IND vs AUS: ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్.. 2-0 ఆధిక్యంలోకి..-cricket news india beat australia by 44 runs in 2nd t20i ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus: ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్.. 2-0 ఆధిక్యంలోకి..

IND vs AUS: ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్.. 2-0 ఆధిక్యంలోకి..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 26, 2023 11:39 PM IST

India vs Australia 2nd T20: ఆస్ట్రేలియాపై టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. రెండో టీ20లో అన్ని విభాగాల్లో రాణించిన భారత్.. ఆసీస్‍ను చిత్తుచేసింది. వివరాలివే..

IND vs AUS: ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్.. 2-0 ఆధిక్యంలోకి..
IND vs AUS: ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్.. 2-0 ఆధిక్యంలోకి.. (AP)

India vs Australia 2nd T20: ఆల్‍రౌండ్ షోతో ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తుచేసింది. బ్యాటింగ్, బౌలింగ్‍లో సత్తాచాటి నేడు (నవంబర్ 26) జరిగిన రెండో టీ20లో ఆసీస్‍ను భారత్ ఓడించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‍లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తిరువనంతపురంలో నేడు జరిగిన రెండో టీ20లో భారత్ 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.

యశస్వి జైస్వాల్ (53), రుతురాజ్ గైక్వాడ్ (58), ఇషాన్ కిషన్ (52) అర్ధ శతకాలకు తోడు రింకూ సింగ్ (9 బంతుల్లో 31 రన్స్) మెరుపు బ్యాటింగ్‍తో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్ల బాదుడుతో ఆసీస్ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎలిస్ మూడు వికెట్లు తీసుకోగా.. స్టోయినిస్‍కు ఒక వికెట్ దక్కింది.

టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించటంతో భారీ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా కుదేలైంది. 20 ఓవర్లలో ఆసీస్ 9 వికెట్లకు 191 రన్స్ చేయగలిగింది. మార్కస్ స్టొయినిస్ (45), టిమ్ డేవిడ్ (37), కెప్టెన్ మాథ్యూ వేడ్ (42 నాటౌట్) రాణించినా.. మిగిలిన ఆసీస్ బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, స్పిన్నర్ రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‍లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది భారత్.

భారీ టార్గెట్ ముందుండగా.. ఆస్ట్రేలియా ఓపెనర్లు స్టీవ్ స్మిత్ (19), మాథ్యూ షార్ట్ (19)తో పాటు జోస్ ఇంగ్లిస్ (2) ఎక్కువసేపు నిలువలేకపోయారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ (12) కూడా త్వరగా ఔటవటంతో ఓ దశలో ఆసీస్ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్ కాసేపు దుమ్మురేపారు. హిట్టింగ్‍తో భారత్‍ను టెన్షన్ పెట్టారు. అయితే, 14వ ఓవర్లో భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్.. డేవిడ్‍ను ఔట్ చేసి బ్రేక్‍త్రూ ఇచ్చాడు. స్టొయినిస్ కూడా కాసేపటికి ఔటయ్యాడు. చివర్లో కెప్టెన్ మాథ్యూ వేడ్ పోరాడినా అప్పటికే మ్యాచ్ ఆసీస్ చేజారిపోయింది. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.

అంతకుముందు, యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ 25 బంతుల్లో 53 పరుగులతో మెరుపు అర్ధ శతకం చేయటంతో తొలుత బ్యాటింగ్‍కు దిగిన భారత్‍కు సూపర్ ఆరంభం లభించింది. రుతురాజ్, ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో రింకూ సింగ్ 9 బంతుల్లోనే 31 పరుగులతో సత్తాచాటాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. 

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ మంగళవారం (నవంబర్ 28) గువహటి వేదికగా జరగనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం