Flights Cancelled : తుపాను ప్రభావం, విశాఖ నుంచి పలు విమానాలు రద్దు, చెన్నై ఎయిర్ పోర్టు మూసివేత
Flights Cancelled : మిచౌంగ్ తుపాను ప్రభావంతో విశాఖ నుంచి నడితే పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. తమిళనాడులోని పలు విమానాలను రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. చెన్నై ఎయిర్ పోర్టు మూసివేశారు.
Flights Cancelled : మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో వర్షాలు కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. విశాఖ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన రెండు సర్వీసులు, విజయవాడకు బయలుదేరాల్సిన సర్వీసును రద్దు చేసినట్లు ఇండిగో పేర్కొంది.
తమిళనాడులో పలు సర్వీసులు రద్దు
తుపాను ప్రభావం ఏపీతో పాటు తమిళనాడులోనూ తీవ్రంగా కనిపిస్తుంది. దీంతో కోయంబత్తూరు- చెన్నై మధ్య నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించినట్లు తెలుస్తోంది.
చెన్నై విమానాశ్రయం మూసివేత
మిచౌంగ్ తుపానుతో చెన్నై అతలాకుతలం అవుతోంది. తీవ్రమైన వర్షాలకు నగరం నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బలమైన గాలులు, తీవ్రమైన వర్షాలతో చెన్నై ఎయిర్ పోర్టు రన్ వే మీదకు వరద నీరు చేరింది. మంగళవారం ఉదయం 9:00 గంటల వరకు చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మిచౌంగ్ తుపాను కారణంగా 10 విమానాలు రద్దు కాగా, నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 20 విమానాలు ఆలస్యమవడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఏపీలో భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తీవ్ర తుపానుగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుపాను కదులుతున్నట్లు పేర్కొంది. గంటకు 8 కి.మీ వేగంతో తుపాను కదులుతుందని, ప్రస్తుతానికి చెన్నైకి 90 కి.మీ, నెల్లూరుకు 170 కి.మీ, బాపట్లకు 300 కి.మీ, మచిలీపట్నానికి 320కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుపానుగా మిచౌంగ్ తీరం దాటనుందన్నారు. తుపాను ప్రభావంతో నేడు,రేపు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
రైళ్లు రద్దు
తుపాను ప్రభావం దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దు చేశారు. తాత్కాలికంగా రైళ్లను దారి మళ్లించారు. రైలు ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేస్తున్నారు. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.