YouTube New Features : యూట్యూబ్‌లో 3 కొత్త ఫీచర్లు.. ఇకపై టైమ్ సెట్ చేసి నిద్రపోవచ్చు
YouTube New Features : ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇప్పటికే చాలా అప్డేట్స్ చేసింది. అయితే కొత్తగా మరో మూడు ఫీచర్లను వినియోగదారుల కోసం తెచ్చింది. స్లీప్ టైమర్, డ్రీమ్ క్రియేటర్ స్క్రీన్, ఆన్సర్ బోట్ ఇందులో ఉన్నాయి. వీటి ద్వారా ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
స్లీప్ టైమర్, డ్రీమ్ క్రియేటర్ స్క్రీన్, ఏఐ ఆధారిత ఆన్సర్ బోట్ ఫీచర్లను ప్రయోగాత్మకంగా యూట్యూబ్ విడుదల చేసింది. యూట్యూబ్ స్లీప్ టైమర్ ఫీచర్ మొదట జూన్‌లో టెస్టింగ్ చేస్తున్నట్టుగా కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మరో రెండు కొత్త ఫీచర్లతో పాటు ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా విడుదల చేసింది. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్స్ కోసం మూడు ఫీచర్లను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇందులో ఏఐ చాట్ బోట్ కూడా ఉంది. ఈ కొత్త ఫీచర్ల గురించి మరింత తెలుసుకోండి. ఎందుకంటే అవి తక్కువ కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.
స్లీప్ టైమర్ ఫీచర్
మొదటి ఫీచర్ స్లీప్ టైమర్, పేరు సూచించినట్లుగా ఇది ప్లాట్ ఫామ్‌లో ఏదైనా కంటెంట్‌ను చూస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు టైమర్‌ను సెట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. యూజర్లు తమ మొబైల్, డెస్క్ టాప్‌లోని సెట్టింగ్స్ మెనూ నుంచి స్లీప్ టైమర్ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో యూజర్లు స్లీప్ టైమర్ ఫీచర్‌ను ఉపయోగించి నిర్ణీత సమయం తర్వాత ప్లేయింగ్ వీడియోను ఆటోమేటిక్‌గా నిలిపివేయవచ్చు. వీడియో చూస్తున్నప్పుడు నిద్రపోయే అలవాటు ఉన్నవారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
డ్రీమ్ స్క్రీన్ ఫీచర్
రెండో ఫీచర్‌ను డ్రీమ్ స్క్రీన్ అని పిలుస్తారు. ఇది క్రియేటర్లకు సహాయపడటానికి రూపొందించారు. అంటే మొబైల్ యాప్‌లో ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఏఐని ఉపయోగించి గ్రీన్ స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌ను క్రియేట్ చేసుకోవచ్చని యూట్యూబ్ తెలిపింది. షార్ట్స్ కెమెరాను తెరవడానికి వినియోగదారులు + ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. అప్పుడు వారు గ్రీన్ స్క్రీన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని స్పార్కిల్ ఐకాన్ పై క్లిక్ చేయవచ్చు. ప్రస్తుతం ఇతర భాషల్లో అందుబాటులో లేనందున కేవలం ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ను ఉపయోగించి గ్రీన్ స్క్రీన్ బ్యాక్ గ్రౌండ్స్‌ను తయారు చేసుకోవచ్చని యూట్యూబ్ యూజర్లకు తెలియజేసింది.
ఆన్సర్ బోట్ ఫీచర్
మొబైల్స్ కోసం మాత్రమే లాంచ్ చేసిన మూడో ఫీచర్ ఇది. బ్యాక్ గ్రౌండ్‌లో వీడియో ప్లే అవుతున్నప్పుడు వీడియోకు సంబంధించి సందేహాలను పరిష్కరించుకోవచ్చు. ఏఐ ఆధారిత ఫీచర్ ఇది. సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా, సిఫార్సులను కూడా ఈ ఫీచర్ ఇవ్వగలదు. ప్రస్తుతానికి యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయ్యే అన్ని వీడియోలకు ఈ కొత్త ఫీచర్ ఉండదు. ఇది వీడియో కింద ఉన్న ఆస్క్ ట్యాబ్ రూపంలో అర్హులైనవారికి మాత్రమే వీడియోలలో కనిపిస్తుంది. యూజర్లు ముందుగా సెట్ చేసిన ప్రశ్నలను ఎంచుకోవడంతో పాటు తమ సొంత ప్రశ్నలను టైప్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఈ లేటెస్ట్ ఫీచర్స్ పరిమిత కాలానికి మాత్రమే. సెప్టెంబర్ 2 వరకు యూజర్లు స్లీప్ టైమర్ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. డ్రీమ్ స్క్రీన్ ఆగస్టు 20 వరకు, ఆన్సర్ బోట్‌ను కూడా ఆగస్టు 21 వరకు మాత్రమే వాడుకోవచ్చని తెలిపింది.