SRH vs MI : హెడ్, అభిషేక్, క్లాసెన్ వీరబాదుడు.. ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్
SRH vs MI: ఐపీఎల్లో చరిత్ర సృష్టించింది సన్ రైజర్స్ హైదరాబాద్. లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీరబాదుడుతో ఎస్ఆర్‌హెచ్ ఏకంగా 277 రన్స్ చేసింది.
SRH vs MI: సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరుతో చరిత్ర సృష్టించింది. హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ మెడ్ హాఫ్ సెంచరీలతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు ఏకంగా 277 రన్స్ చేసింది. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పేరుతో ఉన్న 263 రన్స్ రికార్డును సన్ రైజర్స్ బ్రేక్ చేసింది.
సన్ రైజర్స్ కొత్త చరిత్ర
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. హెన్రిచ్ క్లాసెన్ కేవలం 34 బంతుల్లో 80, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63, ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 రన్స్ చేశారు. అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. సన్ రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును క్రియేట్ చేశాడు.
అంతకు కొన్ని నిమిషాల ముందు 18 బంతుల్లో హాఫ్ సెంచరీతో.. ట్రావిస్ హెడ్ క్రియేట్ చేసిన రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. మొత్తంగా సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో 18 సిక్స్ లు నమోదు కావడం విశేషం. ఇక 19 ఫోర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ఫోర్లు, సిక్స్ ల రూపంలోనే సన్ రైజర్స్ 184 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ, క్లాసెస్ చెరో 7 సిక్స్ లు బాదగా.. హెడ్ 3, మార్‌క్రమ్ ఒక సిక్స్ కొట్టారు. మార్‌క్రమ్ 28 బంతుల్లో 42 రన్స్ చేశాడు. హెడ్ మొదలు పెట్టిన తుఫానును క్లాసెన్ సునామీలా ముగించాడు. తొలి ఓవర్ నుంచి చివరి ఓవర్ వరకూ బౌండరీల వర్షం కురుస్తూనే ఉంది. ఒక్క బుమ్రా వేసిన తొలి ఓవర్ తప్ప.. మిగతా అన్ని ఓవర్లలో బౌండరీలు వచ్చాయి.
2013లో ఆర్సీబీ 263 పరుగులతో క్రియేట్ చేసిన రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో బ్రేక్ చేసింది. అప్పట్లో ఆ మ్యాచ్ లో క్రిస్ గేల్ 175 రన్స్ రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 11 ఏళ్లుగా ఉన్న ఆ రికార్డు సన్ రైజర్స్ బ్యాటర్ల ధాటికి బ్రేకయింది. వీళ్ల దెబ్బకు ముంబై ఇండియన్స్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మఫాకా 4 ఓవర్లలోనే 66, హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 46, కోయెట్జి 4 ఓవర్లలో 57, పియూష్ చావ్లా 2 ఓవర్లలో 34, షామ్స్ ములానీ 2 ఓవర్లలో 33 పరుగులు ఇవ్వడం విశేషం.
నిజానికి స్టార్ బౌలర్ బుమ్రాను కూడా సన్ రైజర్స్ బ్యాటర్లు వదల్లేదు. అతడు కూడా 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లు ఏకంగా 19 ఎక్స్‌ట్రాలు కూడా ఇవ్వడం గమనార్హం. సన్ రైజర్స్ సృష్టించిన ఈ పరుగుల సునామీతో ఉప్పల్ స్టేడియంలో తడిచి ముద్దయింది. ఈ రికార్డును బ్రేక్ చేయడం అంత సులువు కాదనే చెప్పాలి.