IND vs SA 1st Test: భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు నేటి నుంచే- వాన ముప్పు ఉందా! టైమ్, లైవ్, తుది జట్ల వివరాలివే..
IND vs SA 1st Test: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు పోరు నేడు (డిసెంబర్ 26) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‍కు వాన ముప్పు ఉందా.. లైవ్ ఎప్పుడు లాంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
IND vs SA 1st Test: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సమరానికి వేళయింది. సౌతాఫ్రికా పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‍కు టీమిండియా సమాయత్తమైంది. సెంచూరియన్ వేదికగా నేడు (డిసెంబర్ 26) తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత్ తీవ్రంగా కసరత్తులు చేసింది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్ గెలువాలని కసిగా ఉంది. ఈ టూర్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‍లకు విశ్రాంతి తీసుకున్న భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా టీమిండియా టెస్టు జట్టులోకి వచ్చేశారు. దక్షిణాఫ్రికాకు టెంబా బవూమా సారథ్యం వహించనున్నాడు.
పొంచి ఉన్న వాన
భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనున్న సెంచూరియన్‍లో మ్యాచ్ తొలి రోజైన నేడు వర్షం పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వాతావరణ రిపోర్టుల ప్రకారం వాన కురిసే అవకాశాలు 96 శాతం వరకు ఉన్నాయి. తొలి రోజు ఆటకు వాన అంతరాయాలు కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. రెండో రోజు కూడా వాన పడే అవకాశాలు 88 శాతంగా ఉన్నాయి. మూడో రోజు నుంచి వర్షం పడకపోవచ్చు.
మ్యాచ్ టైమ్, వేదిక
భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు నేడు (డిసెంబర్ 26) మధ్యాహ్నం 1.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మొదలుకానుంది. సెంచూరియన్‍లోని స్పోర్ట్ పార్క్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
లైవ్ వివరాలు
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది.
అశ్విన్‍కు నో ఛాన్స్!
సెంచూరియన్ పిచ్ పేస్‍కు సహకరించనుండటంతో తొలి టెస్టు తుది జట్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍కు బదులు శార్దూల్ ఠాకూర్‌వైపే టీమిండియా మొగ్గుచూపే అవకాశం ఉంది. అలాగే, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనుండగా.. శుభ్‍మన్ గిల్ మూడో స్థానంలో ఆడే ఛాన్స్ ఉంది. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్‍తో టెస్టుల్లో అరంగేట్రం చేయనుండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, గాయం నుంచి కోలుకున్న పేసర్ లుంగీ ఎంగ్డీ.. దక్షిణాఫ్రికా తుది జట్టులో ఉండనున్నాడు.
భారత తుదిజట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‍ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్
దక్షిణాఫ్రికా తుదిజట్టు (అంచనా): ఐడెన్ మార్క్‌రమ్, డీన్ ఎల్గర్, టోనీ డీ జోర్జీ, టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడిన్‍గమ్, కైల్ వెరైన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోట్జీ, కగిసో రబాడ, లుంగీ ఎంగ్డీ
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ 2023-25 సైకిల్‍లో ఇప్పటి వరకు వెస్టిండీస్‍తో రెండు టెస్టులు ఆడి ఒకటి గెలిచి.. మరొకటి డ్రా చేసుకుంది భారత్. దీంతో టెస్టు చాంపియన్‍షిప్ పట్టికలో టాప్‍లో ఉంది. పాయింట్ల టేబుల్‍లో అగ్రస్థానంలో కొనసాగాలంటే దక్షిణాఫ్రికాతో ఈ టెస్టు సిరీస్ గెలవడం టీమిండియాకు చాలా ముఖ్యం.