No Toll For Cars : వాహనదారులకు అలర్ట్​- ఇక నుంచి ఈ టోల్స్​ వద్ద డబ్బులు కట్టాల్సిన పని లేదు!-no toll for cars suvs entering mumbai announces shinde cabinet ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  No Toll For Cars : వాహనదారులకు అలర్ట్​- ఇక నుంచి ఈ టోల్స్​ వద్ద డబ్బులు కట్టాల్సిన పని లేదు!

No Toll For Cars : వాహనదారులకు అలర్ట్​- ఇక నుంచి ఈ టోల్స్​ వద్ద డబ్బులు కట్టాల్సిన పని లేదు!

Sharath Chitturi HT Telugu
Oct 14, 2024 01:53 PM IST

Mumbai tolls news : మీరు ముంబైకి వెళుతున్నారా? అయితే మీకో గుడ్​ న్యూస్​! ముంబై ప్రవేశంలో ఉండే 5 కీలక ప్లాజాల వద్ద కార్లు, ఎస్​యూవీల ఇక నుంచి టోల్స్​ ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు! ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ శిండే వెల్లడించారు.

ఈ 5 టోల్స్​ దగ్గర ఇక ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు!
ఈ 5 టోల్స్​ దగ్గర ఇక ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు!

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలకు గుడ్​ న్యూస్​ని ఇచ్చింది ఏక్​నాథ్​ శిండే ప్రభుత్వం! దేశ వాణిజ్య రాజధాని ముంబైలోకి ప్రవేశించేందుకు ప్రస్తుతం ఉన్న 5 మార్గాల్లోని టోల్​ బూత్స్​లో ఇక డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఈ మేరకు సీఎం ఏక్​నాథ్​ శిండే కేబినెట్​ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే కార్లు, ఎస్​యూవీలు వంటి లైట్​ వెహికిల్స్​కి టోల్​ ఛార్జీల వసూళ్ల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు, ఈ నిర్ణయం సోమవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ఆ 5 టోల్స్​ దగ్గర డబ్బులు కట్టాల్సిన పని లేదు..!

"ఈ టోల్​ ఛార్జీలను మాఫీ చేయాలని ప్రజలు చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకే ముంబై ఎంట్రీలో ఉన్న 5 టోల్​ ప్లాజాల్లో టోల్స్​ ఛార్జీలను రద్దు చేస్తున్నాము. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది," అని సీఎం ఏక్​నాథ్​ శిండే స్వయంగా చెప్పారు.

దహిసర్​, ఆనంద్​ నగర్​, వైశాలి, ఔరోలి, ములుంద్​ టోల్​ ప్లాజాల్లో ఇక నుంచి లైట్​ వెహికిల్స్​ టోల్స్​ కట్టాల్సిన పని లేదని మహారాష్ట్ర మంత్రి దాదాజి భూసే తెలిపారు.

2002 నుంచి ఈ 5 టోల్స్​ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మహా నగరంలో ఫ్లైఓవర్​ల నిర్మాణానికి అయ్యే ఖర్చులను కవర్​ చేసేందుకు ఈ 5 టోల్స్​ని గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

"2026 వరకు ఈ టోల్స్​లో రూ. 45 నుంచి రూ. 75 వరకు వసూలు చేయాల్సి ఉంది. 2.80లక్షల లైట్​ వెహికిల్స్​తో పాటు మొత్తం 3.5 లక్షల వాహనాలు ఈ టోల్స్​ నుంచి ప్రయాణిస్తాయి. క్యూలో వెయిట్​ చేసే సమయం ఆదా అవుతుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ విషయంపై ప్రభుత్వం చాలా నెలలుగా చర్చలు జరిపింది. చివరికి, ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని నేడు ప్రకటించింది," అని భూసే మీడియాకు తెలిపారు.

ఎన్నికల కోసమేనా?

అయితే ఏక్​నాథ్​ శిండే తీసుకున్న ఈ నిర్ణయం.. ఎన్నికల జిమ్మిక్​ అని విపక్షాలు మండిపడుతున్నాయి.

"ఎన్నికలు సమీపిస్తున్న సయమంలో మీరు ఈ ప్రకటన చేస్తున్నారు. తలుచుకుంటే ముందే మీరు టోల్స్​ని ఆపేయొచ్చు. కానీ అలా చేయలేదు," అని శివసేన ఉద్ధవ్​ ఠాక్రే వర్గానికి చెందిన ఆనంద్​ దూబే ప్రభుత్వాన్ని విమర్శించారు. కేవలం లైట్​ వెయిట్​ వెహికిల్స్​కి మాత్రమే టోల్స్​ మాఫీ చేయడం ఎందుకుని, హెవీ వెయిట్​ వెహికిల్స్​కి కూడా ఈ నిర్ణయం వర్తించేలా చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. లేకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

మరోవైపు ఈ టోల్స్​ వసూళ్లను నిలిపివేయాలని చాలా కాలంగా అడుగుతున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"ఈ నిర్ణయంతో ముంబై ప్రజలు సంతోషంగా ఉంటారు. నేను థానె నుంచి వస్తాను. ప్రతిసారి ఈ టోల్​ చూసి బాధపడతాను. ఇప్పుడు ఉచిత రవాణాతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి మరింత పెరుగుతుంది," అని శివసేన ఎంపీ నరేశ్​ అన్నారు.

2024 మహారాష్ట్ర ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం