Team India at World Cup 2023: 9 మ్యాచ్‌లు.. 9 నగరాలు.. 8400 కి.మీ. ప్రయాణం.. వరల్డ్ కప్‌లో టీమిండియా భారత్ దర్శన్
Team India at World Cup 2023: 9 మ్యాచ్‌లు.. 9 నగరాలు.. 8400 కి.మీ. ప్రయాణం.. వరల్డ్ కప్‌లో టీమిండియా భారత్ దర్శన్ ఇలా సాగనుంది. ఒకవేళ ఫైనల్ వరకూ వెళ్తే ఈ ప్రయాణం 10 వేల కి.మీ. వరకూ సాగనుండటం గమనార్హం.
Team India at World Cup 2023: వరల్డ్ కప్ 2023లో టీమిండియా భారత్ దర్శన్ చేయనుంది. స్వదేశంలో మెగా టోర్నీ జరగనుండటంతో మన జట్టును సాధ్యమైనంత వరకూ దేశంలోని అన్ని మూలల్లో ఉన్న స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడించాలన్న ఉద్దేశంతో షెడ్యూల్ సిద్ధం చేశారు. దీంతో ఇండియా లీగ్ స్టేజ్ లో ఆడే 9 మ్యాచ్ లు 9 నగరాల్లో జరగనున్నాయి.
వరల్డ్ కప్ లీగ్ స్టేజ్ లోనే టీమిండియా ఏకంగా 8400 కి.మీ. ప్రయాణం చేయాల్సి వస్తోంది. 34 రోజుల వ్యవధిలో ఈ 9 మ్యాచ్ లు జరుగుతాయి. ఒకవేళ సెమీఫైనల్, ఫైనల్ కూడా ఆడితే ఈ ప్రయాణం 42 రోజులలో 9700 కి.మీ.కు చేరుతుంది. ఇండియన్ టీమ్ ప్రతి మూడో రోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక్కో లీగ్ మ్యాచ్ కోసం దేశంలోని ఒక్కో మూలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీమిండియా భారత్ దర్శన్ ఇలా..
లీగ్ స్టేజ్ లో ఒక్కో స్టేడియంలో ఒక్క మ్యాచ్ ఆడనున్న ఏకైక టీమ్ ఇండియా మాత్రమే. ఇతర టీమ్స్ కనీసం రెండు మ్యాచ్ లైనా ఒకే స్టేడియంలో ఆడుతున్నాయి. దీంతో ఇండియన్ టీమ్ ప్రయాణ భారం పెరిగిపోయింది. ఆ ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం.
- ఇండియా తొలి మ్యాచ్ చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడుతుంది. అక్కడి నుంచి రెండో మ్యాచ్ కోసం ఢిల్లీ వెళ్లాలి. అంటే 1761 కి.మీ. ప్రయాణించాలి.
- అక్కడి నుంచి మూడో మ్యాచ్ కోసం అహ్మదాబాద్ వెళ్లాలి. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ 775 కి.మీ.
- ఇక నాలుగో మ్యాచ్ కోసం అహ్మదాబాద్ నుంచి పుణె రావాలి. ఈ నగరాల మధ్య 516 కి.మీ. దూరం ఉంటుంది.
- ఐదో మ్యాచ్ కోసం మళ్లీ పుణె నుంచి ధర్మశాల వెళ్లాలి. ఇది ఏకంగా 1936 కి.మీ. ప్రయాణం
- ఆరో మ్యాచ్ కోసం ధర్మశాల నుంచి లక్నో రావాల్సి ఉంటుంది. అంటే 748 కి.మీ. ప్రయాణించాలి.
- ఇక ఆ తర్వాత లక్నో నుంచి ముంబైకి 1190 కి.మీ.
-ముంబై నుంచి కోల్‌కతాకి 1652 కి.మీ.
- కోల్‌కతా నుంచి చివరి లీగ్ మ్యాచ్ ఆడే బెంగళూరుకు 1544 కి.మీ. ప్రయాణం చేయాలి.
అన్నీ కలిపితే 9 మ్యాచ్ లు ముగిసే లోపు 8361 కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. ఒక్క హైదరాబాద్ లో తప్ప వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న ప్రతి ఇతర నగరంలోనూ ఇండియన్ టీమ్ మ్యాచ్ లు ఉన్నాయి. కనీసం ప్రతి నగరంలో నెట్ సెషన్లు ఏర్పాటు చేసేంత టైమ్ కూడా టీమ్ కు లేకపోవడం గమనార్హం. ఇక సెమీఫైనల్, ఫైనల్ చేరితే మరోసారి కోల్‌కతా, అహ్మదాబాద్ లకు కూడా ప్రయాణించాలి. అప్పుడు మొత్తం దూరం 9700 కి.మీ.కు చేరుకుంటుంది.
ఇంగ్లండ్ కూడా దాదాపు ఇండియా ప్రయాణించినంత దూరమే ప్రయాణించాల్సి రావడం విశేషం. ఆ టీమ్ కూడా అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, పుణె, కోల్‌కతా నగరాల్లో మ్యాచ్ లు ఆడాల్సి ఉండటంతో ఏకంగా 8171 కి.మీ. దూరం ప్రయాణించనుంది. ఇక పాకిస్థాన్ 6849 కి.మీ. ఆస్ట్రేలియా 6907 కి.మీ. ప్రయాణిస్తాయి.