West Godavari News : కుటుంబానికి అండగా మస్కట్ వెళ్లిన మహిళ, తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో మృతి-west godavari woman returned from muscat died with heart attack on bus ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  West Godavari News : కుటుంబానికి అండగా మస్కట్ వెళ్లిన మహిళ, తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో మృతి

West Godavari News : కుటుంబానికి అండగా మస్కట్ వెళ్లిన మహిళ, తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో మృతి

HT Telugu Desk HT Telugu
Aug 28, 2024 02:17 PM IST

West Godavari News : పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబానికి అండగా ఉండేందుకు మస్కట్ వెళ్లిన మహిళ...యజమానులు పెట్టే బాధలు తట్టుకోలేక స్వదేశానికి తిరిగి వచ్చేసింది. అయితే ఇంటికి చేరేలోపే బస్సులో గుండెపోటుతో మరణించింది.

కుటుంబానికి అండగా మస్కట్ వెళ్లిన మహిళ, తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో మృతి
కుటుంబానికి అండగా మస్కట్ వెళ్లిన మహిళ, తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో మృతి

West Godavari News : ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. భ‌ర్తకు చేదోడువాదోడుగా ఉండటానికి, కుటుంబానికి త‌న వంతు స‌హ‌య‌కారిగా ఉండ‌టానికి మ‌స్కట్ వెళ్లిన మ‌హిళ, తిరుగు ప్రయాణంలో ఇంటికి చేర‌కుండానే బ‌స్సులో గుండెపోటుతో మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకోగా, ఆ గ్రామంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

ఈ విషాద ఘ‌ట‌న శ‌నివారం హైద‌రాబాద్ ఎయిర్ పోర్టు నుంచి త‌ణుకు బ‌స్సులో మ‌హిళ వ‌స్తున్న స‌మ‌యంలో చోటు చేసుకుంది. అయితే ఈ విషాద ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అత్తిలి మండ‌లం మంచిలికి చెందిన ప్రభాకర్‌తో తూర్పుగోదావ‌రి జిల్లా కోరుమామిడికి చెందిన బొంతా స‌త్యప‌ద్మకు 15 ఏళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి.

భ‌ర్త ఒక్కడి సంపాద‌న స‌రిపోవ‌టం లేదు. పిల్లల‌ను బాగా చ‌దివించాలంటే సంపాదించుకోవాలని భావించిన స‌త్యప‌ద్మ, ప‌ని కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని భావించింది. కూలి ప‌నులు చేసి దాచుకున్న డ‌బ్బుల‌తో పాటు కొంత అప్పుచేసి ఆ మొత్తాన్ని విజ‌య‌వాడ‌కు చెందిన మ‌హిళా ఏజెంట్‌కు రూ. 2 ల‌క్షలు చెల్లించారు. అలా రెండేళ్ల కింద‌ట స‌త్యప‌ద్మ మ‌స్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడి య‌జ‌మానులు ఇబ్బందుల‌కు గురిచేసేవారు. దానికి తోడు ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది.

సొంతూరుకు తిరిగి వస్తూ

దీంతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల‌ని భావించింది. ఆర్నెల్లుగా తాను స్వదేశానికి వెళ్లిపోతాన‌ని య‌జ‌మానుల వ‌ద్ద మొరపెట్టుకుంటుంది. త‌న భార్యను తీసుకురావాల‌ని ఏజెంట్ వ‌ద్ద భ‌ర్త ఎన్ని సార్లు వేడుకున్నా, ఆ ఏజెంట్ మ‌న‌సు క‌ర‌గ‌లేదు. మీ భార్యను వెన‌క్కి తీసుకురావాలంటే రూ.2 ల‌క్షలు చెల్లించాల‌ని భ‌ర్తతో ఏజెంట్ చెప్పేవాడు. దీంతో గ‌త్యంత‌రం లేక రూ.2 ల‌క్షలు ఏజెంట్‌కు కట్టారు.

దీంతో ఆమె స్వదేశానికి రావ‌డానికి ఏర్పాట్లు చేశారు. ఆమె మ‌స్కట్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చింది. అక్కడ నుంచి త‌ణుకు వెళ్లేందుకు బ‌స్సు ఎక్కింది. బ‌స్సులో ప్రయాణిస్తున్న ఆమె గుండెపోటుతో మ‌ర‌ణించారు. అయితే ఆమె ఆచూకీ తెలుసుకోవ‌డానికి అధికారులు తీవ్ర ప్రయ‌త్నం చేశారు. ఆమె ఎవ‌రో ఎవ‌రికి తెలియ‌ని ప‌రిస్థితి. దీంతో వాయిస్ రికార్డుల‌ను వాట్సాప్ గ్రూప్‌ల్లో షేర్ చేశారు. చివ‌రికి ఆమె ఆచూకీ ల‌భ్యం అయింది.

విజ‌య‌వాడ డిపోకి స‌మాచారం అందించారు. మ‌స్కట్ నుంచి వ‌చ్చిన మ‌హిళ గుండెపోటుతో మృతి చెందిన‌ట్లు విజ‌య‌వాడ బ‌స్సు డిపో నుంచి బాధితుల‌కు ఫోన్ చేశారు. అయితే ఆమెను ఈనెల 30న పంపిస్తామ‌ని కుటుంబీకుల‌కు స‌మాచారం అందించారు. కానీ ఆమెను 24నే పంపించేశారు. డ‌బ్బులు చెల్లించిన త‌రువాత కూడా ఏజెంట్‌ త‌మ‌కు ఎటువంటి స‌మ‌చారం ఇవ్వలేదని, ఆమె ఆరోగ్యం బాగోలేద‌ని త‌మ‌కు చెప్పలేద‌ని భ‌ర్త ప్రభాక‌ర్ క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం