YouTube Premium Plans prices: యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలు పెంపు.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..
YouTube Premium Plans prices: యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలు పెరిగాయి. అన్ని ప్లాన్‍లపై రేట్లను గూగుల్ పెంచేసింది. ఫ్యామిలీ ప్లాన్‍పై ఏకంగా 58 శాతం అధికం చేసింది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‍ల కొత్త ధరలు వివరాలు, ఈ ప్లాన్‍ల బెనెఫిట్స్ ఇక్కడ చూడండి.
పాపులర్ వీడియో ప్లాట్‍ఫామ్ యూట్యూబ్‍లో యాడ్లు లేకుండా కంటెంట్ చూడాలంటే ప్రీమియం ప్లాన్‍లను తీసుకోవాల్సి ఉంది. యాడ్లు లేకపోవటంతో పాటు మరిన్ని సదుపాయాలు కూడా ఈ ప్రీమియం ప్లాన్స్ వల్ల దక్కుతాయి. ఇటీవల వీటిని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ తరుణంలో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‍ల ధరలన్నీ పెంచేసింది గూగుల్. కొత్త ధరలను నేటి (ఆగస్టు 27) నుంచే అమలులోకి తెచ్చింది. అన్ని ప్లాన్‍ల రేట్లు ఎక్కువయ్యాయి.
కొత్త ధరలు ఇవే
యూట్యూబ్ ప్రీమియం నెల సబ్‍స్క్రిప్షన్ ప్లాన్ రూ.129 నుంచి 149కి పెరిగింది. 15శాతం ధరను పెంచేసింది గూగుల్. మూడు నెలల క్వార్టరీ ప్లాన్ ధర రూ.399 నుంచి రూ.459కి పెరిగింది. సంవత్సరం ప్లాన్ ధర రూ.1,290 నుంచి రూ.1,490కు చేరింది. ఇలా వ్యక్తిగత ప్లాన్స్ ధరలన్నీ ఎక్కువయ్యాయి.
స్టూడెంట్స్ ప్లాన్..
విద్యార్థుల కోసం ప్రత్యేక ధరలతో ప్రీమియం ప్లాన్‍లను యూట్యూబ్ అందుబాటులో ఉంచుతోంది. ఈ స్టూడెంట్ నెలవారి ప్లాన్ ఇప్పటి వరకు రూ.79 ఉండగా.. అది రూ.89కి పెరిగింది. 12.6 శాతం ధర అధికమైంది.
ఇప్పటికే ప్లాన్ ఉన్నవారికెలా..
యూట్యూబ్ ప్రీమియం ధరల పెంపు ఇప్పటికే అమలులోకి వచ్చింది. కొత్తగా ప్లాన్ తీసుకోవాలనుకునే వారికి పెంచిన రేట్లు వర్తిస్తాయి. ఇప్పటికే ఏదైనా ప్రీమియం ప్లాన్‍లో ఉన్న వారికి అది ముగిసిన తర్వాత చేసే పేమెంట్ సైకిల్‍లో కొత్త రేట్లు వర్తిస్తాయి.
అందుకే పెంపు
మరింత మెరుగైన సేవలను అందించేందుకు యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలు పెంచినట్టు గూగుల్ వెల్లడించింది. “ఈ నిర్ణయాన్ని అంత సులువుగా తీసుకోలేదు. ప్రీమియం సేవలను మెరుగుపరుస్తూ ఉండేందుకు, మీరు యూట్యూబ్‍లో చూసే వీడియోలను క్రియేట్ చేసే వారికి సపోర్ట్ చేసేందుకు ఇది తోడ్పడుతుంది” అని గూగుల్ వెల్లడించింది.
యూట్యూబ్ ప్రీమియం బెనెఫిట్స్ ఇవే
ప్రీమియం ప్లాన్ సబ్‍స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్స్ లేకుండా యూట్యూబ్‍లో వీడియోలు చూడొచ్చు. యాడ్ల అంతరాయం లేకుండా వీడియోలను వీక్షించవచ్చు. ప్రీమియం ప్లాన్ ఉంటే ఫుల్ హెచ్‍డీ రెజల్యూషన్‍లో కూడా వీడియోలను డౌన్‍లోడ్ చేసుకొని తర్వాత చూడొచ్చు. అలాగే, ప్రీమియం యూజర్ల కోసం కొంత ప్రత్యేకమైన కంటెంట్ కూడా ఉంటుంది.
యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటే బ్యాక్‍గ్రౌండ్ ప్లే ఫీచర్ కూడా దక్కుతుంది. ఫోన్ లాక్ వేసినా, వేరే యాప్‍లోకి వెళ్లినా బ్యాక్‍గ్రౌండ్‍లో వీడియో ప్లే చేసుకోవచ్చు. ప్రీమియం ఉంటే యూట్యూబ్ మ్యూజిక్ ప్లాట్‍ఫామ్‍ను కూడా వాడుకోవచ్చు. యూట్యూబ్‍లో వచ్చే కొత్త ఫీచర్లు ముందుగా ప్రీమియం సబ్‍స్క్రైబర్లకు అందుబాటులోకి వస్తాయి.
యూట్యూబ్ ఫ్యామిలీ ప్లాన్ ధరను ఏకంగా 58 శాతం పెంచడంపై చాలా మంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ప్లాన్ల రేట్లు తక్కువగానే పెరిగినా.. ఫ్యామిలీ ప్లాన్ విషయంలో రేటును గూగుల్ అధికంగా పెంచేసింది.