Sreesanth Legal Notice: గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీస్-llc sends legal notice to sreesanth over his fixer claims ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sreesanth Legal Notice: గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీస్

Sreesanth Legal Notice: గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీస్

Hari Prasad S HT Telugu
Dec 08, 2023 08:51 AM IST

Sreesanth Legal Notice: లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ)లో గంభీర్‌తో గొడవపడిన శ్రీశాంత్‌ మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. తాజాగా లీగ్ నిర్వాహకులు అతనికి లీగల్ నోటీసు పంపించారు.

గంభీర్ తో గొడవ వివాదంలో శ్రీశాంత్ కు లీగల్ నోటీసులు
గంభీర్ తో గొడవ వివాదంలో శ్రీశాంత్ కు లీగల్ నోటీసులు

Sreesanth Legal Notice: టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ మధ్య గొడవ రోజురోజుకూ ముదురుతూనే ఉంది. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ అతనికి ఓ లీగల్ నోటీస్ పంపడం గమనార్హం. గంభీర్ తనను ఫిక్సర్ అన్నాడంటూ బుధవారం (డిసెంబర్ 6) ఓ వీడియో ద్వారా శ్రీశాంత్ చెప్పడాన్ని తప్పుబడుతూ ఈ నోటీస్ పంపించారు.

టీ20 టోర్నమెంట్ లో ఆడుతూ శ్రీశాంత్ తన కాంట్రాక్ట్ ను ఉల్లంఘించాడని ఆ నోటీసులో ఉంది. లీగ్ లోని ప్లేయర్ ను విమర్శిస్తూ శ్రీశాంత్ పోస్ట్ చేసిన వీడియోలన్నింటినీ డిలీట్ చేసిన తర్వాతే చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది. అటు అంపైర్లు కూడా ఈ గొడవపై తమ రిపోర్ట్ సమర్పించారు. అయితే శ్రీశాంత్ ను గంభీర్ ఫిక్సర్ అన్నాడన్న విషయం ఎక్కడా చెప్పలేదు.

ఇండియన్ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా గంభీర్, శ్రీశాంత్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా అతడు తనను ఫిక్సర్ అన్నాడంటూ రెండు వీడియోలను శ్రీశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గంభీర్ అందరితోనూ గొడవ పడతాడని, తనను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఏడెమినిదిసార్లు ఫిక్సర్ అన్నాడని విమర్శించాడు.

తర్వాత గంభీర్ చేసిన ఓ పోస్టుపైనా శ్రీశాంత్ స్పందించాడు. నువ్వో అహంకారివి.. అసలు క్లాస్ లేని వ్యక్తివి.. సుప్రీంకోర్టు కంటే గొప్పోడివా.. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడంటూ శ్రీశాంత్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత ఓ మ్యాచ్ లో గంభీర్ రనౌట్ కావడాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ శ్రీశాంత్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు.

ఈ వివాదంపై విచారణ జరుపుతామని గతంలోనే చెప్పిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ తాజాగా శ్రీశాంత్ కే లీగల్ నోటీస్ పంపించడం విశేషం. మరి ఈ ఇద్దరి మధ్య గొడవ ఎంత వరకూ వెళ్తుందో చూడాలి. 2013 ఐపీఎల్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలతో సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. తర్వాత సుప్రీంకోర్టు అతనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది.

Whats_app_banner