Sanju Samson: సంజూ శాంసన్ వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది - క్రికెట్ ఫ్యాన్స్ ట్వీట్స్ వైరల్
Sanju Samson: సంజూ శాంసన్ జట్టులో ఉండటం వల్లే టీమిండియా వరల్డ్ కప్‌ను గెలిచిందని కేరళ క్రికెట్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. కేరళ క్రికెటర్లు వరల్డ్ కప్ ఆడిన ప్రతిసారి టీమిండియా టైటిల్ గెలిచిందని ట్వీట్స్ చేస్తున్నారు.
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. కోట్లాది మంది అభిమానులతో తమ గెలుపు ఆనందాన్ని టీమిండియా క్రికెటర్లు పంచుకున్నారు. రోహిత్ సేనను బీసీసీఐ ఘనంగా సత్కరించింది.
కేరళ క్రికెట్ ఫ్యాన్స్ ట్వీట్స్...
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో ఏడు పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసి టీమిండియా రెండోసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నది. టీమిండియా వరల్డ్ కప్ విక్టరీపై కేరళ క్రికెట్ ఫ్యాన్స్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి. సంజూ శాంసన్ జట్టులో ఉండటం వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు.
సంజూ శాంసన్ వరల్డ్ కప్‌కు ఎంపికైన ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన అన్ని మ్యాచుల్లో సంజూ శాంసన్‌తో పాటు చాహల్, యశస్వి జైస్వాల్ బెంచ్‌కే పరిమితమయ్యారు. ఒక్క మ్యాచ్ కూడా ఆడని సంజూ శాంసన్ వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని కేరళ ఫ్యాన్స్ అంటున్నారు.అది ఎలా సాధ్యమైందో ప్రూఫ్స్‌తో సహ చూపిస్తున్నారు.
నాలుగు సార్లు...
ఇప్పటివరకు టీమిండియా రెండు వన్డే వరల్డ్ కప్‌లతో పాటు రెండు టీ20 వరల్డ్ కప్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నది. టీమిండియా వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఈ నాలుగు సందర్భాల్లో జట్టులో ఒక్కో కేరళ క్రికెటర్ ఉన్నాడు. 1983 వన్డే వరల్డ్ కప్‌లో కేరళ నుంచి సునీల్ వాల్సన్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
2007లో శ్రీశాంత్...
2007 టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలవడంతో కేరళ క్రికెటర్ శ్రీశాంత్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో శ్రీశాంత్ పట్టిన క్యాచ్ ద్వారానే టీమిండియా విన్నర్‌గా నిలిచింది. ఆ తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో శ్రీశాంత్ సభ్యుడిగా ఉన్నాడు. 2011 తర్వాత జరిగిన వన్డే, టీ20 వరల్డ్ కప్ లలో టీమిండియా విఫలవుతూ వచ్చింది.
ఒక్క సారి కూడా కప్ గెలవలేకపోయింది. ఈ వరల్డ్ కప్‌ల కోసం ఎంపిక చేసిన ఇండియా టీమ్‌లలో ఒక్క కేరళ క్రికెటర్‌కు ఛాన్స్ దక్కలేదు. దాదాపు పదమూడేళ్ల తర్వాత కేరళ నుంచి సంజూ శాంసన్ వరల్డ్ కప్‌కు ఎంపికయ్యాడు. 2024 టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా సొంతం చేసుకున్నది.
కేరళ క్రికెటర్లు వరల్డ్ కప్ ఎంపికైన ప్రతిసారి టీమిండియా టైటిల్ గెలిచిందని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతోన్నారు. కేరళ క్రికెటర్లు వరల్డ్ కప్‌లో టీమిండియాకు సెంటిమెంట్‌గా మారారని, ఈ మెగా టోర్నీలలో వారికి సరైన అవకాశాలు ఇవ్వాలంటూ ట్వీట్స్ చేస్తోన్నారు. ఈ ట్వీట్స్, పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
125 కోట్ల ప్రైజ్ మనీ...
తుది జట్టులో స్థానం దక్కకపోయినా సంజూ శాంసన్‌తో పాటు చాహల్, యశస్వి జైస్వాల్‌ల పంట పండింది. వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ 125 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటించింది. ఇందులో నుంచి ఈ ముగ్గురికి దాదాపు ఎనిమిదిన్నర కోట్ల వరకు క్యాష్ ప్రైజ్ రానుంది. అలాగే టీ20 వరల్డ్ కప్ ప్రైజ్‌మనీలో వాటా దక్కనుంది.