IND vs ENG 4th Test: రెండో రోజు ముగిసిన ఆట - యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం - కష్టాల్లో టీమిండియా
IND vs ENG 4th Test: నాలుగో టెస్ట్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. రాంచీ టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. 134 పరుగులు వెనుకపడింది.
IND vs ENG 4th Test: ఇండియా, ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ 30 పరుగులు, కుల్దీప్ యాదవ్ 17 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ కంటే ఇంకా 134 పరుగుల వెనుకంజలో టీమిండియా ఉంది.
మరోసారి ఆదుకున్న జైస్వాల్...
మరోసారి టీమిండియాకు ఆపద్భాందవుడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓ వైపు వికెట్లు పడుతోన్న పట్టుదలగా ఆడిన యశస్వి జైస్వాల్ 73 పరుగులు చేశాడు. ఐదు వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ తర్వాత శుభ్‌మన్ గిల్ 38 పరుగులతో పర్వాలేదపించాడు.
మూడో ఓవర్‌లో ఫస్ట్ వికెట్
భారత ఇన్నింగ్స్ ప్రారంభమైన మూడో ఓవర్‌లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. రోహిత్‌శర్మను సీనియర్ పేసర్ అండర్సన్ తెలివిగా బోల్తా కొట్టించాడు. రెండు పరుగులకే రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆ తర్వాత శుభ్‌మన్‌గిల్‌తో కలిసి యశస్వి జైస్వాల్ టీమిండియా స్కోరును ముందుకు నడిపించాడు. గత టెస్ట్‌ల్లో చెత్త షాట్స్‌తో ఔటైన గిల్ ఈ సారి అలాంటి పొరపాట్లు చేయకుండా క్రీజులో పాతుకుపోయాడు. గిల్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌కు బషీర్ బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత టీమిండియా వికెట్ల పతనం మొదలైంది.
పాటిదార్ తక్కువ స్కోరుకే ఔట్...
మరోసారి తన పేలవ ఫామ్‌ను కొనసాగించిన పాటిదార్ కేవలం 17 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. రాజ్‌కోట్ హీరో జడేజాతో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా స్వల్ప స్కోర్లకే ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడుతోన్న యశస్వి మాత్రం ఒంటరిపోరాటం కొనసాగించాడు. సెంచరీ చేయడం ఖాయంగానే కనిపించాడు. బషీర్ బంతిని అంచనా వేయడంలో విఫలమై పెవిలియన్ చేరుకున్నాడు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్‌తో 73 పరుగులు చేసిన జైస్వాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఎనిమిది వికెట్‌కు....
177 పరుగులకే ఏడో వికెట్లు కోల్పోయిన టీమిండియాను వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్ ఆదుకున్నారు. క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరు నెమ్మదిగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. 18 ఓవర్లకుపైగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ధ్రువ్ జురేల్ 30 పరుగులతో, కుల్దీప్ యాదవ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
బషీర్‌కు నాలుగు వికెట్లు...
ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ నాలుగు వికెట్లు తీశాడు. తన స్పిన్ దెబ్బతో టీమిండియా జోరును అడ్డుకున్నాడు...హార్ట్‌లీకి రెండు వికెట్లు దక్కగా అండర్సన్ ఓ వికెట్ తీసుకున్నాడు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌటైంది. రూట్ సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను బెన్ ఫోక్స్ (47 రన్స్), ఓలి రాబిన్సన్(58 పరుగులు)తో కలిసి ఇంగ్లండ్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. రూట్ 122 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. టీమిండియా బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీసుకోగా... అరంగేట్రం హీరో ఆకాష్‌దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ రెండు, అశ్విన్‌కు ఓ వికెట్ దక్కింది.