Sourav Ganguly on Rohit: రోహిత్ కెప్టెన్సీ వద్దన్నాడు.. కానీ: గంగూలీ
Sourav Ganguly on Rohit Sharma: రోహిత్ శర్మ పూర్తిస్థాయి కెప్టెన్సీ చేపట్టే సమయంలో ఏం జరిగిందో అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ వెల్లడించారు. ఫుల్ టైమ్ కెప్టెన్ అయ్యేందుకు ముందుగా హిట్‍మ్యాన్ నిరాకరించాడని చెప్పారు. ఆ తర్వాత తాను జోక్యం చేసుకున్నట్టు వెల్లడించారు. వివరాలివే..
Sourav Ganguly on Rohit Sharma: 2021 చివర్లో టీమిండియాలో కెప్టెన్సీ అస్థిరత ఏర్పడింది. టీ20 ఫార్మాట్‍లో కెప్టెన్సీ నుంచి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. అయితే, వన్డేలు, టెస్టులకు సారథిగా కొనసాగాలని అనుకున్నాడు. అయితే, పరిమిత ఓవర్ల ఫార్మాట్‍లకు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదని భావించిన బీసీసీఐ.. వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తొలగించింది. దీంతో అసంతృప్తి చెందిన విరాట్ కోహ్లీ.. 2022 జనవరిలో టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలిగాడు.
కోహ్లీ తప్పుకోవడంతో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నారు. 2022 జనవరి తర్వాతి నుంచి రోహిత్ శర్మనే మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ఫుల్‍టైమ్ కెప్టెన్‍గా సారథ్యం వహిస్తున్నాడు. అయితే, పూర్తిస్థాయి టీమిండియా కెప్టెన్సీ చేపట్టేందుకు తొలుత రోహిత్ శర్మ అంగికరించలేదట. ఈ విషయాన్ని సౌరవ్ గంగూలీ తాజాగా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఫుల్ టైమ్ కెప్టెన్సీ తీసుకునేందుకు రోహిత్ శర్మ ముందుగా నిరాకరించాడని.. కానీ తాను బలవంతంగా అతడిని ఒప్పించినట్టు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. అయితే, రోహిత్ ఇప్పుడు భారత్‍ను ముందుకు నడిపిస్తున్న తీరును చూసి తాను చాలా ఆనందిస్తున్నానని చెప్పారు.
“అన్ని ఫార్మాట్లు ఆడితే ఒత్తిడి అత్యధికంగా ఉంటుందనే కారణంగా రోహిత్ శర్మ కెప్టెన్ కావాలని అనుకోలేదు. నువ్వు ఎస్ చెబుతావా లేకపోతే నేనే నీ పేరు ప్రకటించాలా అని రోహిత్‍కు చెప్పే వరకు వెళ్లింది. ఆ తర్వాత అతడు కెప్టెన్సీ తీసుకోవడం పట్ల సంతోషించా. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో వస్తున్న ఫలితాలు చూస్తున్నారా కదా” అని గంగూలీ చెప్పారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత టీమిండియాకు సారథిగా రోహిత్ శర్మనే బెస్ట్ అని తాను అనుకున్నానని గంగూలీ చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‍లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‍ల్లో అన్నింటా గెలిచింది. చివరి గ్రూప్ మ్యాచ్‍లో ఆదివారం నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. సెమీ ఫైనల్‍లో న్యూజిలాండ్‍తో భారత్ తలపడడం దాదాపు ఖరారైంది.