YS Sharmila : గుడికి వెళ్లాలంటే మోదీ పర్మిషన్ కావాలా?, అసోం ఘటనపై రాహుల్ కి ప్రధాని క్షమాపణ చెప్పాలి- వైఎస్ షర్మిల
YS Sharmila : అసోంలో రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు దాడికి యత్నించడం దారుణమని వైఎస్ షర్మిల విమర్శించారు. రాహుల్ గాంధీని కనీసం గుడికి కూడా వెళ్లనివ్వలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ రాహుల్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
YS Sharmila : విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ నిరసన దీక్షలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, కాంగ్రెస్ నేతలు కేవీపీ, గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై అసోంలో దాడికి ప్రయత్నించింనందుకు నిరసనగా దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అసోం ఘటనపై రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. భారత్ జోడో న్యాయ యాత్ర ఈ దేశ పౌరుల హక్కుల కోసం పోరాడే యాత్ర అన్నారు. అసోంలో రాహుల్ గాంధీపై దాడి చేయాలని చూశారని ఆరోపించారు. రాహుల్ కు ప్రమాదం తలపెట్టాలని బీజేపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రశాంతంగా యాత్ర చేసుకొనే పరిస్థితులు కూడా లేవన్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్లా? లేనట్లా అని మోదీ సమాధానం చెప్పాలన్నారు.
ప్రధాని క్షమాపణలు చెప్పాలి
"ఈ దేశం అందరిదీ కాదా? కేవలం బీజేపీ, కార్యకర్తలే ఉండాలా? మిగతా ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వరా? ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీని కనీసం గుడికి కూడా వెళ్లనీయలేదు. అయోధ్యలో రామమందిరానికి అసోంలో రాహుల్ గుడికి వెళ్లనీయక పోవడానికి సంబంధం ఉందా? రాహుల్ ను ఎందుకు ఆలయంలో అనుమతి ఇవ్వలేదో చెప్పాలి. ఈ ఘటనపై మోదీ సమాధానం చెప్పాలి, అసోం ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మోదీ పాలన ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోవాలి. దేశంలో మోదీ నిరంకుశ పాలన ఆగాలి. ప్రజలు ఆలోచన చేయాలి. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి. మీ నిరంకుశ పాలన ఆపకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. రాహుల్ యాత్రను అడ్డుకోవడానికి చూసినందుకు ప్రధాని క్షమాపణ చెప్పాలి"- వైఎస్ షర్మిల
గుడికి వెళ్లాలంటే మోదీ పర్మిషన్ కావాలా?
అసోం పీసీసీ అధ్యక్షుడిపై దాడి అమానుషమని వైఎస్ షర్మిల అన్నారు. దేశంలో హక్కుల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. భారత్ జోడో యాత్రపై బీజేపీ దాడులు చేస్తుందన్నారు. బీజేపీ గూండాలు గుంపులుగా వచ్చి న్యాయ యాత్రలో పాల్గొన్న వారిపై దాడులు చేసి గాయపరిచారని విమర్శించారు. రాహుల్ గాంధీపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. ప్రశాంతంగా జరుగుతున్న యాత్రలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాహుల్ గాంధీ అసోంలో గుడికి వెళ్తే అడ్డుకున్నారని, గుడికి వెళ్లాలంటే మోదీ పర్మిషన్ కావాలా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజలకు గుడులకు వెళ్లే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. మోదీ నిరంకుశ పాలన ఆపకపోతే...ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అసోం దాడిపై మోదీ కాంగ్రెస్ కి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీకి చేదు అనుభవం
భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అసోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. నగావ్ జిల్లాలోని బోర్దువాలోని శంకర్ దేవ్ ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల్ గాంధీ వెళ్లగా, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఆలయాన్ని సందర్శించేందుకు అనుమతి లేదంటూ రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నాయకులను సైతం హైబోరాగావ్ వద్ద అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి రాహుల్ గాంధీ నిరసన తెలిపారు. తనను అడ్డుకోవడానికి కారణం ఏంటని ఆలయ సిబ్బందిని రాహుల్ ప్రశ్నించారు. ప్రజల మతపర స్వేచ్ఛను ప్రభుత్వాలు అడ్డుకోవడంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాహుల్ గాంధీ ఆలయ సందర్శనకు అధికారులు అనుమతి ఇచ్చారు.