AP Toll Gates : రాష్ట్ర రహదారులపై టోల్ గేట్లు..! పీపీపీ మోడల్‌లో నిర్మాణం
Toll Gates in Andhrapradesh: ఏపీలో ఉన్న రాష్ట్ర రహదారులపై టోల్ గేట్లను ఏర్పాటు చేసే విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చేపట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. మరోవైపు ప్రభుత్వ ప్రతిపాదనలపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Toll Gates in Andhrapradesh: రాష్ట్ర రహదారులపైన టోల్‌గేట్లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం ఇక నుంచి పీపీపీ మోడల్‌లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రజలపై భారాలు పడతాయని చర్చ జరుగుతోంది.
అందులో భాగంగానే ఇటీవలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చర్చానీయాంశంగా మారింది. రాష్ట్ర రహదారులను కూడా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లో చేపట్టాలని నిర్ణయించారు.
ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రిత్వ శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు జాతీయ రహదారులకే పరిమితం అయిన టోల్ టాక్స్, ఇప్పుడు రాష్ట్ర రహదారులకు కూడా వర్తిస్తుందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే రోడ్డు ట్యాక్స్ పెరిగి, భరించలేని విధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర రాహదారులపై టోల్‌గేట్లు పెట్టి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తే అదనపు భారమే అవుతుంది. దీనివల్ల ప్రజలపై భారాలు పడతాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలో 8,500 కిలో మీటర్ల మేర జాతీయ రహదారులు, 12,653 కిలో మీటర్ల మేర రాష్ట్ర రహదారులు, 32,725 కిలో మీటర్ల మేర జిల్లా రహదారులు ఉన్నాయి. ఇప్పటికే 8,500 కిలో మీట్లర జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణికులకు, వాహన యజమానులకు టోల్ ఛార్జీల భారం పడుతోంది. ఇప్పుడు 12,653 కిలో మీటర్ల మేర ఉన్న రాష్ట్ర రహదారులను పీపీపీ పద్దతిలో చేపట్టి టోల్ వసూలు చేస్తే ప్రజలపై భారం అధికమవుతుంది.
అయితే 12,653 కిలో మీటర్ల రాష్ట్ర రహదారులు కూడా పీపీపీ పద్దతిలో చేపట్టి టోల్ వసూలు చేసేందుకు గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2016లోనే నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు రాష్ట్రంలో 31 రోడ్లను పీపీపీ పద్దతిలో చేపట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించేసింది. కానీ అప్పటికే కరెంటు ఛార్జీలు పెంపు, రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమంతో అదికాస్తా మధ్యలోనే ఆగిపోయింది.
అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమి చెంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత అది ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు నాటి నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో గుర్తించిన 31 రోడ్లలో 14 రోడ్లను 1,000 కిలో మీటర్ల పరిధిలో యుద్ద ప్రాతిపదికన పీపీపీ మోడల్‌లో చేపట్టేందుకు కార్యచరణను రూపొందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇప్పటికే రోడ్డు ట్యాక్స్ పెరిగడం వల్ల కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర రహదారులకు కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేయడం దారుణమని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేకపోతే మిగతా ట్యాక్స్‌లన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతిపాదనను విరమించుకోవాలి : సీపీఎం
రాష్ట్ర రహదారులపై టోల్ ఛార్జీలు వసూలు చేయాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. రోడ్లను అభివృద్ధి చేయడం, వాటిని సక్రమంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. ఇప్పటికే వాహనదారులకు లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, డీజీల్, పెట్రోల్‌పై సెస్‌లు వేయడంతో భారం పెరుగుతోందని అన్నారు. ఈ ప్రతిపాదన రాష్ట్ర రవాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుందని, రాష్ట్ర ప్రజలపై అదనపు భారం పడకుండా రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్ ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు.