YSRCP on TDP: బాబుకు సానుభూతి వస్తే అప్పుడు ఆలోచిద్దామనుకుంటున్న వైసీపీ
YSRCP on TDP: YSRCP on TDP: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టై రిమాండ్‌కు వెళ్లి నెల రోజులు దాటిపోయింది. ఈ క్రమంలో చంద్రబాబు ఎప్పటికి విడుదలవుతారనే ఆందోళన టీడీపీలో పెరుగుతోంది. మరోవైపు బాబు వ్యవహారంలో నింపాదిగా వేచి చూసే ధోరణి అవలంబించాలని వైసీపీ భావిస్తోంది.
YSRCP on TDP: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో వైసీపీ వ్యూహం ఏమిటనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఆ పార్టీకి సానుభూతి వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిసినా కూడా ఆ పార్టీ వెనకడుగు వేయలేదు. పరిణామాలు ఎలా ఉన్నా ముందుకు పోయేందుకే మొగ్గు చూపింది. పక్కాగా ప్లాన్ చేసి చంద్రబాబును జైలుకు పంపడంలో విజయం సాధించారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆ పరిణామాల నుంచి బాబు వేగంగానే బయటపడతారని టీడీపీ భావించింది. ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే కోర్టుల నుంచి సులువుగా చంద్రబాబు బయటకు వచ్చేస్తారని టీడీపీ ధీమాగా ఉంది. కానీ ఇప్పుడు ఆ పార్టీలో ఆ ధైర్యం కనిపించడం లేదు. చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా అనుకున్న వ్యూహాన్ని వైసీపీ అమలు చేసింది.
అవినీతి కేసుల్లో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం ద్వారా టీడీపీ ఇతర వ్యవహారాలపై దృష్టి పెట్టకుండా చేయగలిగారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఏపీలో మరో రాజకీయ అంశం లేకుండా పోయింది అంతకు ముందు ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టేందుకు టీడీపీ రకరకాల కార్యక్రమాలను నిర్వహించింది. ఓవైపు చంద్రబాబు నాయుడు యాత్రలతో జిల్లా పర్యటనలు నిర్వహిస్తుంటే, లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగించారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రతి నెల తన పర్యటనలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ ఎన్నికల ప్రచారం మొత్తం తారుమారై పోయింది. ఆ పార్టీ ముఖ్య నాయకుడు జైల్లో ఉండటంతో ఇప్పుడు ఆయన్ని బయటకు తీసుకురావడమే టీడీపీకి ముఖ్యమైన టాస్క్‌గా మారింది. చంద్రబాబుతో పాటు లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. మరోవైపు లోకేష్ ఏపీలో కంటే ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. అడపాదడపా వచ్చి పోతున్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీ వ్యవహారాలను మళ్లీ యాక్టివేట్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు.
మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ప్రజల్లో ఉన్న స్పందనపై ప్రభుత్వంతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు ఆరా తీసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తున్నాయి. బాబు అరెస్ట్ తర్వాత ఆందోళనలు, టీడీపీ శ్రేణుల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పడు బేరీజు వేస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు విషయంలో పెద్దగా రియాక్షన్ ఏమి లేదని ప్రభుత్వం భావిస్తోంది. అవసరాన్ని బట్టి పట్టువిడుపులతో వ్యవహరించాలని ఆలోచిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు వస్తాయని భావించినా అవి పరిమిత స్థాయిలోనే ఉండటంతో వైసీపీకి రిలీఫ్ ఇచ్చింది.
మరోవైపు చంద్రబాబుపై వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయాలని యోచిస్తున్నారు.ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వ్యవహారం సుప్రీం కోర్టులో ఉంది. దీంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు, ఫైబర్ గ్రిడ్ కేసులు ఉన్నాయి. వీటితో పాటు సందర్భానికి తగినట్టు కొత్త కేసులు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. అంతిమంగా వీలైననని ఎక్కువ రోజులు చంద్రబాబును జైల్లో ఉంచడం ద్వారా టీడీపీకి నాయకత్వ శూన్యత కల్పించాలని యోచిస్తున్నారు. ఆ పార్టీకి లభించే సానుభూతి సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతానికి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టాలన్నది వైసీపీ వ్యూహంగా ఉంది.
సంబంధిత కథనం