Sunil Gavaskar: రెండో టెస్టుకు టీమిండియా ఈ రెండు మార్పులు చేయాలి: సునీల్ గవాస్కర్ సూచనలు
IND vs SA 2nd Test - Sunil Gavaskar: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం టీమిండియాకు సూచనలు చేశారు దిగ్గజం సునీల్ గవాస్కర్. తుది జట్టులో రెండు మార్పులు చేయాలని సూచించారు. ఆ వివరాలివే..
IND vs SA 2nd Test - Sunil Gavaskar: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడో రోజుల్లోనే పరాజయం పాలైంది. దీంతో 2 టెస్టుల సిరీస్‍లో 0-1తో వెనుకబడింది. సిరీస్ నిలుపుకోవాలంటే జనవరి 3వ తేదీ నుంచి జరిగే రెండో టెస్టులో గెలవాల్సిందే. ఈ కీలకమైన రెండో టెస్టు కోసం భారత జట్టుకు కీలక సూచన చేశారు భారత మాజీ ప్లేయర్, దిగ్గజం సునీల్ గవాస్కర్. తుది జట్టులో రెండు మార్పులు చేయాలని చెప్పారు. ఆ వివరాలివే..
వెన్నులో ఇబ్బంది కారణంగా భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍కు తుది జట్టులో చోటు దొరికింది. అయితే, ప్రస్తుతం జడేజా కోలుకున్నట్టు సమాచారం. రెండో టెస్టు అతడు రెడీ అయ్యాడని, ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మెదలుపెట్టాడని తెలుస్తోంది. ఈ తరుణంలో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు తుది జట్టులో భారత్ రెండు మార్పులు చేయాలని గవాస్కర్ సూచించారు. అశ్విన్ స్థానంలో జడేజాను తీసుకోవాలని చెప్పారు.
“రవీంద్ర జడేజా పూర్తిగా ఫిట్‍నెస్ సాధించి జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నా. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్‌ను టీమ్‍లోకి తీసుకోవాలి. కేప్‍టౌన్‍లో గాలి కూడా స్వింగ్‍కు సహకరిస్తుంది. అందుకే స్వింగ్ బౌలింగ్ చేసే వారికి సక్సెస్ దక్కుతుంది. ముకేశ్ కుమార్ అలాంటి బౌలరే” అని సునీల్ గవాస్కర్ అన్నారు.
కేప్‍టౌన్ పిచ్ స్పిన్‍కు పెద్దగా సహకరించే ఛాన్స్ లేదు. అందుకే జట్టులో ఒకే స్పిన్నర్‌గా అశ్విన్ కంటే జడేజాకే టీమిండియా వైపే టీమిండియా మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. దీంతో రెండో టెస్టు తుది జట్టులో అశ్విన్‍కు చోటు కష్టమే. ఒకవేళ శార్దూల్ తప్పిస్తేనే అశ్విన్‍కు ప్లేస్ ఉంటుంది. అయితే, అలా జరిగే ఛాన్స్ చాలా తక్కువ.
తొలి టెస్టులో 20 ఓవర్లే వేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఒక్క వికెట్ మాత్రమే తీసి 93 పరుగులు ఇచ్చేశాడు. తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో బంతిని మెరుగ్గా స్వింగ్ చేసే ముకేశ్ కుమార్‌ను అతడి స్థానంలో రెండో టెస్టుకు తీసుకోవాలని గవాస్కర్ సూచించారు. జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ప్రధాన పేసర్లుగా ఉంటారు. శార్దూల్ కూడా పేస్ దళంలో ఉంటాడు.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్‍టౌన్ వేదికగా 2024 జనవరి 3న రెండో టెస్టు మొదలుకానుంది. ఈ సిరీస్‍ను సమం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‍ను భారత్ తప్పక గెలవాలి.
సంబంధిత కథనం