AP Constable Recruitment: ఏడాదిన్నరగా ఎదురు చూపులు, కానిస్టేబుల్ నియామకాల్లో కదలిక! త్వరలో ఫిజికల్ పరీక్షలు-waiting for a year and a half movement in constable appointments physical exams soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Constable Recruitment: ఏడాదిన్నరగా ఎదురు చూపులు, కానిస్టేబుల్ నియామకాల్లో కదలిక! త్వరలో ఫిజికల్ పరీక్షలు

AP Constable Recruitment: ఏడాదిన్నరగా ఎదురు చూపులు, కానిస్టేబుల్ నియామకాల్లో కదలిక! త్వరలో ఫిజికల్ పరీక్షలు

Bolleddu Sarath Chandra HT Telugu
Aug 27, 2024 03:55 PM IST

AP Constable Recruitment: ఆంధప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ నియామకాల్లో కదలిక వచ్చింది. అడ్డంకులు తొలగించుకుని వీలైనంత త్వరలో రాతపరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల్ని నిర్వహించేందుకు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సిద్ధమవుతోంది.

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో కదలిక
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో కదలిక

AP Constable Recruitment: ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్ నియామకాల్లో కీలక ముందడుగు పడింది. దాదాపు ఏడాదిన్నరగా నిలిచిపోయిన దేహదారుఢ్య పరీక్షల్ని నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సిద్ధమవుతోంది. 2023 మార్చి 9వ తేదీ నుంచి కానిస్టేబుల్ నియామకాలు నిలిచిపోయాయి. 2023 జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 5న ఫలితాలు ఫలితాలు వెలువడ్డాయి.

అర్హులైన వారికి దేహదారుడ్య పరీక్షలు మార్చి 13 నుంచి 20 వరకూ నిర్వహిస్తున్నట్టు ప్రకటించినా మార్చి 9న వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడినా ఆ తర్వాత కూడా వైసీపీ కానిస్టేబుల్ నియామకాలను చేపట్టలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై దృష్టి సారించిన ప్రభుత్వం న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నియామక ప్రక్రియను కొనసాగించాలని ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం అధికారులకు సూచించారుర. అడ్వకేట్ జనరల్ సలహా మేరకు వీలైనంత త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సాంకేతిక కారణాలను సాకుగా చూపించి…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆ‎ధ్వర్యంలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో శారీరక సామర్థ్య పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు బోర్డు ఛైర్మన్ 2023 మార్చి 9న ప్రకటించారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌(PMT), ఫిజికల్ ఎలిజిబిలిటీ(PET) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఏపీలో 6100 కానిస్టేబుల్ నియామకాల కోసం 2022 నవంబర్‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ వెలువరించింది. ఆ తర్వాత రాత పరీక్షలను నిర్వహించింది. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా ఇప్పటికే ప్రాథమిక రాత పరీక్షను కూడా నిర్వహించారు.

ప్రాథమిక రాతపరీక్షల్లో అర్హత సాధించిన వారికి పిఈటీ, పిఎంటి పరీక్షలకు హాజరయ్యేందుకు కాల్‌ లెటర్స్‌ కూడా జారీ చేశారు. 2023 మార్చి 14నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక సామర్ధ్య పరీక్షల్ని నిర్వహించేందుకు బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది. అసెంబ్లీ సమావేశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షల్ని వాయిదా వేశారు.

మరోవైపు కానిస్టేబుల్ ఎంపికల కోసం ముందస్తు షెడ్యూల్ ఖరారు చేసినా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు బోర్డు ఛైర్మన్ ప్రకటించారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని 2023లో ప్రకటించారు.

కానిస్టేబుల్ నియామక పరీక్షల కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 997 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,59,182మంది హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 95,208మంది అర్హత సాధించారు.

ప్రాథమిక పరీక్షల్ని నిర్వహించిన తర్వాత ప్రిలిమినరీ కీను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రాథమిక కీపై 2261 అభ్యంతరాలు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. మరో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు మార్చాలని కోరుతూ 80మంది అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది.

కానిస్టేబుల్ నియామకాలకు భారీగా పోటీ

కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా 2023 జనవరి 22న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,59,182 మంది హాజరయ్యారు. వీరిలో 95,209 మంది (20.73%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు 16 మంది పోటీపడుతున్నారు.

ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 3,63,432 మంది పురుషులు పరీక్ష రాయగా వారిలో 21.42 శాతం మంది, 95,750 మంది మహిళలు పరీక్ష రాయగా వారిలో 18.10 శాతం మంది అర్హత సాధించారు.

కానిస్టేబుల్ నియామక పరీక్షల కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 997 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,59,182మంది హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 95,209మంది అర్హత సాధించారు.

Whats_app_banner