Abhishek Sharma: చిక్కుల్లో సన్ రైజర్స్ ప్లేయర్.. మోడల్ ఆత్మహత్యకు అతనికీ ఉన్న లింకేంటి?
Abhishek Sharma: సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. ఓ మోడల్ ఆత్మహత్య కేసులో పోలీసులు ఈ క్రికెటర్ ను విచారణకు పిలవడం సంచలనం రేపుతోంది.
Abhishek Sharma: ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడే క్రికెటర్ అభిషేక్ శర్మను పోలీసులు విచారణకు పిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. తానియా సింగ్ అనే మోడల్ ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు అతన్ని ప్రశ్నించడానికి సిద్ధమైనట్లు గుజరాత్ తక్ రిపోర్ట్ వెల్లడించింది. గత కొన్ని సీజన్లుగా అభిషేక్ శర్మ సన్ రైజర్స్ జట్టుకు ఆడుతున్నాడు.
అభిషేక్ శర్మకు నోటీసులు
తానియా సింగ్ అనే 28 ఏళ్ల మోడల్ మంగళవారం (ఫిబ్రవరి 20) రాత్రి ఆత్మహత్య చేసుకుంది. సూరత్ లోని హ్యాపీ ఎలిగెన్స్ అపార్ట్‌మెంట్లో ఉన్న తన ఇంట్లోనే తానియా ఈ అఘాయిత్యానికి పాల్పడింది. తానియా గత రెండేళ్లుగా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ చేస్తోంది. తానియా ఇలా హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమె కుటుంబం షాక్ కు గురైంది.
అసలు ఆమె ఈ పని ఎందుకు చేసిందన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే సన్ రైజర్స్ క్రికెటర్ అభిషేక్ శర్మను విచారణకు పిలిచినట్లు గుజరాత్ తక్ తన రిపోర్టులో వెల్లడించింది. ఆమె ఆత్మహత్య కంటే ఈ క్రికెటర్ కు నోటీసులు వెళ్లడమే సంచలనంగా మారింది. అసలు తానియా బలవన్మరణానికి, అభిషేక్ కు సంబంధం ఏంటన్నది తేలాల్సి ఉంది.
లవ్ ఎఫైరే కారణమా?
అభిషేక్ శర్మను ప్రాథమిక విచారణ కోసం పోలీసులు పిలిచారు. అసలు తానియాతో అతనికి ఉన్న సంబంధం ఏంటన్నదానిపై ఆరా తీయనున్నారు. కొన్నాళ్లుగా అభిషేక్ తో తానియా మాట్లాడుతుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. నిజానికి తానియా తన చివరి ఫోన్ కాల్ అభిషేక్ తోనే మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె కాల్ రికార్డింగ్స్ ఈ కేసు విచారణలో కీలకం కానున్నాయి.
లవ్ ఎఫైరే తానియా ఆత్మహత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తానియా ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు దృష్టి సారించారు. అందులో భాగంగా అభిషేక్ శర్మను విచారిస్తే ఆమె ఆత్మహత్యకు కారణమేంటన్నది తెలియవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
సన్ రైజర్స్‌తో అభిషేక్ శర్మ
అభిషేక్ శర్మ 2022 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు. 2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తొలిసారి అతన్ని ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేయగా.. ఆ సీజన్ లో ఒక మ్యాచ్ లో 19 బంతుల్లోనే 46 రన్స్ చేశాడు. అయితే ఆ సీజన్ లో కేవలం 3 మ్యాచ్ లే ఆడాడు. సన్ రైజర్స్ తరఫున 2022 సీజన్లో చెలరేగాడు. 14 మ్యాచ్ లలోనే 426 రన్స్ చేశాడు. ఇక గత సీజన్లోనూ సన్ రైజర్స్ తరఫున 11 మ్యాచ్ లలో 226 రన్స్ చేశాడు.
ఇప్పుడు కొత్త సీజన్ కు సిద్ధమవుతున్న వేళ ఇలా కేసులో చిక్కుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుందని లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే పూర్తి షెడ్యూల్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. సాధారణ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.