Business Idea For Women : గృహిణులు డబ్బు సంపాదించేందుకు ఆలోచనలు.. పెట్టుబడి తక్కువే
Business Idea For Women : ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. గృహిణులు ఇంటి నుంచి వ్యాపారం ప్రారంభించొచ్చు. తద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాంటి ఆలోచనలు కొన్ని మీ కోసం..
చాలా మంది గృహిణులు జీవితంలో ఏదైనా చేయాలనే తపనతో ఉంటారు. కానీ పరిస్థితులు అనుకూలించక సైలెంట్ అయిపోతారు. మీరు బయట పని చేసేందుకు వీలు లేకపోతే.. ఇంట్లోనే వ్యాపారం ప్రారంభించొచ్చు. మీ కలలను నెరవేర్చుకోవచ్చు. కుటుంబానికి ఆసరాగా ఉండటంతోపాటుగా మీకు కూడా తృప్తి దొరుకుతుంది. గృహిణులు డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడే ఆలోచనలు ఏంటో చూద్దాం..
గిఫ్టింగ్ పరిశ్రమ ప్రస్తుతం ట్రెండింగ్. బట్టలు, నగల నుండి రోజువారీ వస్తువుల వరకు మీరు ప్రతిదీ బహుమతిగా తయారు చేయవచ్చు. మీకు క్రియేటివిటీ ఎక్కువగా ఉంటే.. ఈ వ్యాపారం మీకు చాలా లాభాలను తెచ్చిపెడుతుంది. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, స్నేహితుల దినోత్సవం, ప్రేమికుల రోజు మొదలైన వాటి కోసం మీరు స్వయంగా తయారుచేసిన బహుమతులను విక్రయించే వ్యాపారాన్ని మీరు చేయవచ్చు. మార్కెట్‌లో ఉన్న గిఫ్ట్ షాప్స్‌తో డీల్ కుదుర్చుకోవాలి.
ఆరోగ్యం, ఫిట్‌నెస్ ఇప్పుడు కచ్చితంగా సమయం పెడుతున్నారు చాలా మంది. ఇందుకోసం డబ్బును కూడా ఖర్చు చేస్తున్నారు. మీకు యోగా తెలిసి ఉంటే.. యోగా ట్రైనర్లకు కూడా చాలా డిమాండ్ ఉంది. మీరు గృహిణిగా ప్రారంభించగల అత్యధిక వేతనం పొందే ఉద్యోగాలలో ఇది ఒకటి. మీకు యోగా గురించి లోతైన జ్ఞానం ఉంటే మీరు శిక్షణ ఇవ్వవచ్చు.
ప్రస్తుత యూట్యూబ్ ఛానెల్స్ చాలా ఫేమస్. యూట్యూబ్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఆదాయాన్ని సంపాదించడంలో మీకు ఉపయోగపడుతుంది. అయితే దీనికోసం సమయం కూడా అవసరం. మీరు వీడియో ఎడిటింగ్, థంబ్‌నెయిల్ చేయడం నేర్చుకోవాలి. మంచి కుక్, మేకప్ ఆర్టిస్ట్ అయితే తక్కువ పెట్టుబడితో ఈ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించవచ్చు. వీడియోలను అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. అయితే ఇన్‌కమ్ వచ్చేందుకు కాస్త టైమ్ పడుతుంది.
రుచికరమైన ఇంట్లో వండిన ఆహారానికి డిమాండ్ ఎక్కువ. కేకులు, కుకీలు, లడ్డూలు ఎలా తయారు చేయాలో మీకు బాగా తెలిస్తే ఇంటి వద్దే హోమ్ బేకరీని ప్రారంభించొచ్చు. దాని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మీ బేకరీని ప్రమోట్ చేసుకోవాలి. వ్యాపారం పెరుగుతున్న కొద్దీ, స్విగ్గీ జోమాటోలో ఎంటర్ కావొచ్చు.
జామ్‌లు, జిలేబీలు, చాక్లెట్‌ల నుంచి లడ్డూలు, పచ్చళ్లను తయారు చేయడం మీకు వస్తే మంచి వ్యాపారం అవుతుంది. మీరు చిన్నగా ప్రారంభించవచ్చు. ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే కొద్దీ వ్యాపారాన్ని క్రమంగా విస్తరించుకోవచ్చు. మీకు తెలిసిన అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లు కూడా చిన్న వంటగది నుండి మెుదలయ్యాయని గుర్తుంచుకోండి.
మీరు ఫ్యాషన్, స్టైలింగ్‌ను ఇష్టపడితే బోటిక్ ప్రారంబించండి. ఇది మీకు సరైన వ్యాపారానికి అడుగులు వేసేలా చేస్తుంది. భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ బోటిక్‌ని ఆన్‌లైన్‌లో తెరవవచ్చు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లను పొందవచ్చు. ఇంటి నుంచే కొరియర్ కూడా చేయవచ్చు.
పిల్లలను ట్యూషన్‌కి పంపడం అనేది ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. ఇంటి నుండే ట్యూషన్లు చెబితే బాగా సంపాదించుకోవచ్చు. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లలకు నమ్మకమైన ఉపాధ్యాయుని కోసం చూస్తారు. ఇరుగుపొరుగువారికి మీరు బాగా చదువు చెప్తారనిపిస్తే.. ట్యూషన్ పంపుతారు.
ఫ్రీలాన్సర్‌గా మారడం కూడా మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఇంటి నుండి ఏదైనా మీడియా, బ్లాగులు, సంస్థలకు కంటెంట్‌ను అందించవచ్చు, కథనాలను అందించవచ్చు. దీని ద్వారా ఆదాయం పొందవచ్చు. దీని కోసం మీకు రైటింగ్ నాలెడ్జ్, వీడియో ఎడిటింగ్ పరిజ్ఞానం ఉండాలి.