Loco Pilot Murder: ఉపాధి కోసం వచ్చి ఉసురు తీశాడు, వీడిన విజయవాడ రైల్వే లోకో పైలట్ మర్డర్ మిస్టరీ
Loco Pilot Murder:విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరిగిన లోకో పైలట్ మర్డర్ మిస్టరీ వీడింది. బీహార్ నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చిన వలస కార్మికుడు ఉపాధి దొరక్క డబ్బు కోసం హత్యకు పాల్పడినట్టు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Loco Pilot Murder: విజయవాడలో సంచలనం సృష్టించిన లోకో పైలట్ మర్డర్ మిస్టరీ వీడింది. బీహార్‌లోని బక్సర్ జిల్లా బారు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే దేవ కుమార్ సాహో రైల్వే లోకో పైలట్ ఎబినేజర్‌ను హత్య చేసిట్టు గుర్తించారు. గురువారం తెల్లవారు జామున విజయవాడ రైల్వే స్టేషన్ శివార్లలోని ఎఫ్ క్యాబిన్ వద్ద విధులలో ఉన్న లోకో పైలట్‌పై నిందితుడు ఇనుప రాడ్డుతో దాడి చేశాడు.
డబ్బు కోసమే లోకో పైలట్ పై నిందితుడు దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. పది రోజుల క్రితం ఉపాధి కోసం బీహార్‌లోని బక్సర్ నుంచి విజయవాడకు వచ్చిన సాహోకు ఎక్కడా పని దొరకలేదు. దీంతో తీవ్రమైన ఒత్తడితో డబ్బు కోసం ఏదైనా నేరానికి పాల్పడాలని భావించాడు.
ఇంద్రకీలాద్రి వద్ద దసరా ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి మత్తులో హంగామా సృష్టించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వదిలేశారు. అక్కడి నుంచి కాలినడకన బయల్దేరి ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్‌పై రాయితో దాడి చేశాడు. డ్రైవర్ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
నైజాంగేటు రైల్వే ట్రాక్ వెంబడి స్టేషన్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. అక్కడ గూడ్స్ బోగీలను ప్లాట్‌ఫాం మీదకు షంటింగ్ చేస్తున్న డ్రైవర్ వద్ద డబ్బులు ఉంటాయని భావించి అతడిని డబ్బులు అడిగాడు. డబ్బులిచ్చేందుకు డ్రైవర్ నిరాకరించడంతో అతనిపై ఇనుప రాడ్డుతో దాడి చేసినట్టు జిఆర్పీ ఏసీపీ రత్నరాజు తెలిపారు.
లోకో పైలట్ మీద అగంతకుడు దాడి చేస్తున్న విషయాన్ని ట్రాక్‌పై విధుల్లో ఉన్న కీమెన్ గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. యార్డులో విధుల్లో ఉన్న మరో కో పైలట్ పృధ్వీరాజ్‌కు కీమెన్ సమాచారం ఇవ్వడంతో మరికొంతమంది రైల్వే కార్మికులతో కలిసి తొలుత రైల్వే ఆస్పత్రికి, అక్కడి నుంచి మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. రైల్వే డ్రైవర్ హత్య తర్వాత ప్రత్యేక బృందాలు రైల్వే ప్రాంగణాల్లో గాలింపు చేపట్టడంతో కృష్ణాజిల్లా దోసపాడు రైల్వే స్టేషన్‌లో నిందితుడు పట్టుబడ్డాడు.
సిబ్బంది లేరు..యార్డులో పర్యవేక్షణ సాధ్యం కాదు..
విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరప ప్రాంతాల్లో గత రెండేళ్లలో ఆరు హత్యలు జరిగాయి. నిర్మానుష్యంగా ఉండటంతో గంజాయి ముఠాలు తిష్ట వేస్తున్నాయి. రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించే రైల్వే సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారు. రైల్వే యార్డుల్లో కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.
రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న నైజాంగేట్ లెవల్ క్రాసింగ్‌ను పూర్తిగా మూసేయడంతో సాధారణ ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అదనుగా గంజాయి సేవించడానికి యువతకు అడ్డాలుగా మారాయి. రైల్వే పరిధిలోని ప్రాంతాల్లో నిఘా బాధ్యత తమది కాదని స్థానిక పోలీసులు వదిలేస్తున్నారు.
విజయవాడ రైల్వే జిఆర్పీ పరిధిలో 70మంది పోలీసులు విధులు నిర్వర్తించాల్సి ఉంటే ప్రస్తుతం 17మంది మాత్రమే సిబ్బంది అందుబాటులో ఉన్నారు. కనీసం మూడో వంతు కూడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దీంతో రైల్వే స్టేషన్‌లో భద్రతతో పాటు రైల్వే పరిసర ప్రాంతాల్లో నిఘాను పూర్తిగా వదిలేశారు.
రైల్వేకు చెందిన పరిసర ప్రాంతాల్లో ఆర్పీఎఫ్ భద్రత అంతంత మాత్రంగానే ఉంటోంది. ఆదాయపరంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యధికంగా ఆదాయాన్ని సంపాదించే విజయవాడ రైల్వే స్టేషన్‌లో కనీస భద్రతా ఏర్పాట్లు కూడా లేవు. తగినంత సిబ్బంది లేకుండా తాము ఏమి చేయలేమని జిఆర్పీ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
విజయవాడ రైల్వే స్టేషన్‌లో విధులతో పాటు ఇతర బాధ్యతల పర్యవేక్షణ చేపట్టాలంటే స్థానిక పోలీసుల సహకారం కూడా ఉండాలని జిఆర్పీ అధికారులు చెబుతున్నారు. విజయవాడ డివిజన్‌కు పశ్చిమగోదారి జిల్లా, విజయవాడ కమిషనరేట్, కృష్ణ జిల్లా పోలీసుల నుంచి సిబ్బందిని కేటాయించాల్సి ఉంటుంది. అయా జిల్లాల నుంచి పోలీసుల్ని రైల్వే విధులకు ఇవ్వకపోవడంతోనే రైల్వే స్టేషన్ పరిసరాల్లో వరుస హత్యలు జరుగుతున్నాయని చెబుతున్నారు.