Dhruv Jurel: దూకుడు తగ్గిస్తే మంచిది - ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్‌లకు గవాస్కర్ క్లాస్
Dhruv Jurel: ఐదో టెస్ట్‌లో ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ నిర్లక్ష్యంగా ఆడటంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సీరియస్ అయ్యాడు. ఇద్దరు దూకుడు తగ్గిస్తే మంచిదని అన్నాడు.
Dhruv Jurel: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్. తొలి సిరీస్‌లోనే అంచనాలకు మించి రాణించి ఆకట్టుకున్నారు. నాలుగో టెస్ట్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియాను గెలిపించిన ధ్రువ్ జురేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు.
భారీ షాట్స్ కొట్టబోయి...
ధర్మశాల వేదికగా జరుగుతోన్న ఐదో టెస్ట్‌లో వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు సర్ఫరాజ్ ఖాన్. తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 60 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 రన్స్ చేసి ఔటయ్యాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి పెవిలియన్ చేరుకున్నాడు. ధ్రువ్ జురేల్ కూడా పదిహేను పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ మాదికిగానే ధ్రువ్ జురేల్‌ను తెలివిగా షోయబ్ బషీర్ బోల్తా కొట్టించాడు. సిక్సర్ కొట్టాలని ధ్రువ్ జురేల్ అనుకున్నాడు. కానీ బౌండరీ లైన్‌లో డకెట్ క్యాచ్‌తో అతడికి నిరాశే మిగిలింది.
దూకుడు పనికిరాదు...
ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్‌ఖాన్ ఇద్దరు దూకుడుగా ఆడాలనే క్రమంలో చెత్త షాట్లకు ఔట్ కావడంపై సునీల్ గవాస్కర్ స్పందించాడు. టెస్ట్ క్రికెట్‌లో దూకుడు అన్నిసార్లు పనికిరాదని అన్నాడు. ధ్రువ్ జురేల్ క్రీజులోకి వచ్చి ఎక్కువ సమయం కాలేదు. కేవలం 24 బాల్స్ మాత్రమే ఆడాడు. అలాంటప్పుడు క్రీజులో ఎక్కువ సమయం పాటు నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాలి కానీ భారీ షాట్స్ కొట్టాలని అనుకోకూడదు. చెత్త షాట్ ఆడి అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నాడు. తన ఆటతీరు పట్ల జురేల్ కూడా నిరాశ చెంది ఉంటాడని అనుకుంటున్నట్లు గవాస్కర్ పేర్కొన్నాడు.
ఫస్ట్ బాల్‌కే...
సర్ఫరాజ్ ఖాన్ ఆటతీరుపై కూడా గవాస్కర్ ఫైర్ అయ్యాడు. టీ బ్రేక్ తర్వాత తాను ఎదుర్కన్న ఫస్ట్ బాల్‌నే సిక్సర్‌గా మలచాలని ప్రయత్నించి ఔటయ్యాడు సర్ఫరాజ్. టెస్ట్ క్రికెట్‌లో తొందరపాటు పనికిరాదని, ఓపిక చాలా అవసరమని గవాస్కర్ తెలిపాడు. తొలి బాల్‌నే భారీ షాట్ ఆడాల్సిన అవసరం అక్కడ లేదు. అయినా సర్ఫరాజ్ తొందరపడ్డాడు అని తెలిపాడు. వీరిద్దరిపై గవాస్కర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
ఐదో టెస్ట్‌లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 477 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌పై 259 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకున్నది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులు చేసింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్నది. హైదరాబాద్ టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించగా, మిగిలిన మూడు టెస్ట్‌లను టీమిండియా గెలుచుకుంది.