India vs Nepal Asian Games: ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో టీమిండియా.. పోరాడి ఓడిన నేపాల్
India vs Nepal Asian Games: ఏషియన్ గేమ్స్ క్రికెట్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది టీమిండియా. నేపాల్ పోరాడినా క్వార్టర్ ఫైనల్లో ఆ టీమ్ ను చిత్తు చేసి గోల్డ్ మెడల్ దిశగా మరో అడుగు ముందుకేసింది.
India vs Nepal Asian Games: ఏషియన్ గేమ్స్ క్రికెట్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది ఇండియన్ టీమ్. మంగళవారం (అక్టోబర్ 3) నేపాల్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో 23 పరుగులతో గెలిచింది. మొదట యశస్వి సెంచరీ, రింకు మెరుపులతో భారీ స్కోరు చేసిన ఇండియా.. తర్వాత రవి బిష్ణోయ్ స్పిన్ మాయాజాలంతో విజయం సాధించింది.
నేపాల్ కూడా గట్టిగానే పోరాడింది ముఖ్యంగా మిడిలార్డర్ లో దీపేంద్ర ఐరీ (15 బంతుల్లో 32), సందీప్ జోరా (12 బంతుల్లో 29) సిక్స్ లతో కాసేపు భయపెట్టారు. ఇద్దరూ కలిసి ఏడు సిక్స్ లు బాదడం విశేషం. అయితే కీలకమైన సమయంలో వీళ్ల వికెట్లు తీయగలిగిన ఇండియన్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, అవేష్ ఖాన్ 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు.
ఇక మరో స్పిన్నర్ సాయికిశోర్ కూడా 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. పేస్ బౌలర్లయిన అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 43, శివమ్ దూబె 3 ఓవర్లలోనే 37 రన్స్ ఇచ్చారు. ఈ ఇద్దరు వేసిన ఒక్కో ఓవర్లో మూడు సిక్స్ లు కొట్టారు నేపాల్ బ్యాటర్లు దీపేంద్ర ఐరీ, సందీప్ జోరా. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్.. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 రన్స్ చేసింది.
యశస్వి మెరుపులు.. రింకూ ఉరుములు
అంతకుముందు యశస్వి జైస్వాల్ మరోసారి చెలరేగిపోయాడు. ఏషియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్ తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివర్లో శివమ్ దూబె, రింకు సింగ్ కూడా చెలరేగారు. దీంతో నేపాల్ పై ఇండియా భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేయడం విశేషం. రింకు సింగ్ 14 బంతుల్లోనే 35, శివమ్ దూబె 19 బంతుల్లోనే 25 రన్స్ చేసి అజేయంగా నిలిచారు.
నేపాల్ తో మ్యాచ్ లో యశస్వి, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇండియాకు మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు కేవలం 9.5 ఓవర్లలోనే 103 పరుగులు జోడించారు. ఈ సమయంలో 23 బంతుల్లో 25 పరుగులు చేసిన రుతురాజ్ ఔటయ్యాడు. ఆ వెంటనే తిలక్ వర్మ (2), జితేష్ శర్మ (5) కూడా ఔటవడంతో 119 పరుగులకే ఇండియా 3 వికెట్లు కోల్పోయింది.
తిరుగులేని యశస్వి
ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. యశస్వి మాత్రం జోరు తగ్గించలేదు. నేపాల్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 8 ఫోర్లు, 7 సిక్స్ లతో 47 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అయితే ఆ వెంటనే ఔటయ్యాడు. చివరికి 49 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతని ఇన్నింగ్స్ లో కేవలం ఫోర్లు, సిక్స్ ల రూపంలోనే 74 పరుగులు రావడం విశేషం.
ఇక యశస్వి ఔటైన తర్వాత కూడా శివమ్ దూబె, రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఐదో వికెట్ కు ఇద్దరూ కలిసి అజేయంగా 22 బంతుల్లోనే 50 పరుగులు జోడించారు. రింకు సింగ్ కేవలం 14 బంతుల్లోనే 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 35 రన్స్ చేయగా.. శివమ్ దూబె 2 ఫోర్లు, ఒక సిక్స్ తో 19 బంతుల్లోనే 25 రన్స్ చేశాడు.