసిన తర్వాత టాప్ లో నిలిచిన నాలుగు జట్లు సెమీ ఫైనల్ వెళ్తాయి.
ఇక లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టే జట్లు ఒక్కోదానికి లక్ష డాలర్లు (సుమారు రూ.82 లక్షలు) ఇస్తారు. 2025లో జరగబోయే మహిళల వరల్డ్ కప్ ప్రైజ్ మనీని కూడా ఐసీసీ అనౌన్స్ చేసింది. ఇక నుంచి పురుషుల, మహిళల టోర్నీలకు ఒకే ప్రైజ్ మనీ ఇవ్వాలని ఈ మధ్యే ఐసీసీ నిర్ణయించడంతో ఆ వరల్డ్ కప్ లోనూ ఇదే ప్రైజ్ మనీ వర్తిస్తుంది.
ఇక వరల్డ్ కప్ 2023లో ఆతిథ్య ఇండియాతోపాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. శ్రీలంక, నెదర్లాండ్స్ టీమ్స్ అర్హత టోర్నీ ద్వారా ప్రధాన టోర్నీకి క్వాలిఫై అయ్యాయి. మొత్తం 10 వేదికల్లో 48 మ్యాచ్ లు జరుగుతాయి. తొలి మ్యాచ్, ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనున్నాయి.