Suryakumar Yadav: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల్ని సూర్యకుమార్ యాదవ్ చేపట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. హార్ధిక్ పాండ్యకకు షాకిచ్చేందుకు ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్‌మెంట్ రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించడంపై ఇన్‌డైరెక్ట్‌గా సూర్యకుమార్ హింట్ ఇచ్చాడు.
బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆదివారం గ్వాలియర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఐపీఎల్ కెప్టెన్సీపై సూర్యకుమార్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
టీమిండియాకు సారథిగా వ్యవహరిస్తోన్న మీరు ఐపీఎల్‌లో కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరించే అవకాశాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు సూర్యకుమార్ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. ప్రస్తుతానికైతే టీమిండియా బాధ్యతల్ని ఏంజాయ్ చేస్తున్నానని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమంటూ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
“రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై టీమ్‌కు ఆడుతున్నప్పుడు అవసరమైన సందర్భాల్లో అతడికి సలహాలు సూచనలు ఇచ్చేవాడిని. రోహిత్ నాయకత్వంలో చాలా నేర్చుకున్నా. నాయకుడిగా జట్టును సమిష్టిగా ఎలా ముందుకు నడిపించాలో, సమయానికి అనుగుణంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది రోహిత్‌ను చూసి తెలుసుకున్నా” అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
“ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్‌లలో టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా భవిష్యత్తులో నాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానని” సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. అతడి కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఇన్‌డైరెక్ట్‌గా ఐపీఎల్ 2025 ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నట్లు సూర్యకుమార్ యాదవ్ హింట్ ఇచ్చాడని క్రికెట్ వర్గాలు చెబుతోన్నారు. ఒకవేళ సూర్యకుమార్ కెప్టెన్ బాధ్యతల్ని స్వీకరిస్తే పాండ్య పరిస్థితి ఏమిటన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అతడు ముంబై ఇండియన్స్‌ను వీడే అవకాశం ఉందని అంటున్నారు.
2024 సీజన్‌లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల్ని హార్దిక్ పాండ్య స్వీకరించాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ హార్దిక్ పాండ్య నిరాశపరచడంతో అతడిపై దారుణంగా విమర్శలొచ్చాయి.
మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్య వ్యక్తిగత సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత బంగ్లాదేశ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.