MI vs SRH: వాంఖడేలో సూర్య సెంచరీ వీరంగం.. హైదరాబాద్‍ను దెబ్బకొట్టిన ముంబై ఇండియన్స్-suryakumar yadav helps mumbai indian with hundred to won against sunrisers hyderabad mi vs srh ipl 2024 news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mi Vs Srh: వాంఖడేలో సూర్య సెంచరీ వీరంగం.. హైదరాబాద్‍ను దెబ్బకొట్టిన ముంబై ఇండియన్స్

MI vs SRH: వాంఖడేలో సూర్య సెంచరీ వీరంగం.. హైదరాబాద్‍ను దెబ్బకొట్టిన ముంబై ఇండియన్స్

Chatakonda Krishna Prakash HT Telugu
May 06, 2024 11:39 PM IST

MI vs SRH IPL 2024: సన్‍రైజర్స్ హైదరాబాద్‍పై ముంబై ఇండియన్స్ అలవోకగా గెలిచేసింది. దాదాపు ప్లేఆఫ్స్ ఆశలకు దూరమైన ఆ జట్టు.. హైదరాబాద్‍ను కీలక సమయంలో దెబ్బకొట్టింది. ముంబై స్టార్ సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ ఆటతో అజేయ సెంచరీ చేశాడు.

MI vs SRH: వాంఖడేలో సూర్య సెంచరీ వీరంగం.. హైదరాబాద్‍ను దెబ్బకొట్టిన ముంబై ఇండియన్స్
MI vs SRH: వాంఖడేలో సూర్య సెంచరీ వీరంగం.. హైదరాబాద్‍ను దెబ్బకొట్టిన ముంబై ఇండియన్స్ (ANI)

Mumbai Indians vs Sunrisers Hyderabad: హోం గ్రౌండ్ వాంఖడేలో ముంబై ఇండియన్స్ (MI) ఎట్టకేలకు గెలుపు బాటపట్టింది. నాలుగు వరుస పరాజయాల తర్వాత ఆ జట్టు విజయం రుచిచూసింది . దీంతో ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‍ల్లో నాలుగో గెలుపు దక్కించుకుంది. వాంఖడే స్టేడియంలో నేడు (మే 6) జరిగిన ఐపీఎల్ మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో సన్‍రైజర్స్ హైదరాబాద్‍పై గెలిచింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు దూరమైన ముంబై.. హైదరాబాద్‍ను దెబ్బకొట్టింది. గత నెల తనను ఓడించిన సన్‍రైజర్స్‌పై హార్దిక్ సేన రివేంజ్ తీర్చుకుంది. ముంబై స్టార్ సూర్యకుమార్ యాదవ్ అజేయ సెంచరీతో కదం తొక్కాడు.

ఆరంభంలో తడబడినా.. సూర్య సెంచరీతో అలవోకగా..

174 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ మొదట్లో తడబడినా ఆఖరికి అలవోకగా గెలిచింది. ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో కదం తొక్కాడు. ధనాధన్ ఆటతో ముంబైను గెలిపించాడు. 51 బంతుల్లోనే 102 పరుగులతో అజేయ సెంచరీతో రెచ్చిపోయాడు సూర్య. 12 పోర్లు, 6 సిక్స్‌లతో దుమ్మురేపాడు. సిక్స్‌తో శతకం పూర్తి చేసుకొని జట్టును గెలిపించాడు స్కై. 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి ముంబై గెలిచింది. ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ (9)ను హైదరాబాద్ పేసర్ మార్కో జాన్సెన్ ఔట్ చేయగా.. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (4)ను కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాలుగో ఓవర్లో పెవిలియన్‍కు పంపాడు. నమన్ ధీర్ (0)ను భవనేశ్వర్ కుమార్ డకౌట్ చేశాడు. దీంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

సూర్య శతక మెరుపులు.. తిలక్ సాయం

కీలక సమయంలో ముంబై ధనాధన్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. వికెట్లు పడినా తన మార్క్ దూకుడునే కొనసాగించాడు. భారీ షాట్లను ఆడాడు. హైదరాబాద్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అతడికి తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (32 బంతుల్లో 37 నాటౌట్) బాగా సహకరించాడు. సూర్య మాత్రం వేగంగా ఆడాడు. దీంతో 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరాడు సూర్య. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. అతడి దూకుడుతో లక్ష్యం క్రమంగా కరిగిపోయింది. హైదరాబాద్ బౌలర్లు సూర్య, తిలక్ భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయారు. 51 బంతుల్లోనే సూర్య సెంచరీ చేరాడు. సిక్స్ కొట్టి విన్నింగ్ షాట్ చేయటంతో పాటు శతకం పూర్తి చేసుకున్నాడు. సూర్య, తిలక్ అజేయంగా 143 పరుగులు జోడీంచారు. కాగా, ఐపీఎల్‍లో సూర్యకు ఇది రెండో సెంచరీగా ఉంది.

హైదరాబాద్ బౌలర్ మార్కో జాన్సెన్ 3 ఓవర్లలోనే 45 పరుగులు ఇచ్చి తీవ్రంగా నిరాశపరిచాడు. ఓ వికెట్ తీసినా కీలక సమయాల్లో అధికంగా రన్స్ సమర్పించాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ కమిన్స్ ఓ వికెట్ తీశాడు.

ముందు హెడ్, ఆఖర్లో కమిన్స్

ఈ మ్యాచ్‍లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 48 పరుగులు; 7 ఫోర్లు, ఓ సిక్స్) రాణించాడు. అభిషేక్ శర్మ (11), మయాంక్ అగర్వాల్ (5) విఫలమయ్యారు. జోరుగా ఆడుతున్న హెడ్‍ను 11వ ఓవర్లో ముంబై సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా ఔట్ చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి (20) కాసేపు రాణించి పెవిలియన్ చేరగా.. ఫామ్‍లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్ (2) విఫలమయ్యాడు. షెహబాజ్ అహ్మద్ (10), మార్కో జాన్సెన్ (17) కాసేపు నిలిచి కీలక సమయాల్లో ఔటయ్యారు. అబ్దుల్ సమాద్ (3) నిరాశ పరిచాడు.

అయితే, సన్‍రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం చివర్లో దుమ్మురేపాడు. ఓ ఎండ్‍లో వికెట్లు పడుతున్నా.. దీటుగా బ్యాటింగ్ చేశాడు. దూకుడు తగ్గించలేదు. 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 35 పరుగులు చేశాడు కమిన్స్. జట్టును ఆదుకొని పోరాడే స్కోరు అందించాడు. ముంబై బౌలర్లలో స్పిన్నర్ పియూష్ చావ్లా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. జస్‍ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్ తలా ఓ వికెట్ తీశారు.

తొమ్మిదో ప్లేస్‍కు వచ్చిన ముంబై

ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానం నుంచి తొమ్మిదో ప్లేస్‍కు ముంబై వచ్చింది. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‍ల్లో 8 ఓడి, నాలుగు గెలిచింది ముంబై. లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచ్‍ల్లో విజయం సాధించినా.. ముంబైకు ప్లేఆఫ్స్ అవకాశాలు లేవు. ఇక సన్‍రైజర్స్ హైదరాబాద్ 11 మ్యాచ్‍ల్లో 6 గెలిచి.. 5 ఓడింది. ప్లేఆఫ్స్ చేరాలంటే తన చివరి మూడు లీగ్ మ్యాచ్‍ల్లో ఎస్ఆర్‌హెచ్ కనీసం రెండు గెలవాలి.

Whats_app_banner