Harbhajan on Chahal: చహల్‌ను మించిన స్పిన్నర్ లేడు.. సెలక్టర్లు తప్పు చేశారు: హర్భజన్
Harbhajan on Chahal: చహల్‌ను మించిన స్పిన్నర్ లేడు.. సెలక్టర్లు తప్పు చేశారు అని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఆసియా కప్ టీమ్ లో చహల్ కు చోటు కల్పించకపోవడాన్ని అతడు తప్పుబట్టాడు.
Harbhajan on Chahal: ఆసియా కప్ కోసం సెలక్టర్లు ఎంపిక చేసిన టీమిండియాపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కు చోటు దక్కకపోవడాన్ని తప్పుబట్టాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ లో దేశంలో బెస్ట్ స్పిన్నర్ చహలే అని, అతన్ని ఎంపిక చేయకుండా సెలక్టర్లు తప్పు చేశారని భజ్జీ అనడం విశేషం.
చహల్ ను పక్కన పెట్టిన సెలక్టర్లు.. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. "ఈ జట్టులో లేనిది, జరిగిన తప్పు ఏంటంటే.. యుజువేంద్ర చహల్ లేకపోవడం. ఆసియా కప్ జట్టులో అతని అవసరం ఎంతైనా ఉంది. చహల్ లెగ్ స్పిన్నర్. అతడు బంతిని దూరంగా తీసుకెళ్లగలడు. నిఖార్సయిన స్పిన్నర్ గురించి మాట్లాడితే ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇండియాలో చహల్ ను మించిన స్పిన్నర్ లేడు" అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్లో అన్నాడు.
"అతడు గత కొన్ని మ్యాచ్ లుగా బాగా బౌలింగ్ చేయని మాట నిజమే. కానీ అది అతన్ని ఓ చెత్త బౌలర్ ను చేయదు. అతనికి ఇప్పటికీ దారులు మూసుకుపోలేదని అనుకుంటున్నాను. వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతోంది కాబట్టి అతని పేరును పరిశీలించాలి. చహల్ తాను మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు. అతని ఫామ్ సరిగా లేదని పక్కనపెట్టారని నాకు అర్థమైంది. కానీ అతడు జట్టుతో ఉండి ఉంటే ఆత్మవిశ్వాసం అలాగే ఉండేది. చోటు కోల్పోయి మళ్లీ వస్తే ఉండే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది" అని హర్భజన్ అన్నాడు.
ఈ మధ్యే వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో చహల్ విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్ లలో కేవలం ఐదే వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు చివరి మూడు మ్యాచ్ లలో పరుగులు కూడా భారీగా ఇచ్చాడు. దీంతో ఆసియా కప్ కోసం సెలక్టర్లు అతని పేరును పరిశీలించలేదు.