Babar Azam on India: చాలా బాగా చూసుకున్నారు.. థ్యాంక్యూ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం-babar azam on india says thank you for the hospitality given to pakistan cricket team ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Babar Azam On India: చాలా బాగా చూసుకున్నారు.. థ్యాంక్యూ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం

Babar Azam on India: చాలా బాగా చూసుకున్నారు.. థ్యాంక్యూ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం

Hari Prasad S HT Telugu
Nov 12, 2023 08:59 AM IST

Babar Azam on India: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఇండియాకు కృతజ్ఞతలు చెప్పాడు. ఇంగ్లండ్ తో చివరి లీగ్ మ్యాచ్ లోనూ ఓడిన తర్వాత బాబర్ మాట్లాడుతూ.. తన బ్యాటింగ్ వైఫల్యం కూడా స్పందించాడు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (AFP)

Babar Azam on India: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ 2023 లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన తర్వాత కెప్టెన్ బాబర్ ఆజం మీడియాతో మాట్లాడాడు. లీగ్ స్టేజ్ లో 9 మ్యాచ్ లలో కేవలం నాలుగు గెలిచి, ఐదింట్లో ఓడిన పాక్ టీమ్.. సెమీస్ చేరకుండానే ఇంటికెళ్లిపోయింది. అయితే ఇండియన్ ఫ్యాన్స్ తమను బాగా చూసుకున్నారని, చాలా మద్దతిచ్చారని బాబర్ చెప్పాడు.

ఇంగ్లండ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లోనూ పాకిస్థాన్ ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీ ప్రమాదంలో పడటంతోపాటు ఆ టీమ్ పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబర్ ఇండియాలో లభించిన ఆతిథ్యంతోపాటు తన బ్యాటింగ్ వైఫల్యం, తొలిసారి ఇండియాలో అడుగుపెట్టిన అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చాడు.

చాలా మద్దతిచ్చారు: బాబర్ ఆజం

"నిజాయతీగా చెప్పాలంటే ఇండియా నుంచి నాకు చాలా మద్దతు, ప్రేమ లభించాయి. నా ఒక్కడికే కాదు మొత్తం టీమ్ కు కూడా. నేను సరిగా టోర్నీని ముగించలేకపోయాను. బ్యాటింగ్ లో రాణించడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను. 50 లేదా 100 కొట్టాలని అనుకోలేదు. టీమ్ ను గెలిపించడమే లక్ష్యమనుకున్నాను. నా వ్యక్తిగత ప్రదర్శన కాదు.. జట్టు విజయానికి సాయం చేసే ప్రదర్శన చేయాలనుకున్నాను. పరిస్థితులను బట్టి నేను నెమ్మదిగా ఆడాను. వేగంగా ఆడాను. టీమ్ అవసరాలను బట్టే ఆడాను" అని బాబర్ స్పష్టం చేశాడు.

"మేము ఇక్కడికి తొలిసారి వచ్చాము. ఇక్కడెలా ఆడాలో అవగాహన లేదు. కానీ సాధ్యమైనంత త్వరగా పరిస్థితులకు అలవాటు పడటానికి ప్రయత్నించాం. ఇక్కడెలా బ్యాటింగ్ చేయాలన్నదానిపై ఓ ప్లాన్ రూపొందించుకున్నాం. మొదట్లో, చివర్లో పరుగులు వస్తాయి. మధ్యలో బంతి పాతబడిన తర్వాత బ్యాటర్లకు కాస్త కష్టమవుతుంది" అని బాబర్ అన్నాడు.

బాబర్ ఏం చేయబోతున్నాడు?

వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ సెమీఫైనల్ కూడా చేరకపోవడంతో ఆ టీమ్ పై, కెప్టెన్ బాబర్ ఆజంపై మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబర్ కెప్టెన్సీ ఊడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే తనకు తానుగా బాబర్ కెప్టెన్సీ నుంచి దిగిపోవడం మాత్రం సందేహంగానే ఉంది.

ఇప్పటికే అతడు టీమ్మేట్స్ తో మాట్లాడాడని.. చాలా మంది కెప్టెన్సీ నుంచి దిగిపోవద్దని సూచించినట్లు పాక్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. తన కెప్టెన్సీపై బాబర్ కూడా ఆచితూచి నిర్ణయం తీసుకుంటాడని, స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలని ఆ వర్గాలు తెలిపాయి.

Whats_app_banner