IND vs NZ: ప్రాక్టీస్‍లో సూర్య కుమార్‌కు గాయం.. ఇషాన్‍ను కుట్టిన తేనెటీగలు.. పరిస్థితేంటి?
IND vs NZ ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో ఓటమి ఎరగకుండా దూసుకెళుతున్న టీమిండియా, న్యూజిలాండ్ ఆదివారం (అక్టోబర్ 22) ఢీకొంటున్నాయి. అయితే, ఈ కీలక మ్యాచ్‍కు ముందు భారత జట్టులో కొంత ఆందోళన నెలకొంది. ఆ వివరాలివే..
IND vs NZ ODI World Cup 2023: ప్రస్తుత వన్డే ప్రపంచకప్‍లో ఆడిన నాలుగు మ్యాచ్‍ల్లోనూ గెలిచి ఫుల్ జోష్ మీద ఉంది టీమిండియా. న్యూజిలాండ్ కూడా నాలుగు మ్యాచ్‍ల్లోనూ విజయం సాధించి సత్తాచాటింది. దీంతో వరల్డ్ కప్ 2023 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్-2లో ఈ జట్లు ఉన్నాయి. ఈ మెగాటోర్నీలో దూసుకెళుతున్న భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం (అక్టోబర్ 22) ధర్మశాల వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ కీలక పోరుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‍కు అందుబాటులో లేడు. అతడికి సరైన రిప్లేస్‍మెంట్ లేక ఇప్పటికే ఇబ్బందిగా మారింది. అతడి స్థానంలో కివీస్‍తో మ్యాచ్‍కు తుది జట్టులో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‍ల్లో ఒకరిని తీసుకోవాలని టీమిండియా మేనేజ్‍మెంట్ భావిస్తోంది. ఈ తరుణంలో ఊహించని ఇబ్బంది ఎదురైంది.
న్యూజిలాండ్‍తో మ్యాచ్‍కు ముందు భారత ఆటగాళ్లు ధర్మశాలలోని హెచ్‍పీసీఏ స్టేడియంలో శనివారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. గంటల పాటు నెట్స్‌లో చెమటోడ్చారు. అయితే, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కుడి చేతి మణికట్టుకు బలంగా తగిలింది. దీంతో సూర్య ఒక్కరిగా కిందపడి చేతిని పట్టుకున్నాడు. నొప్పితో విలవిల్లాడాడు. ఆ తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ వచ్చి అతడికి చికిత్స చేశారు.
సూర్య కుమార్ మణికట్టుపై కాసేపు ఐస్‍ప్యాక్ ఉంచారు. అయితే, సూర్యకుమార్‌కు అయింది పెద్ద గాయమేం కాదని సమాచారం బయటికి వచ్చింది. స్వల్ప చికిత్స తర్వాత అతడికి నొప్పి తగ్గిందని తెలిసింది. న్యూజిలాండ్‍తో మ్యాచ్‍కు సూర్యకుమార్ అందుబాటులోనే ఉంటాడని తెలుస్తోంది.
ఇషాన్‍పై తేనెటీగలు
ప్రాక్టీస్ చేస్తుండగా టీమిండియా యువ స్టార్ ఇషాన్ కిషన్‍పైకి తేనెటీగలు ఒక్కసారిగా వచ్చాయి. అతడిని కుట్టాయి. దీంతో ఇషాన్ కాసేపు విలవిల్లాడాడు. వెంటనే డ్రెస్సింగ్ రూమ్‍కు వెళ్లిపోయాడు. దీంతో అతడి విషయంలో అనిశ్చితి ఉంది.
మరోవైపు, ధర్మశాల పిచ్ పేస్‍కు అనుకూలంగా ఉంటే శార్దూల్ ఠాకూర్‌ను కూడా తప్పించి సూర్య, ఇషాన్‍లో ఒకరితో పాటు స్టార్ పేసర్ మహమ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ తరుణంలో శనివారం ప్రాక్టీస్‍లో జరిగిన ఈ పరిణామాలు కాస్త ఆందోళన కలిగించాయి. సూర్యకుమార్, ఇషాన్ పరిస్థితిపై ఆదివారం ఉదయం నాటికి పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇద్దరూ మ్యాచ్‍కు సిద్ధంగా లేకపోతే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉంటాయి.
మరోవైపు, హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల జట్టులో సమతూకం కొరవడిందని టీమిండియా హెడ్‍కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. బెస్ట్ టీమ్ కాంబినేషన్‍ను సెట్ చేసేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఆదివారం (అక్టోబర్ 22) మధ్యాహ్నం 2 గంటలకు మొదలుకానుంది.