IND vs PAK: కఠినమైన పిచ్‍పై తక్కువ స్కోరుకే ఆలౌటైన టీమిండియా.. అదరగొట్టిన పాక్ బౌలర్లు.. స్వల్ప లక్ష్యం
IND vs PAK T20 World Cup 2024: పాకిస్థాన్‍తో మ్యాచ్‍లో బ్యాటింగ్‍లో టీమిండియా విఫలమైంది. కఠినంగా ఉన్న పిచ్‍పై తంటాలు పడింది. దీంతో తక్కువ స్కోరుకే ఆలౌటై.. పాక్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
IND vs PAK: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో పాకిస్థాన్‍తో మ్యాచ్‍లో బ్యాటింగ్‍లో విఫలమైంది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసి తక్కువ స్కోరుకే ఆలౌటైంది. కఠినంగా ఉన్న పిచ్‍పై భారత బ్యాటర్లు రాణించలేకపోయారు. న్యూయార్క్ వేదికగా నేడు (జూన్ 9) జరుగుతున్న గ్రూప్ ఏ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. దీంతో పాక్ ముందు 120 పరుగుల స్పల్ప లక్ష్యం నిలిచింది.
పంత్, అక్షర్ మాత్రమే..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది భారత్. అయితే, వరుసగా వికెట్లు కోల్పోతూ దూకుడుగా ఆడలేకపోయింది. రిషబ్ పంత్ (31 బంతుల్లో 42 పరుగులు; 6 ఫోర్లు) రాణించగా.. అక్షర్ పటేల్ (18 బంతుల్లో 20 పరుగులు) కాసేపు నిలిచాడు. అయితే, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. పాక్ బౌలర్లు వరసగా వికెట్లు పడగొడుతూ టీమిండియాను చిక్కుల్లో పడేశారు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (4) రెండో ఓవర్లో నసీమ్ షా బౌలింగ్‍లో క్యాచౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ (13) ధాటిగా ఆడినా.. మూడో ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, అక్షర్ పటేల్ నిలకడగా ఆడారు. అయితే, రెండు క్యాచ్‍లు మిస్ అయి.. పంత్‍కు అదృష్టం కలిసి వచ్చింది. మూడో వికెట్‍కు పంత్, అక్షర్ 39 పరుగులు జోడించారు. అయితే, 8వ ఓవర్లో నసీమ్ బౌలింగ్‍లో అక్షర్ బౌల్డ్ అయ్యాడు.
వికెట్లు టపటపా
రిషబ్ పంత్ ఓ ఎండ్‍లో దీటుగా ఆడితే.. మరోవైపు వికెట్లు టపటపా పడ్డాయి. సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దూబే (3) రాణించలేకపోయారు. కీలక సమయాల్లో ఔటయ్యారు. కాసేపటికే 15వ ఓవర్లో మహమ్మద్ ఆమిర్ బౌలింగ్‍లో రిషబ్ కూడా పెద్ద షాట్‍కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. రవీంద్ర జడేజా (0) కూడా తదుపరి బంతికే ఔటయ్యాడు. దీంతో 96 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్.
హార్దిక్ పాండ్యా (7) కూడా భారీ షాట్‍కు యత్నించి హారిస్ రవూఫ్ బౌలింగ్‍లో వెనుదిరిగాడు. జస్‍ప్రీత్ బుమ్రా (0) డకౌట్ అయ్యాడు. అర్షదీప్ సింగ్ (9), మహమ్మద్ సిరాజ్ (7 నాటౌట్) కీలకమైన పరుగులు చేశారు. అయితే, లేని పరుగుకు ప్రయత్నించి 19వ ఓవర్ చివరి బంతికి అర్షదీప్ రనౌట్ అయ్యాడు. దీంతో 119 పరుగులకే భారత్ ఆలౌటైంది.
పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా, హరిస్ రవూఫ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. పిచ్‍ను పూర్తిగా వినియోగించుకున్నారు. మహమ్మద్ ఆమిర్ రెండు వికెట్లు తీశాడు. షహీన్ షా అఫ్రిది ఓ వికెట్ దక్కించుకున్నాడు.
బ్యాటింగ్‍కు కఠినంగానే పిచ్
న్యూయార్క్ పిచ్ మరోసారి బ్యాటర్లకు చుక్కలు చూపింది. రకరకాలుగా బౌన్స్ అయింది. కొన్ని బంతులు స్టెప్ పడ్డాక స్లో అయ్యాయి. దీంతో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బందిగా మారింది. ఈ ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు న్యూయార్క్ స్టేడియంలో ఆడిన మ్యాచ్‍లు లో స్కోరింగ్‍గానే జరిగాయి. ఈ మ్యాచ్‍లో భారత్ కూడా తక్కువ స్కోరుకే పరిమితమైంది. మరి బౌలింగ్‍కు సహకరిస్తున్న ఈ పిచ్‍పై పాకిస్థాన్‍ను భారత బౌలర్లు కట్టడి చేయగలరా అనేది చూడాలి.