YS Jagan Campaign: నేటి నుంచి జనంలోకి జగన్.. బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి సిద్ధం.. 21రోజుల పర్యటన-ys jagan ready for election campaign with bus tour from idupulapaya ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Campaign: నేటి నుంచి జనంలోకి జగన్.. బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి సిద్ధం.. 21రోజుల పర్యటన

YS Jagan Campaign: నేటి నుంచి జనంలోకి జగన్.. బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి సిద్ధం.. 21రోజుల పర్యటన

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 06:44 AM IST

YS Jagan Campaign: ఏపీ సిఎం జగన్ నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు.

మేమంతా సిద్ధం పేరుతో నేటి  నుంచి సిఎం జగన్ బస్సు యాత్రలు
మేమంతా సిద్ధం పేరుతో నేటి నుంచి సిఎం జగన్ బస్సు యాత్రలు

YS Jagan Campaign: సిఎం జగన్‌ Ys jagan నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ Idupulapaya నుంచి మేమంతా సిద్ధం memantha Siddham పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు జగన్ రెడీ అవుతున్నారు. తొలి రోజు ప్రచారాన్ని కడప పార్లమెంట్‌ నియోజక వర్గం పరిధిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

yearly horoscope entry point

తొలి రోజు యాత్రలో వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా జగన్ బస్సు యాత్ర jagan Bus Yatra సాగనుంది. ప్రొద్దుటూరులో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్‌ రోడ్డు వద్ద రాత్రి శిబిరానికి చేరుకుంటారు. ఆళ్లగడ్డ బైపాస్‌ రోడ్డులోనే రాత్రికి సిఎం జగన్ బస చేస్తారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం Ichhapuram వరకు ఏకబిగిన మొత్తం 21 రోజులపాటు వైఎస్‌ జగన్ బస్సు యాత్ర సాగనుంది. యాత్రలో భాగంగా నిత్యం ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో యాత్ర సాగేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. ప్రతి రోజూ ఉదయం ఆయా నియోజక వర్గాల్లోని వివిధ వర్గాలతో సమావేశం అవుతారు. ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటారు.

అన్ని స్థాయిల వారి నుంచి సలహాలు, సూచనల స్వీకరించనున్నట్టు వైసీపీ వర్గాలు వెల్లడించారు. రోడ్ షోలతో పాటు అయా నియోజక వర్గ ప్రజల అకాంక్షలకు అనుగుణంగా సిఎం ప్రసంగాలు ఉండనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో బహిరంగ సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

తొలిసారి ఆంక్షలు లేకుండా...

ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆంక్షలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా పలు అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లోకి వచ్చినా, పోలీసుల నుంచి తీవ్రమైన ఆంక్షలు ఉండేవి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రజలతో మమేకం అవుతూ జనం సాదకబాధలు వింటూ పాదయాత్రలు, రోడ్‌ షోలు చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక జనానికి పూర్తిగా దూరం అయిపోయారు. మితిమీరిన పోలీసుల ఆంక్షలతో పర్యటనలు జరిగేవి. సాధారణ జనాన్ని ఆమడ దూరంలో ఉంచేయడం అభిమానుల్ని, కార్యకర్తల్ని నిరాశకు గురి చేసేది.

ఎన్నికల వేళ జగన్ మళ్లీ బస్సు యాత్రలతో ప్రజల్లోకి వస్తుండటం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. 58నెలల పాలనా విజయాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధం అయ్యారు. నవరత్నాలతో పాటు నగదు బదిలీ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించిన మేలును ప్రజలకు నేరుగా వివరించనున్నారు. బుధవారం ఇడుపులపాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచారభేరి మోగిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రను జగన్ ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో జరుగుతుంది.

వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే 'సిద్ధం' సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలు మినహా మిగిలిన పార్లమెంట్‌ నియోజక వర్గాల పరిధిలో బస్సు యాత్ర జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉండగా నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర మాదిరే, బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. ఎన్నికలకు ముందే రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం పేరుతో భారీ సభల్ని వైసీపీ నిర్వహించింది. ఉత్తరాంధ్రలోని భీమిలి, ఉత్తర కోస్తాలోని దెందులూరు ,రాయలసీమలో రాప్తాడు, దక్షిణ కోస్తాలో మేదరమెట్లలో నాలుగు సభలు నిర్వహించారు.

తొలి రోజు యాత్ర ఇలా..

సీఎం జగన్‌ బుధవారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు.ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 1.30కు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారు.

ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్‌ చేరుకుంటారు .

అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం