MP Raghuramakrishna Raju : ఏపీలో మళ్లీ వైసీపీ సర్కారే, ఎంపీ రఘురామ వీడియో వైరల్- ఆర్ఆర్ఆర్ మారిపోయారా?
MP Raghuramakrishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు...ఏపీలో మళ్లీ జగన్ సర్కార్ వస్తుందని మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన ఆయన వైసీపీ ఛీప్ ట్రిప్ చేస్తుందని మండిపడ్డారు.
MP Raghuramakrishna Raju : వైఎస్ఆర్సీపీ రెంబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో మళ్లీ వైసీపీ సర్కార్ వస్తుందని మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైసీపీ శ్రేణులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు మారిపోయారని ప్రచారం చేస్తున్నారు. ఎంపీ రఘురామ... ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటనలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఎంపీ రఘురామ.. ఏపీలో జగన్ ప్రభుత్వం వస్తుందని, సీఎం జగన్ అన్ని హామీలు నెరవేర్చారని, వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓట్ల శాతం పెరుగుతోందని రఘురామ చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోను వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారు.
పాత వీడియో ప్రచారం
ఈ వీడియోపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలు, మూడున్నర సంవత్సరాల క్రితం జగన్ ప్రభుత్వం గురించి తాను భీమవరంలో మాట్లాడిన ఒక పాత వీడియోని ఇప్పుడు అమెరికాలో మాట్లాడినట్టుగా వైసీపీ సోషల్ మీడియా వాళ్లు మార్పుచేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఏ స్థాయికి దిగజారిపోయారంటే తాను మూడున్నర సంవత్సరాల క్రితం జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడిన ఒక పాత వీడియోని ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉందా? అని ఎద్దేవా చేశారు. మళ్లీ 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలూ మావే అని ఛీప్ పబ్లిసిటీ చేసుకుంటున్నారన్నారు. కొందరు సిగ్గులేని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నిరంకుశ, అరాచక, దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు విశ్రమించేది లేదని ఆయన ట్వీట్ చేశారు.
ఎన్డీఏ చేరేందుకు జగన్ ప్రయత్నాలు
"మరో రెండ్రోజుల్లో సీఎం జగన్ దిల్లీ వెళ్తున్నారు. వైసీపీ ఎన్డీఏలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుంది. జేపీ నడ్డా, అమిత్ షా.. వైసీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. ఏపీలో మళ్లీ వైసీపీ సర్కార్ వస్తుందని ఒక ఫేక్ రిపోర్టు తయారు చేసుకుని దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల్ని కలవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోకండి, వైసీపీ ఎన్డీఏ చేరుతుందని చెప్పేందుకు జగన్ దిల్లీ వెళ్తున్నారు. ఒకవేళ పార్టీలో ఎన్టీఏ చేరకుండా బయటనుంచి మద్దతుగా ఉంటామని చెప్తారా? తెలియాల్సి ఉంది. రేపు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుంది. మళ్లీ ప్రత్యేక హోదా కోసం జగన్ దిల్లీ వెళ్లారని వార్తలు రాస్తారు. టీడీపీ ఎన్డీఏలో చేర్చుకోవద్దని కోరేందుకు జగన్ దిల్లీ వెళ్తున్నారు. అమెరికా పర్యటనలో ఎంపీ రఘురామ రూట్ మార్చారని ఎవరో వార్త రాశారు. ఇదంతా ఫేక్. ఎప్పుడో మాట్లాడింది మార్ఫ్ చేసి వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది"- ఎంపీ రఘురామ