HCL Tech Q1 Results: క్యూ1 ఫలితాలను ప్రకటించిన హెచ్సీఎల్ టెక్; డివిడెండ్ ఎంతంటే..?
HCL Tech Q1 Results: హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2025 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫైనాన్షియల్ రిజల్ట్స్ ను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో హెచ్సీఎల్ టెక్నాజీస్ రూ.4,257 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది ఆర్థిక గత సంవత్సరం క్యూ 1 కన్నా 20.5% ఎక్కువ.
HCL Tech Q1 Results: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 2025 ఆర్థిక సంవత్సరం తొల త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్ తో ముగిసిన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెచ్ సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 20.5 శాతం పెరిగి రూ.4,257 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.3,534 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సీక్వెన్షియల్ గా కన్సాలిడేటెడ్ నికర లాభం 6.8 శాతం పెరిగింది.
ఆదాయం తగ్గింది..
జూన్ తో ముగిసిన త్రైమాసికం (Q1FY25) లో కంపెనీ కన్సాలిడేటెడ్ మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన దాదాపు 9.5 శాతం క్షీణించి రూ.29,160 కోట్లకు పరిమితమైంది. హెచ్సీఎల్ టెక్ (HCL Tech) 6.7 శాతం ఆదాయ వృద్ధిని అందించిందని, ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ఇవి ఆరోగ్యదాయకమైన ఫలితాలనేనని కంపెనీ ప్రకటించింది. ఈ క్యూ1 (Q1FY25) లో ఈబీఐటీ మార్జిన్లు 17.1 శాతంగా నమోదయ్యాయి. ఈ త్రైమాసికంలో హెచ్సీఎల్ టెక్ రూ.4,257 కోట్ల పీఏటీని సాధించింది.
మెరుగైన ఫలితాలే..
‘‘LTM FCF రూ.21,637 కోట్లు, PATలో 133%, EBITDAలో 88% వద్ద మా నగదు ప్రవాహం బలంగా ఉంది. మా మూలధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నాము. కంపెనీ ఎల్టిఎమ్ ఆర్ఓఐసి 350 బేసిస్ పాయింట్లు పెరిగి 34.6% వద్ద, సేవల వ్యాపారం 476 బేసిస్ పాయింట్లు పెరిగి 42.8% వద్ద ఉంది’’ అని హెచ్సిఎల్ టెక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రతీక్ అగర్వాల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.26,296 కోట్ల నుంచి రూ.28,057 కోట్లకు పెరిగింది. సీక్వెన్షియల్ గా చూస్తే గత త్రైమాసికం (Q4FY24) లో నమోదైన రూ.28,499 కోట్ల నుంచి 1.6 శాతం క్షీణించింది.
డివిడెండ్ ప్రకటన
క్యూ 1 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు డివిడెండ్ ను కూడా హెచ్సీఎల్ టెక్ ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్ (dividend) ను ప్రకటించింది ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్సీఎల్ టెక్ షేరు ధర 3.20 శాతం లాభంతో రూ.1,560.40 వద్ద ముగిసింది. డివిడెండ్ చెల్లింపునకు 2024 జూలై 23ని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. ఈ మధ్యంతర డివిడెండ్ చెల్లింపు తేదీ 2024 ఆగస్టు 1.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకింగ్ కంపెనీలవి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.