IND vs AUS: ఆసీస్‍ను చితక్కొట్టిన యశస్వి, ఇషాన్.. రింకూ మెరుపులు.. టీమిండియా భారీ స్కోరు-team india sets huge target for australia in 2nd t20 as yashasvi jaiswal and ishan kishan smashes half centuries ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Team India Sets Huge Target For Australia In 2nd T20 As Yashasvi Jaiswal And Ishan Kishan Smashes Half Centuries

IND vs AUS: ఆసీస్‍ను చితక్కొట్టిన యశస్వి, ఇషాన్.. రింకూ మెరుపులు.. టీమిండియా భారీ స్కోరు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 26, 2023 08:50 PM IST

IND vs AUS 2nd T20: రెండో టీ20లో ఆస్ట్రేలియా బౌలింగ్‍ను భారత బ్యాటర్లు చితకబాదారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు చేసింది.

యశస్వి జైస్వాల్
యశస్వి జైస్వాల్ (PTI)

IND vs AUS 2nd T20: ఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆసీస్ బౌలర్లను చితకబాదారు. భారత యువ స్టార్ యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 53 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58 పరుగులు) కూడా అర్ధ శతకాలతో మెరిశారు. రింకూ సింగ్ (9 బంతుల్లో 31 పరుగులు; నాటౌట్) మెరుపులు మెరిపించాడు. దీంతో తిరువనంతపురం వేదికగా ఆసీస్‍తో నేడు (నవంబర్ 26) జరుగుతున్న రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 236 పరుగుల కొండంత లక్ష్యం ఉంది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎలిస్ మూడు, మార్కస్ స్టొయినిస్ ఓ వికెట్ తీశారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ 2 ఓవర్లు వేసి ఏకంగా 38 రన్స్, సీన్ అబాట్ మూడో ఓవర్లలో 56 రన్స్ ఇచ్చారు. అంతలా భారత బ్యాటర్ల విధ్వంసం సాగింది.

ట్రెండింగ్ వార్తలు

యశస్వి ధనాధన్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‍కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అదిరే ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా యశస్వి మొదటి నుంచే హిట్టింగ్‍తో చెలరేగిపోయాడు. రుతురాజ్ నిలకడగా ఆడగా.. అతడు మాత్రం రెచ్చిపోయాడు. ఆసీస్ పేసర్ సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా మూడు పోర్లు, రెండు సిక్సర్లతో యశస్వి విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ఓవర్లో 24 రన్స్ వచ్చాయి. దీంతో 3.5 ఓవర్లలో భారత్ స్కోరు 50 పరుగులకు చేరింది. జోరు కొనసాగించిన యశస్వి 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరాడు. అయితే, ఆ తర్వాత ఎలిస్ బౌలింగ్‍లో ఔటయ్యాడు.

గైక్వాడ్, ఇషాన్ హాఫ్ సెంచరీలు.. రింకూ మెరుపులు

యశస్వి ఔటయ్యాక కూడా రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా ఆడాడు. మరో ఎండ్‍లో ఇషాన్ కిషన్ హిట్టింగ్ చేశాడు. వేగంగా పరుగులు చేశాడు. దీంతో 10 ఓవర్లలో భారత్ 101 రన్స్ చేసింది. ఆ తర్వాత కూడా ఇషాన్ దూకుడు కొనసాగించాడు. 29 బంతుల్లోనే అర్ధ శతకానికి చేరాడు. ఇషాన్ ఔటయ్యాక కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (19) కాసేపు మెరిపించి పెవిలియన్ చేరాడు. రుతురాజ్ 39 బంతుల్లో అర్ధ శతకం చేశాడు.

ఆ తర్వాత భారత యువ సంచలనం రింకూ సింగ్ తన మార్క్ హిట్టింగ్‍తో ధనాధన్ బౌండరీలు బాదాడు. 9 బంతుల్లోనే అజేయంగా 31 రన్స్ చేశాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో మెరిపించాడు. ఆఖరి ఓవర్లో గైక్వాడ్ ఔట్ కాగా.. తిలక్ వర్మ (7 నాటౌట్) ఓ సిక్సర్ బాదాడు. మొత్తంగా ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిన టీమిండియా 235 పరుగుల భారీ స్కోరు చేసింది.

WhatsApp channel