Cricket Records: తండ్రీకొడుకులు 208 బాల్స్ ఆడి 4 రన్స్ చేశారు.. ఇంగ్లండ్ బజ్‌బాల్ పరువు తీసింది వీళ్లే
Cricket Records: ఇంగ్లండ్ బజ్‌బాల్ పరువు తీశారు ఆ దేశంలోని ఇద్దరు క్లబ్ క్రికెటర్లు. ఆ ఇద్దరూ తండ్రీకొడుకులు కావడం విశేషం. ఈ ఇద్దరూ కలిసి ఏకంగా 208 బంతులు ఆడి కేవలం 4 పరుగులు మాత్రమే చేశారు. ఈ స్కోరుబోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Cricket Records: ఇంగ్లండ్ టీమ్ టెస్ట్ క్రికెట్‌కు పరిచయం చేసిన సరికొత్త స్టైల్ బజ్‌బాల్. అంటే సాంప్రదాయ క్రికెట్ లో బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ టీ20 స్టైల్లో చెలరేగిపోవడం. కానీ ఈ స్టైల్ కు పూర్తి భిన్నంగా ఇంగ్లండ్ లోని ఓ క్రికెట్ లీగ్ మ్యాచ్ లో ఇయాన్ బెస్ట్‌విక్, థామస్ బెస్ట్‌విక్ అనే తండ్రీకొడుకులు ఆడారు. ఇద్దరూ కలిసి 208 బంతులు ఆడి చేసింది కేవలం 4 పరుగులు మాత్రమే.
బజ్‌బాల్‌కు పూర్తి భిన్నంగా..
టెస్ట్ క్రికెట్ లోనూ 35 ఓవర్లలో 272 రన్స్ టార్గెట్ అంటే ఈ రోజుల్లో ఇంగ్లండ్ టీమ్ ఏది ఏమైనా ఛేజ్ చేసేయాలని చూస్తుంది. అలాంటి మనస్తత్వాన్ని ఆ టీమ్ లోని ప్లేయర్స్ లోకి ఎక్కించాడు కోచ్ బ్రెండన్ మెకల్లమ్. దీనికి క్రికెట్ ప్రపంచం బజ్‌బాల్ అనే పేరు కూడా పెట్టింది. కానీ ఇదే టార్గెట్ ను అక్కడి డార్లీ అబే క్రికెట్ క్లబ్ బ్యాటర్లు మాత్రం ఛేజ్ చేయడానికి ప్రయత్నించడం కాదు కదా.. ఎలాగోలా డ్రాతో బతికి బట్టకడితే చాలానుకునేలా ఆడారు.
ఆ టీమ్ తరఫున తండ్రీ కొడుకులు ఇయాన్ బెస్ట్‌విక్, థామ్ బెస్ట్‌విక్ ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. వీళ్లో ఇయాన్ 137 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయలేదు. అతని తనయుడు థామస్ 71 బంతులాడి 4 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా ఒక బౌండరీ కాగా.. మిగిలిన 70 బంతులు డాట్ బాల్సే. ఈ ఇద్దరి ఆటతీరు చూసిన తర్వాత నేషనల్ టీమ్ బజ్‌బాల్ స్టైల్ కింది స్థాయికి వెళ్లలేదని స్పష్టంగా అర్థమవుతోంది.
45 ఓవర్లలో 21 రన్స్
చివరికి డార్లీ అబే క్రికెట్ క్లబ్ టీమ్ 45 ఓవర్ల పాటు ఆడి 4 వికెట్లకు కేవలం 21 రన్స్ మాత్రమే చేయడం విశేషం. ఆ టీమ్ లో ఇద్దరు మాత్రమే పరుగుల ఖాతా తెరిచారు. ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 9 పరుగులే అత్యధిక స్కోరు. ఇయాన్ 137 బంతులాడినా ఒక్క పరుగూ చేయలేదు.
నిజానికి అంతకుముందు మికెల్‌ఓవర్ టీమ్ ఇందుకు పూర్తి భిన్నంగా ఆడింది. ఆ టీమ్ 35 ఓవర్లలోనే 4 వికెట్లకు 271 రన్స్ చేసింది. ఓపెనర్ మ్యాక్స్ థాంప్సన్ 128 బంతుల్లోనే 186 రన్స్ బాదాడు. చివరికి మ్యాచ్ డ్రాగా ముగియడంతో డార్లీ అబే క్రికెట్ క్లబ్ ఊపిరి పీల్చుకున్నా.. బజ్‌బాల్ పరువు తీశారంటూ ఆ టీమ్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది
అయితే మ్యాచ్ తర్వాత మాట్లాడిన ఇయాన్.. తమఇన్నింగ్స్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోందని చెప్పడం విశేషం. 48 ఏళ్ల ఈ బ్యాటర్ మాట్లాడుతూ.. "ఈ విషయం ప్రపంచమంతా పాకింది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఖతార్ లలోనూ చర్చించుకుంటున్నారు. ప్రపంచం నలుమూలల నుంచీ నాకు ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తున్నాయి" అని ఇయాన్ చెప్పడం విశేషం.
ఈ మ్యాచ్ డ్రా చేసుకోవడం కూడా ట్రోఫీ గెలిచినట్లుగా ఉందని అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో సంబరాలు చేసుకున్నట్లు కూడా అతడు చెప్పాడు. మ్యాచ్ చివరికి వచ్చేసరికి తాను అసలు పరుగులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఇయాన్ తెలిపాడు.