Pakistan Team: ఇండియా చేతుల్లో ఓడినందుకు నా ఇంటిని తగలబెట్టాలని చూశారు.. గుడ్లు, టమాటాలతో కొట్టారు: పాక్ మాజీ ప్లేయర్
Pakistan Team: ఇండియా చేతుల్లో ఓడిపోయినందుకు తన ఇంటిని తగలబెట్టాలని చూశారని, గుడ్లు, టమాటాలతో కొట్టారని పాకిస్థాన్ మాజీ ప్లేయర్ అఖీబ్ జావెద్ వెల్లడించాడు. 1996 వరల్డ్ కప్ తర్వాత తాము పాకిస్థాన్ లో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు.
Pakistan Team: పాకిస్థాన్ చేతుల్లో మాత్రం ఓడిపోవద్దని ఇండియన్ ఫ్యాన్స్.. ఇండియా చేతుల్లో మాత్రం ఓడిపోవద్దని పాకిస్థాన్ ఫ్యాన్స్ అనుకోవడం చాన్నాళ్ల నుంచీ చూస్తూనే ఉన్నాం. ఒకవేళ అలా ఓడిపోతే ఆ టీమ్ లోని ప్లేయర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో మాజీ క్రికెటర్ అఖీబ్ జావెద్ వెల్లడించాడు. ప్రస్తుతం పాక్ టీమ్ వరల్డ్ కప్ లో చెత్తగా ఆడినా ఎవరూ ఏమీ అనడం లేదని, అప్పట్లో పరిస్థితులు ఇలా ఉండేవి కాదని అన్నాడు. 1996 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ఇండియా చేతుల్లో పాకిస్థాన్ ఓడిపోయింది.
వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్ కూడా చేరకుండానే పాకిస్థాన్ ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. లీగ్ స్టేజ్ లో ఇండియా చేతుల్లోనూ ఆ టీమ్ ఓడిపోయింది. దీనిపై జావెద్ స్పందిస్తూ.. "వరల్డ్ కప్ లో చెత్తగా ఆడిన తర్వాత కూడా ఇప్పటి టీమ్ ను మనం కనీసం విమర్శించే పరిస్థితి లేదు. వాళ్లు చాలా అదృష్టవంతులు. 1996 వరల్డ్ కప్ తర్వాత నాకు జరిగిన అనుభవం చాలా భయానకం. ఇండియా నుంచి బయలుదేరినప్పుడే మేము భయపడ్డాం" అని సునో న్యూస్ తో అన్నాడు.
ఆ రోజు నేను చనిపోతాననే అనుకున్నాను: అఖీబ్
"ఎయిర్ పోర్టులో మాకు సాయం చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరు. అసలు మేము ఇళ్లకు ఎలా చేరుకున్నామో కూడా తెలియదు. నా ఇంటిపై రాళ్లేశారు. నా ఇంటిని తగలబెట్టడానికి ప్రయత్నించారు. నన్ను గుడ్లు, టమాటాలతో కొట్టారు" అని అఖీబ్ జావెద్ గుర్తు చేసుకున్నాడు. పాకిస్థాన్ తరఫున 22 టెస్టులు, 163 వన్డేలు ఆడిన అఖీబ్.. తనపై ఎయిర్ పోర్టు దగ్గర ఫ్యాన్స్ ఎలా దాడి చేయడానికి ప్రయత్నించారో కూడా చెప్పాడు.
"మా బస్ ఆగింది. నేను కిందికి దిగాను. కొందరు నా వైపు పరుగెత్తుకొని వచ్చారు. డ్రైవర్ బస్ స్టార్ట్ చేశాడు. నేను బ్యాగ్ చేతిలో పట్టుకొని పరుగెత్తాను. సడెన్ గా ఓ జీపు వచ్చి ఆగింది. నన్ను అందులోకి లాగారు. ఇక నేను చచ్చినట్లే అనుకున్నాను. అదృష్టవశాత్తూ అతడు మా కజిన్. పోలీస్ అధికారి. నన్ను రక్షించడానికి వచ్చాడు" అని అఖిబ్ చెప్పాడు.
"మాతో పోలిస్తే ఇప్పటి టీమ్ ను ఎవరూ ఏమీ అనలేదు. మేము చాలా విమర్శిస్తున్నాం అని అంటున్నారు. కానీ ఇది ఏమీ లేదు. ప్రతి పెద్ద టోర్నీ ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసినా.. ఈ టీమ్ ఐదు లేదా ఆరో స్థానంలో నిలుస్తుందని లోలోపల మాత్రం తెలుస్తూనే ఉంటుంది. గత మూడు వరల్డ్ కప్ లలో ఇదే నిరూపించారు" అని అఖీబ్ అన్నాడు.
బాబర్ స్థానంలో షహీన్‌ను కెప్టెన్ చేయండి
ఇక ఈ ఓటమికి కెప్టెన్ బాబర్ ఆజంనే అఖీబ్ జావెద్ బాధ్యున్ని చేశాడు. అతని స్థానంలో షహీన్ షా అఫ్రిదిని కెప్టెన్ చేయాలని సూచించాడు. "బాబర్ ని ఏమీ అనొద్దని అంటున్నారు. ఒకవేళ అతడు మంచి కెప్టెన్ అయితే ఏ స్థాయిలో అయినా ఏమైనా గెలిచాడు. ఓ కెప్టెన్ని తయారు చేయలేం.
అతడు కెప్టెనా కాదా అనేది ఉంటుంది. కోహ్లి చాలా రోజులు కెప్టెన్ గా ఉన్నాడు. కానీ అతడేమైనా గెలిచాడా? రోహిత్ ఎందుకు మంచి కెప్టెన్. ఎందుకంటే అతడు ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచాడు. కోహ్లి ఐపీఎల్లోనూ, నేషనల్ టీమ్ లోనూ ఏమీ చేయలేదు. బాబర్ కూడా అంతే. పీఎస్ఎల్ అయినా, సీనియర్ టీమ్ అయినా అతడు చేసిందేమీ లేదు" అని అఖిబ్ అన్నాడు.