IND vs NEP Cricket: ఏషియన్ గేమ్స్‌లో నేపాల్‍తో భారత్ తొలి మ్యాచ్.. రుతురాజ్ కెప్టెన్సీలో.. టైమ్, లైవ్ వివరాలివే
Cricket in Asian Games IND vs NEP: ఏషియన్ గేమ్స్‌లో పోరును ఆరంభించేందుకు టీమిండియా రెడీ అయింది. మంగళవారం (అక్టోబర్ 3) భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ వివరాలివే..
Cricket in Asian Games IND vs NEP: ఏషియన్ గేమ్స్‌లో పోరాటానికి భారత పురుషుల క్రికెట్ జట్టు సిద్ధమైంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఈ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది భారత మహిళల జట్టు. ఇప్పుడు పురుషుల క్రికెట్ జట్టు కూడా స్వర్ణమే లక్ష్యంగా పోరాటాన్ని మొదలుపెట్టనుంది. ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ క్వార్టర్ ఫైనల్‍లో టీమిండియా మంగళవారం (అక్టోబర్ 3) నేపాల్‍తో తలపడనుంది. భారత పురుషుల ప్రధాన జట్టు వన్డే ప్రపంచకప్ ఆడనుండటంతో.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టును ఏషియన్ గేమ్స్‌కు పంపింది బీసీసీఐ. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నాడు. భారత్, నేపాల్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వివరాలివే..
భారత్ vs నేపాల్: మ్యాచ్ డేట్, టైమ్
ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ క్వార్టర్ ఫైనల్‍లో భారత్, నేపాల్ మధ్య మంగళవారం (అక్టోబర్ 3) మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి. టీ20 ఫార్మాట్‍లో ఈ క్రికెట్ మ్యాచ్‍లు జరుగుతున్నాయి.
లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు
ఏషియన్ గేమ్స్‌లో భారత్, నేపాల్ మధ్య క్రికెట్ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. అక్టోబర్ 3న ఉదయం 6.30 గంటలకు ఇండియా, నేపాల్ మ్యాచ్ లైవ్ మొదలవుతుంది.
ఏషియన్ గేమ్స్‌కు ఎంపికైన భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ప్రభ్‍సిమ్రన్ సింగ్, జితేశ్ శర్మ, రింకూ సింగ్, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, అక్ష్‍దీప్, తిలక్ వర్మ, షాదాబ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, రవిబిష్ణోయ్
షెడ్యూల్ ఇదీ..
అక్టోబర్ 3వ తేదీన ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ క్వార్టర్ ఫైనల్‍లో భారత్, నేపాల్ మ్యాచ్‍తో పాటు పాకిస్థాన్, హాంకాంగ్ మధ్య మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 4న శ్రీలంకతో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‍తో మలేషియా క్వార్టర్ ఫైనల్‍లో ఆడతాయి. క్వార్టర్ ఫైనల్‍లో గెలిచిన జట్లు సెమీస్‍లో తలపడతాయి. సెమీస్‍లో కూడా విజయం సాధించిన రెండు జట్లు స్వర్ణ పతకం కోసం ఫైనల్‍లో తలపడనున్నాయి.
ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ సెమీ ఫైనల్స్ అక్టోబర్ 6న జరగనున్నాయి. సెమీస్‍లో గెలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ అక్టోబర్ 7న జరగనుంది. ఇక, సెమీస్‍లో ఓడిన రెండు జట్లు కాంస్య పతకం కోసం అక్టోబర్ 7నే తలపడనున్నాయి.