Ind vs Afg 3rd T20I: రోహిత్ మెరుపు సెంచరీ.. దంచికొట్టిన రింకు.. టీమిండియా భారీ స్కోరు-ind vs afg 3rd t20i rohit hundred and rinku half century gave india huge total against afghanistan in the final t20i ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Afg 3rd T20i: రోహిత్ మెరుపు సెంచరీ.. దంచికొట్టిన రింకు.. టీమిండియా భారీ స్కోరు

Ind vs Afg 3rd T20I: రోహిత్ మెరుపు సెంచరీ.. దంచికొట్టిన రింకు.. టీమిండియా భారీ స్కోరు

Hari Prasad S HT Telugu
Jan 17, 2024 09:01 PM IST

Ind vs Afg 3rd T20I: రోహిత్ శర్మ మెరుపు సెంచరీ, రింకు సింగ్ హాఫ్ సెంచరీతో ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. రోహిత్ సిక్స్ ల ధాటికి చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోయింది.

రోహిత్ శర్మ, రింకు సింగ్
రోహిత్ శర్మ, రింకు సింగ్ (AP)

Ind vs Afg 3rd T20I: రోహిత్ శర్మ ఈజ్ బ్యాక్. ఆఫ్ఘనిస్థాన్ తో తొలి రెండు టీ20ల్లో డకౌటై విమర్శల పాలైన రోహిత్.. టీ20 వరల్డ్ కప్ కు ముందు చివరి అంతర్జాతీయ టీ20లో మెరుపు సెంచరీ చేశాడు. బౌండరీల వర్షం కురిపించాడు. అతని ధాటికి చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోయింది. అతడు కేవలం 69 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్స్ లతో 121 రన్స్ చేశాడు.

దీంతో ఇండియన్ టీమ్ 4 వికెట్లకు ఏకంగా 212 రన్స్ చేసింది. రోహిత్, రింకు చివరి ఓవర్లో ఏకంగా 36 పరుగులు చేయడం విశేషం. చివరి మూడు బంతులను రింకు సిక్స్ లుగా మలిచాడు. అతడు చివరికి 39 బంతుల్లోనే 6 సిక్స్ లు, 2 ఫోర్లతో 69 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 190 పరుగులు జోడించారు.

రికార్డు సెంచరీ

రోహిత్ శర్మ టీ20ల్లో రికార్డు సెంచరీ సాధించాడు. మెన్స్ టీ20 క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు. టీ20ల్లో అతనికిది 5వ సెంచరీ. గతంలో ఏ ఇతర బ్యాటర్ ఐదు సెంచరీలు చేయలేదు. అంతేకాదు టీ20 క్రికెట్ లో రోహిత్ కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. రోహిత్, రింకు వీరబాదుడుతో ఒక దశలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా.. చివరికి 212 రన్స్ చేయడం విశేషం.

రోహిత్ శర్మ కేవలం 64 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా టీ20 వరల్డ్ కప్ ముందు 14 నెలలుగా ఈ ఫార్మాట్ ఆడని రోహిత్ ను మళ్లీ టీమ్ లోకి తీసుకోవడంపై విమర్శలు వచ్చినా.. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో అతడు ఆ విమర్శలకు చెక్ చెప్పాడు. మరోవైపు రింకు సింగ్ తాను ఫినిషర్ రోల్లోనే కాదు.. ఎలాంటి పాత్రనైనా పోషించగలనని ఈ ఇన్నింగ్స్ ద్వారా నిరూపించాడు.

టాప్ బ్యాటర్స్ చెత్త షాట్లు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మొదట్లోనే దిమ్మదిరిగే షాక్ తగిలింది. టాప్ బ్యాటర్లందరూ చెత్త షాట్లతో వికెట్లు పారేసుకోవడంతో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదట భారీ షాట్ కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి తొలి బంతికే షాట్ ఆడటానికి ప్రయత్నించి డకౌటయ్యాడు.

ఐపీఎల్లో తన హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వేల మంది ప్రేక్షకుల కేరింతల మధ్య క్రీజులోకి వచ్చిన విరాట్.. వాళ్లను తీవ్రంగా నిరాశ పరిచాడు. రెండో టీ20లో వేగంగా పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన అతడు.. ఈసారి వచ్చీరాగానే భారీ షాట్ కు ప్రయత్నించి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు.

ఇక తొలి రెండు టీ20ల్లో హాఫ్ సెంచరీలు చేసిన శివమ్ దూబె ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. అతడు కేవలం 1 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ తనకు వచ్చిన మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కోహ్లిలాగే క్రీజులోకి వచ్చిరాగానే భారీ షాట్ కు ప్రయత్నించి తొలి బంతికే గోల్డెన్ డకౌటయ్యాడు. దీంతో టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

Whats_app_banner