Visakha Control Room : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విశాఖ కలెక్టరేట్‌లో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలోని వివిధ పోలీస్, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి సహకారం కావాలన్నా కంట్రోల్ రూమ్ లను సంప్రదించాలని సూచించారు.
విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో మట్టి జారుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గోపాలపట్నంలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి ఇళ్లు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. కొండవాలు ప్రాంతాల్లోని సుమారు 50 ఇళ్లకు ప్రమాదం పొంచి ఉంది. భారీ వర్షాలకు కొండపై ఉన్న ఇళ్ల కింద మట్టి జారిపోతుండటంతో ఇళ్లు కూలిపోయే పరిస్థితి నెలకొంది. నగరంలోని గోపాలపట్నం, రామకృష్ణనగర్, కాళీమాత టెంపుల్ మార్గాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడితే ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. అధికారులు అప్రమత్తమై అక్కడి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
సంబంధిత కథనం