IND vs BAN: సంజూ శాంసన్ ఫాస్టెస్ట్ సెంచరీ - మూడో టీ20 లో టీమిండియా ఊచకోత - టీ20 చరిత్రలో సెకండ్ హయ్యెస్ట్ స్కోర్
IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా చరిత్రను సృష్టించింది. ఇరవై ఓవర్లలో 297 పరుగులు చేసింది. సంజూ శాంసన్ సెంచరీతో దంచికొట్టగా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య సిక్సర్లతో విరుచుకుపడ్డారు.
IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా చరిత్రను తిరగరాసింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇరవై ఓవర్లలో 297 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజూ శాంసన్ సెంచరీతో దంచికొట్టగా...కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య సిక్సర్లు, ఫోర్లతో బంగ్లాదేశ్ బౌలర్లను ఊచకోత కోశారు.
నలభై బాల్స్‌లో సెంచరీ...
ఈ మూడో టీ20లో ఓపెనర్ అభిషేక్ శర్మ నాలుగు పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి సంజూ శాంసన్ బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సంజూ శాంసన్ 22 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేయగా...సూర్యకుమార్ యాదవ్ 23 బాల్స్‌లో యాభై రన్స్ చేశారు. హాఫ్ సెంచరీ తర్వాత తన జోరు పెంచాడు సంజూ శాంసన్.
రిషద్ హుస్సేన్ వేసిన పదో ఓవర్‌లో ఐదు సిక్సులు బాది 30 పరుగులు రాబట్టాడు. నలభై బాల్స్‌లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు. సంజూ శాంసన్ 47 బాల్స్‌లో 11 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 111 పరుగులు చేయగా.... సూర్యకుమార్ యాదవ్ 35 బాల్స్‌లో ఐదు సిక్సర్లు ఎనిమిది ఫోర్లతో 75 రన్స్ చేసి ఔటయ్యాడు.
సిక్సర్ల వర్షం...
సూర్యకుమార్, సంజూ శాంసన్ ఔట్ చేసి ఊపిరి పీల్చుకున్న బంగ్లా బౌలర్లను సిక్సర్లతో హార్దిక్ పాండ్య, రియాన్ పరాగ్ వణికించారు. రియాన్ పరాగ్ 13 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు ఓ ఫోర్‌తో 34 రన్స్ చేయగా...హార్దిక్ పాండ్య 18 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 47 పరుగులు చేశాడు.
సెకండ్ హయ్యెస్ట్ టోటల్...
ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు రికార్డులను తిరగరాసింది. టీ20 చరిత్రలో ఇదే సెకండ్ హయ్యెస్ట్ స్కోరు కావడం గమనార్హం. ఆసియా గేమ్స్‌లో మంగోలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో నేపాల్ 314 పరుగులుచేసింది. నేపాల్ తర్వాత 297 పరుగులతో టీమిండియా సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.
47 ఫోర్లు, సిక్సర్లు…
ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్స్ 47 ఫోర్లు, సిక్సర్లు కొట్టారు. టీ20 మ్యాచ్‌లో ఓ జట్టు కొట్టిన అత్యధిక ఫోర్లు, సిక్సర్లు ఇవే కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో 25 సిక్సర్లు, ఇరవై రెండు ఫోర్లు కొట్టారు. ఓ టీ20 మ్యాచ్‌లో ఇండియా కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే కావడం గమనార్హం. టీమిండియా ప్లేయర్లు. టీ20ల్లో సంజూ శాంసన్‌కు ఇదే మొదటి సెంచరీ కావడం గమనార్హం.
టీమిండియాతరఫున టీ20ల్లో తొలి సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. టీ20ల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన టీమిండియా క్రికెటర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. రోహిత్ శర్మ 35 బాల్స్‌లో సెంచరీ సాధించగా...సంజూ శాంసన్ 40 బాల్స్‌లో సెంచరీ చేశాడు.