Rohit Sharma Bat: రోహిత్ శర్మను రెండుసార్లు ఔట్ చేసి.. అతనికే బ్యాట్ గిఫ్ట్‌గా ఇచ్చిన బంగ్లాదేశ్ ప్లేయర్
Rohit Sharma Bat: రోహిత్ శర్మను రెండు టెస్టుల సిరీస్ లో రెండుసార్లు ఔట్ చేసిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ అతనికి ఓ బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. సొంతంగా ఓ బ్యాట్ల తయారీ కంపెనీ మొదలుపెట్టిన అతడు.. అదే బ్యాట్ ను ఇవ్వడం విశేషం.
Rohit Sharma Bat: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్పెషల్ బ్యాట్ అందుకున్నాడు. బంగ్లాదేశ్ ప్లేయర్ మెహిదీ హసన్ మిరాజ్ ఈ బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. రెండు టెస్టుల సిరీస్ లో బంగ్లాను ఇండియన్ టీమ్ క్లీన్ స్వీప్ చేసిన తర్వాత మెహిదీ.. రోహిత్ ను కలిసి ఈ బ్యాట్ అందజేశాడు. ఈ సందర్భంగా అతని కొత్త బ్యాట్ల తయారీ కంపెనీకి రోహిత్ బెస్ట్ విషెస్ చెప్పాడు.
రోహిత్‌కు ఎంకేఎస్ బ్యాట్
మెహిదీ హసన్ మిరాజ్.. బంగ్లాదేశ్ కీలకమైన ఆల్ రౌండర్లలో ఒకడు. ఇండియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా కాన్పూర్ టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేశాడు. ఇప్పుడదే బౌలర్ రోహిత్ కు తన కంపెనీ తయారు చేసిన బ్యాట్ అందించాడు. ఈ సిరీస్ లో బంగ్లాదేశ్ తరఫున అత్యధికంగా 9 వికెట్లు తీసుకున్న మెహిదీ.. సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ ను కలిశాడు.
బంగ్లాదేశ్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి మెహిదీ ఓ బ్యాటర్ల తయారీ కంపెనీని తయారు చేశాడు. దీనిపేరు ఎంకేఎస్ స్పోర్ట్స్. ఇప్పుడిడే సంస్థకు చెందిన ఫేస్ బుక్ పేజ్.. రోహిత్ కు మెహిదీ బ్యాట్ అందిస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. "నేను రోహిత్ భాయ్ తో ఉన్నాను. అతనికి నా కంపెనీకి చెందిన బ్యాట్ ఇచ్చాను. అతనికి ఈ బ్యాట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది" అని మెహిదీ అన్నాడు.
ఈ సందర్భంగా మెహిదీకి రోహిత్ శుభాకాంక్షలు చెప్పాడు. "మెహిదీ నాకు చాలాకాలంగా తెలుసు. అతడో మంచి క్రికెటర్. ఫ్రెండ్స్ తో కలిసి తన సొంత బ్యాట్ కంపెనీని అతడు ప్రారంభించినందుకు నాకు గర్వంగా ఉంది. అతనికి ఆల్ ద బెస్ట్. దేవుడు అతనికి విజయం అందించాలని కోరుకుంటున్నాను" అని రోహిత్ అన్నాడు.
షకీబ్‌కు కోహ్లి బ్యాట్
ఇక కాన్పూర్ టెస్టు ముగియగానే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా తన బ్యాట్ ను బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబల్ హసన్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. టెస్ట్ కెరీర్ కు తాను ముగింపు పలకాలని భావిస్తున్నట్లు చెప్పిన నేపథ్యంలో కోహ్లి ఇలా తన బ్యాట్ ను అతనికి అందజేయడం విశేషం.
తన సొంత మైదానం మీర్పూర్ లో రాబోయే సౌతాఫ్రికా సిరీస్ లో తన చివరి టెస్టు ఆడాలని షకీబ్ కోరుకుంటున్నాడు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే షకీబ్ ఇప్పటికే తన చివరి టెస్టు ఆడినట్లే. అయితే సౌతాఫ్రికా సిరీస్ కు మాత్రం తాను అందబాటులో ఉంటున్నట్లు గతంలోనే షకీబ్ అనౌన్స్ చేశాడు.