GST on term insurance: టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు; జీఎస్టీ కౌన్సిల్ ఆలోచన-tax on term life insurance may be exempted by gst council what will change ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gst On Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు; జీఎస్టీ కౌన్సిల్ ఆలోచన

GST on term insurance: టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు; జీఎస్టీ కౌన్సిల్ ఆలోచన

Sudarshan V HT Telugu
Aug 30, 2024 03:17 PM IST

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ను జీఎస్టీ నుంచి మినహాయించే అవకాశం ఉందని, జీఎస్టీ కౌన్సిల్ లో ఈ విషయంపై చర్చ జరిగిందని, సెప్టెంబర్ 9న అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు!
టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు!

వస్తు సేవల పన్ను (GST) నుంచి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తొలగించే దిశగా జీఎస్టీ కౌన్సిల్ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. అయితే, పెట్టుబడులకు ఉద్దేశించిన బీమా పాలసీలపై మాత్రం పన్నును కొనసాగించవచ్చు. సెప్టెంబర్ 9న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పేరు వెల్లడించని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఇన్వెస్ట్మెంట్ కాంపొనెంట్ కు మినహాయింపు లేదు

‘‘పెట్టుబడులకు ఉద్దేశించిన జీవిత బీమా పాలసీలపై మినహాయింపు లేదు. దాన్ని మినహాయించడంలో అర్థం లేదు. ఇది ప్రాథమికంగా ఒక పెట్టుబడి. జీవితంలోని అనిశ్చిత పరిస్థితులకు మినహాయింపు ఇవ్వాలి తప్ప పెట్టుబడులకు కాదు’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. జీఎస్ టీ (GST) నుంచి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ను మినహాయించడం వల్ల ఏటా రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని, అయితే ఈ నిర్ణయం వల్ల భారత్ లో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మరింత చౌకగా ఉంటుందని, తద్వారా ఇది లాభదాయకంగా మారుతుందని ఆయన అన్నారు.

టర్మ్ ఇన్సూరెన్స్ రేటు తగ్గే అవకాశం

టర్మ్ లైఫ్ ఇన్యూరెన్స్ ను జీఎస్టీ పరిధి నుంచి తొలగించడం వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ ల ధరలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల టర్మ్ ఇన్సూరెన్స్ లు చౌకగా లభిస్తాయి. తద్వారా ఎక్కువమంది ఈ ఇన్సూరెన్స్ (insurance) పాలసీలను కొనుగోలు చేస్తారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో బీమా వ్యాప్తి ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ ని మినహాయించడం వల్ల ఈ అంతరం తగ్గుతుంది.

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ (term insurance) అనేది పాలసీ కాలవ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే లబ్ధిదారులకు ఆర్థిక భద్రతను అందించే స్వచ్ఛమైన రక్షణ పథకం. ఈ బీమా 10 నుంచి 30 ఏళ్ల వరకు కవరేజీని అందిస్తుంది.

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎంత?

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు సాధారణంగా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇది ఎటువంటి పొదుపు లేదా పెట్టుబడి భాగం లేకుండా డెత్ బెనిఫిట్ అందిస్తుంది. ఒకవేళ పాలసీదారుడు కాలపరిమితిని దాటిన తరువాత కూడా జీవించి ఉంటే, పాలసీలో ప్రీమియం రైడర్ యొక్క రాబడి ఉంటే తప్ప చెల్లింపు ఉండదు.