East Godavari: తూర్పుగోదావ‌రి జిల్లాలో దారుణం, అనుమానంతో భార్య‌ను కత్తితో నరికి చంపిన భర్త-atrocious in east godavari district a husband killed his wife with a knife out of suspicion ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  East Godavari: తూర్పుగోదావ‌రి జిల్లాలో దారుణం, అనుమానంతో భార్య‌ను కత్తితో నరికి చంపిన భర్త

East Godavari: తూర్పుగోదావ‌రి జిల్లాలో దారుణం, అనుమానంతో భార్య‌ను కత్తితో నరికి చంపిన భర్త

Sarath chandra.B HT Telugu
Aug 14, 2024 09:40 AM IST

East Godavari:తూర్పుగోదావ‌రి జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో భార్య‌పై భ‌ర్త‌ క‌త్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజక వర్గం సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఈ ఘటన జరిగింది.

తూర్పు గోదావరిలో భర్త చేతిలో హత్యకు గురైన భార్య
తూర్పు గోదావరిలో భర్త చేతిలో హత్యకు గురైన భార్య

East Godavari: తూర్పుగోదావ‌రి జిల్లాలో దారుణ హత్య జరిగింది. భార్యపై అనుమానంతో భ‌ర్త‌ క‌త్తితో దాడి చేశాడు. ఉద‌యం కాల‌కృత్యాల‌ కోసం బ‌హిర్భూమికి వెళ్ళిన భార్య‌ను అక్క‌డే భర్త హ‌త్య చేశాడు. హత్య అనంత‌రం భ‌ర్త ప‌రార‌య్యాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది.

తూర్పుగోదావ‌రి జిల్లా రాజాన‌గ‌రం నియోజ‌వ‌క‌ర్గం సీతాన‌గ‌రం మండలం పురుషోత్త‌ప‌ట్నం గ్రామంలో పాత తొర్రిగ‌డ్డ ఎత్తిపోత‌ల ప‌థ‌కం వ‌ద్ద మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. తూర్పుగోదావ‌రి జిల్లా దేవిప‌ట్నం మండ‌లం దండంగి గ్రామానికి చెందిన చాట్ల జాన్‌, ఆయ‌న భార్య దివ్య భార‌తి గ‌త కొంత కాలంగా పురుషోత్త‌ప‌ట్నం గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు.

పురుషోత్త‌ప‌ట్నం గ్రామంలో వీరు పాన్‌షాప్ నిర్వ‌హిస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు చోటు చేసుకున్నాయి. భార్య దివ్య భార‌తిని భర్త జాన్‌ నిత్యం వేధించేవాడు. ప‌లుసార్లు భౌతికంగా దాడికి పాల్ప‌డ్డాడు. ఎంత చెప్పిన‌ప్ప‌టికీ భ‌ర్త జాన్ వినేవాడు కాదు. నిరంత‌రం గొడ‌వలతో మ‌న‌సు ప్ర‌శాంతంగా లేద‌ని, విసుగు చెందిన భార్య దివ్య భార‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు జాన్‌పై కేసు పెట్టి జైలుకు కూడా పంపించారు. మ‌ళ్లీ జైలు ఉన్న జాన్‌ను విడిపించ‌డానికి దివ్య భార‌తి చాలా క‌ష్ట‌ప‌డింది. చివ‌రికి ఎలాగోలా భ‌ర్త‌ను జైలు నుంచి విడిపించింది. జైలు నుంచి వ‌చ్చిన జాన్, భార్య పిల్ల‌ల‌తో కొన్నాళ్లు బాగానే ఉండేవాడు. ఆ తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కొంత కాలం కాపురం స‌జావుగా సాగింది. త‌రువాత మ‌ళ్లీ భార్య భ‌ర్త‌ల మ‌ధ్య కుటుంబ క‌ల‌హాలు మొద‌లైయ్యాయి. గ‌త ప‌దిహేను రోజులుగా ఇద్దరి మ‌ధ్య వివాదం చోటు చేసుకుంది.

తరచూ భార్య‌పై చేయి చేసుకునేందుకు ప్ర‌య‌త్నించేవాడు. భార్య దివ్య భార‌తి ప్రతిఘటించేది. ఈ గొడ‌వలతో వేగ‌లేక ఇద్ద‌రూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో భార్య‌పై అనుమానం పెంచుకున్న జాన్ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

మంగ‌ళ‌వారం ఉద‌యం దివ్య భార‌తి కాల‌కృత్యాల కోసం బ‌హిర్భూమికి వెళ్లింది. భార్య రాక‌ను పిసిగ‌ట్టి అక్క‌డే కాపు కాసిన భ‌ర్త జాన్ ఒక్క‌సారిగా ఆమెపై క‌త్తితో దాడి చేశాడు. మెడ‌పైన‌, త‌ల‌పై వెనుక‌భాగం, అర‌చేతుల మీద క‌త్తితో న‌రికి క‌డ‌తేర్చాడు.

దివ్యభారతి హత్యను స్థానికులు గుర్తించి పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. స్థానికుల‌ను అడిగి వివ‌రాలు న‌మోదు చేసుకున్నారు. ఆమె భ‌ర్తే దాడికి పాల్ప‌డిన‌ట్లు స్థానికులు పోలీసులు తెలిపారు.

సీతాన‌గ‌రం ఇన్‌ఛార్జి ఎస్ఐ ఆనంద్ కుమార్ సిబ్బందితో క‌లిసి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌నా స్థ‌లానికి క్లూస్ టీం చేరుకుని త‌నిఖీలు చేప‌ట్టి, ఆధారాల‌ను సేక‌రించింది. ప‌రారీలో ఉన్న నిందితుడిని ప‌ట్టుకుంటామ‌ని ఎస్ఐ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో గ్రామ ప్ర‌జ‌ల్లో తీవ్ర భ‌యాందోళ‌న‌లు నెల‌కున్నాయి. దివ్య భార‌తి కుటుంబ స‌భ్యులు, పిల్లలు క‌న్నీరు మున్నీరు అయ్యారు.

( జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)